వరి కోతల అనంతరం గడ్డిని కట్టలుగా కట్టేందుకు ఉపయోగించే ‘బేలర్’ యంత్రం రైతన్నలకు వరంలా మారింది. కూలీల కొరత, అధిక కూలి సమస్యలను అధిగమించేందుకు ప్రస్తుతం అన్నదాతలు ఈ యంత్రాన్ని అధికంగా వినియోగిస్తున్నారు. ఈ మెషిన్‌కు ఒక్క రోజులో దాదాపు పది ఎకరాల్లో గడ్డిని చుట్టే సామర్థ్యం ఉంది. ఒక్కో కట్టకు రూ.35 వసూలు చేస్తుండగా తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో పని అయిపోతుండడంతో ఈ విధానానికే ఎక్కువమంది మొగ్గుచూపుతున్నారు. పశుగ్రాసం సేకరణ పెరగడంతో పాడి రైతులు సైతం పశుసంపద పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నారు.
– నిజాంపేట, నవంబర్ 11
ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో పెనుమార్పులు వస్తున్నాయి. పూర్వం రైతులు వ్యవసాయ పనుల కోసం పశువులపై ఆధారపడేవారు. అయితే, అన్ని రంగాల మాదిరిగానే ప్రస్తుతం వ్యవసాయరంగం కూడా యాంత్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నది. రైతుల అవసరాలకు తగినట్లుగా కంపెనీలు సైతం అనేక యంత్రాలను తయారుచేస్తున్నాయి. వరి సాగులో నాటు నుంచి కోత వరకు వివిధ స్థాయిల్లో అన్నదాతలు యంత్రాలను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం చాలామంది రైతులు కోతకు వచ్చిన వరి చేనును కోయించడానికి కూలీలకు బదులుగా హార్వెస్టర్ యంత్రాలను ఆశ్రయిస్తున్నారు.
దీనివల్ల నూర్పిడి ప్రక్రియ అనంతరం పశుగ్రాసం సేకరణకు ఇబ్బంది ఎదురవుతున్నది. వరిగడ్డిని కట్టలు కట్టేందుకు కూలీల కొరత ఒక కారణం కాగా, వచ్చేవాళ్లు పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తుండడం మరొక సమస్య. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో బేలర్(గడ్డి చుట్టే యంత్రం) అందుబాటులోకి రావడంతో రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. ఈ యంత్రంతో తక్కువ సమయంలో ఎక్కువగా పశుగ్రాసాన్ని సేకరించడానికి వీలవుతున్నది. యంత్రం యజమానులు ఒక్క కట్టకు రూ.35చొప్పున రైతుల నుంచి వసూలు చేస్తున్నారు.
నాడు గడ్డిని ఇంటి ఆవరణ లేదా పొలంలోనో గడ్డివాముగా పెట్టుకునేవారు. అయితే, నేడు హారెస్టర్తో కోసిన గడ్డిలో దుమ్మూ, ధూళి ఎక్కువ ఉంటుందని, పనిచేసేటప్పుడు తమకు ఊపిరి ఆడదని చాలామంది కూలీలు పనికి వచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఈ తరుణంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ పశుగ్రాసాన్ని చుట్టలుగా చుట్టే బేలర్ యంత్రం దాదాపుగా ఒక్క రోజులో 10 ఎకరాల పైనే గడ్డిని కట్టలుగా చుడుతుంది. పాడి రైతులకు ఈ యంత్రం వరమేనని చెప్పవచ్చు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఈ యంత్రంతో పశుగ్రాసాన్ని ఎక్కువగా సేకరిస్తుండడంతో పాడి రైతులు పశుసంపద పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నారు.
గడ్డిని పంజాలుగా కట్టిద్దామని కూలీలను పిలిస్తే ఎవరూ రావడం లేదు. బేలర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పశువులకు గడ్డి కొరత సమస్య పూర్తిగా పరిష్కారమైంది. తక్కువ సమయంలో ఎక్కువగా గడ్డిని చుట్టలుగా చుడుతుంది. ఈ యంత్రం ఉందన్న భరోసాతో నేను 38 బర్రెలను కొనుగోలు చేశాను. వాటికి ఎప్పటికీ గడ్డి సమస్య రాకుండా ఉండడానికి దాదాపుగా 2 వేల వరకు గడ్డి కట్టలను బేలర్‌తో కట్టించాను. ఒక గడ్డి కట్టకు రూ.35ల చొప్పున రూ.70 వేలు కేవలం గడ్డి సేకరణకు మాత్రమే ఖర్చు చేశాను. గడ్డి కట్టలను ట్రాక్టర్లో ఒక చోటుకు తరలించి గడ్డివాము పేర్చాను.
– బక్కోల్ల బాగులు, రైతు, నిజాంపేట
కోతకు వచ్చిన వరి పంటను హార్వెస్టర్‌తో కోసిన తరువాత పశుగ్రాస సేకరణ ఇబ్బంది ఉండేది. కూలీల సమస్య, సమయం, డబ్బుల సమస్యలు రైతులకు భారంగా మారేవి. బేలర్ ద్వారా చుట్టిన గడ్డి కట్టలను ఎక్కడికంటే అక్కడికి చాలా సులువుగా తరలించడం వీలవుతుంది. ఈ పని చేసేందుకు సమయంతో పాటు ఖర్చు చాలా తక్కువ. అందుకే ఈ యంత్రం రైతులకు వరంగా మారింది.
– సతీశ్, మండల వ్యవసాయాధికారి, నిజాంపేట
బేలర్‌తో చుట్టిన గడ్డి కట్టలు నిల్వ చేయడం ఎంతో సులువు. ఒక వేళ వ్యవసాయ క్షేత్రంలో గడ్డి కట్టలు చుడితే ట్రాక్టర్, ఆటో లేదా ఎడ్ల బండిపై ఒక చోటు నుంచి మరొక చోటుకు సులభంగా తరలించవచ్చు. ఎత్తడం, దించడం కూడా చాలా సులువు అవుతుంది. దీని వల్ల సమయంతో పాటు డబ్బు ఆదా అవుతుంది. ఒకప్పుడు గడ్డిని ఎక్కడికైనా తరలించాలంటే ఇద్దరు లేదా ముగ్గురు కలిసి పనిచేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఒక్క మనిషి ఉన్నా సరిపోతుంది. చుట్టలుగా ఉండడంతో బరువు కూడా పెద్దగా అనిపించదు.