పోడు భూముల సర్వే వేగవంతం చేయాలని రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ సంగారెడ్డి,మెదక్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసు, పంచాయతీ, రెవెన్యూ, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేసి, నిబంధనల మేరకు ఈ నెలాఖరులోగా సర్వేను పూర్తి చేయాలని సూచించారు. గ్రామ, డివిజన్ స్థాయి సమావేశాలు నిర్వహించి తీర్మానాలు చేయాలన్నారు. డిసెంబర్ మొదటి వారంలో అర్హులకు పట్టాలు ఇచ్చేందుకు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలన్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్/మెదక్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : ఈ నెలాఖరు వరకు పోడు భూముల సర్వే పూర్తి చేసి, ప్రతి గ్రామం సభ, డివిజన్ సభ, జిల్లా సభలు పూర్తి చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పోడు భూముల సర్వే, ధరణి దరఖాస్తులు తదితర అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ పోడు భూముల సర్వే ప్రక్రియ పకడ్బందీగా పూర్తిచేయాలని, ఎకడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజల సందేహాలు నివృత్తి చేస్తూ కట్టుదిట్టంగా సర్వే పనులు పూర్తిచేయాలన్నారు. డిసెంబర్ మొదటి వారంలో అర్హులైన వారికి ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు అందించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారని, నెలాఖరు వరకు పోడు భూముల సర్వే, గ్రామసభ, డివిజన్ సభ జిల్లా స్థాయి సభలు నిర్వహణ పూర్తి కావాలని మంత్రి పేరొన్నారు.
జిల్లాలో ఎట్టి పరిస్థితులలో నూతన అటవీ భూముల ఆక్రమణకు అనుమతించరాదని, అటవీ, రెవెన్యూ అధికారులు, సమన్వయంతో పనిచేసి గ్రామస్తులకు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. అనంతరం సీఎస్ సోమేశ్ కుమార్ పోడు భూముల సర్వే ప్రక్రియ పురోగతిపై జిల్లాల వారీగా రివ్యూ నిర్వహించారు. ధరణి టీఎం 33 మాడ్యుల్లో పెండింగ్ దరఖాస్తుల పురోగతిపై జిల్లాల వారీగా సమీక్షించారు.
సంగారెడ్డి జిల్లాలో 3,479.9 ఎకరాలకు 3,903 దరఖాస్తులు అందాయని కలెక్టర్ డాక్టర్ శరత్ సీఎస్‌కు వివరించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఎఫ్‌వో రవి ప్రసాద్, గిరిజన అభివృద్ధి అధికారి కేశురాం, డీపీవో తరుణ్, సంగారెడ్డి జిల్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీఎఫ్‌వో శ్రీధర్‌రావు పాల్గొన్నారు.