సిద్దిపేట, నవంబర్ 11: గ్రామీణా ప్రాంత క్రీడాకారులకు మంచి క్రీడా సౌకర్యాలు మట్టిలోమణిక్యాలు సైతం ఛాంపియన్లగా మారుతారని నిరుపిస్తున్నారు.రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సిద్దిపేటను క్రీడాహబ్‌గా తయారు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సిద్దిపేటలోఅనేక క్రీడా మైదానాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాటు చేశారు. వీటిని ఉపయోగించుకుంటూ గ్రామీణ ప్రాంత క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలలో సత్తాచాటుతూ జిల్లాకు పేరు తీసుకువస్తున్నారు. ముఖ్యంగా అథ్లెటిక్ క్రీడాకారులు తమ ప్రతిభకు పదును పెడుతూ రాణిస్తున్న వైనంపై నమస్తే తెలంగాణ కథనం….
సిద్దిపేట జిల్లాను అన్ని రంగాలతో పాటు క్రీడల్లో అగ్రస్థానంలో నిలపాలన్న లక్ష్యంతో మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటలో అన్ని క్రీడలకు సంబంధించిన క్రీడా సౌకర్యాలను ఏర్పాటు చేశారు. దీంతో సిద్దిపేట జిల్లా క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణిస్తున్నారు. ముఖ్యంగా జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలను క్రీడాకారులను తయారు చేస్తున్నారు. ఇందుకోసం అథ్లెటిక్ సంఘం కార్యదర్శి, కోచ్ వెంకటస్వామి, అసిస్టెంట్ కోచ్ కృష్ణకుమార్ల ఆధ్వర్యంలో నిత్యం సిద్దిపేటలోని డీగ్రీ కాలేజీ మైదానంలో ఉదయం 5.30 గంటల నుంచి నిత్యం 30 మందికి కఠోర సాధన చేస్తున్నారు. దీంతో రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకాలు సాధిస్తూ తమ సత్తా చాటుతున్నారు. మరోవైపు గురుకుల పాఠశాలల్లోనూ క్రీడా సౌకర్యాలు పెరగడంతో అక్కడి విద్యార్థులు ఆథ్లెటిక్ పోటీలలో రాణిస్తున్నారు. వీరి ప్రతిభకు మరింత పదును పెడితే జాతీయ స్థాయిలో రాణించి సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఇటీవల హన్మకొండలో జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు 12 పతకాలు సాధించి తమ ప్రతిభను నిరుపించుకున్నారు. అందులో ముగ్గురు క్రీడాకారులు బంగారు పతకాలు సాధించి తమ సత్తాచాటారు.
దేశానికి.. ఆడాలన్నదే నా లక్ష్యం
హైమర్ త్రోలో జాతీయ జట్టుకు ఆడాలన్నదే నా లక్ష్యం. అమ్మనాన్నలు వ్యవసాయం చేస్తారు. నేను సిద్దిపేటకు వచ్చిన తర్వాత కోచ్ వెంకటస్వామి శిక్షణలో నిత్యం ప్రాక్టీస్ చేస్తున్నా. భారత ఆర్మీలో ఉద్యోగం చేయాలన్నదే నా ధ్యేయం. ఇప్పటి వరకు రెండుసార్లు హన్మకొండలో స్టేట్‌మీట్ ఆడాను. గత యేడాది కాంస్యం పతకం వచ్చింది. ఈ సంవత్సరం హన్మకొండలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించాను. -గుగులోత్ తిరుపతి నాయక్, క్రీడాకారుడు హైమర్ త్రో, గోల్డ్ మెడల్, మల్చెతండా, హుస్నాబాద్
మంత్రి హరీశ్‌రావు సహకారంతో ఫలితాలు
సిద్దిపేటలో క్రీడలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో, మంత్రి హరీశ్‌రావు సహకా రంతో జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ డిగ్రీ కాలేజీ మైదానంలో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయి పోటీల్లో మూడు బంగారు పతకాలతో సహ మొత్తం 12 పతకాలు సాధించాం. భవిష్యత్‌లోనూ మరిన్ని పతకాలు సాధించి జిల్లాను అగ్రస్థానంలో నిలుపుతాం.
– కె.వెంకట స్వామి, అసోసియేషన్ కార్యదర్శి