మునిపల్లి, నవంబర్ 11 : మండలంలోని చిన్నచల్మెడలో శుక్రవారం తెల్లవారు జామున ప్రతికార హత్య చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మండల పరిధిలోని చిన్నచల్మెడ గ్రామానికి చెందిన బేగరి ఆనంద్ (28)ను అదే గ్రామానికి చెందిన తలారి అంబయ్య,(భార్య) స్వరూప,(కుమారుడు)ప్రభుదాస్ ఉదయం ఆనంద్‌ను నడిరోడ్డుపై గొడ్డలితో అతి దారుణంగా నరికి చంపేశారు. గతేడాది కింద చిన్నచల్మెడ గ్రామానికి చెందిన తలారి అంబయ్య చిన్న కొడుకు(ప్రవీణ్)ను బేగరి ఆనంద్ (నేడు హత్యకు గురైన వ్యక్తి) దారుణంగా హత్య చేశాడు.
కొడును చంపినందుకే ప్రతీకార హత్య చేసినట్లు వారు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. చిన్నచల్మెడలో జరిగిన హత్య అచ్చం సినిమాలో ఘటనను తలపించేలా హత్య చేసి తల, చేతులు వేర్వేరుగా నరికి నడిరోడ్డుపై పడేశారు. మృతదేహాన్ని చూసేందుకు రాకుండా అతి భయంకరంగా హత్య చేయడంతో చిన్నచల్మెడ గ్రామస్తులు తీవ్ర భయందోళనకు గురయ్యారు.
గతేడాది అంబయ్య చిన్న కొడుకు(ప్రవీణ్)ను చంపిన వ్యక్తి నిత్యం కండ్ల ముందు తిరుగుతుండడంతో జీర్ణించుకోలేని అంబయ్య కుటుంబ సభ్యులు అంబయ్య, స్వరూప,ప్రభుదాస్ శుక్రవారం తెల్లవారు జామున రోడ్డుపై వాకింగ్ వెళ్లే క్రమంలో కండ్లలో కరంపొడి చల్లి మూకుమ్మడిగా దాడి చేసి తల, చేతులు వేరు చేసి దారుణంగా హత్య చేశారు. హత్య చేసిన అంబయ్య కుటుంబ సభ్యులు తమ అదుపులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తండ్రి మొగులయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొండాపూర్ సీఐ సంతోశ్ కుమార్, మునిపల్లి ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
చిన్నచల్మెడలో శుక్రవారం హత్యకు గురైన బేగరి ఆనంద్‌కు నాలుగేండ్ల కింద రాయికోడ్ మండలం ఇసుపూర్ గ్రామానికి చెందిన ఓ యువతితో వివా హం జరిగింది. వివాహం జరిగిన కొన్ని రోజుల నుంచి ఆనంద్ మద్యానికి బానిసై నిత్యం భార్యను కొట్టడంతో ఆమె పుట్టింట్లో ఉంటున్నది. పెద్దలు పలుమార్లు పంచాయితీలు పెట్టి నచ్చజెప్పినా ఆనంద్ తీరు మార్చుకోకపోవడంతో భార్య తల్లిగారింటి వద్దనే ఉంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
శుక్రవారం మండల పరిధిలోని చిన్నచల్మెడ గ్రామంలో హత్యకు గురైన బేగరి ఆనంద్(28) గతేడాది మునిపల్లి పోలీస్ పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపిచారు. చిన్నచల్మెడ గ్రామానికి చెందిన తలారి ప్రవీణ్ (23)ను దారుణంగా హత్య చేసిన కేసులో ఆనంద్‌పై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. అంతే కాకుండా జైలు నుంచి బయటకు వచ్చిన కొన్ని రోజుల కింద ఆనంద్ తల్లి (నర్సమ్మ) అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆనంద్ తల్లి మృతికి కారణం కొడుకే అన్న విషయం గ్రామస్తులకు తెలిసినా గుట్టుచప్పుడు కాకుం డా ఆనంద్ సమక్షంలో తల్లి అంత్యక్రియలు పూర్తి చేశారు.