జనగామ-సిద్దిపేట జాతీయ రహదారి అభివృద్ధిపై బీజేపీ సర్కారు నిర్లక్ష్యం
సిద్దిపేట, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సిద్దిపేట జిల్లా దుద్దెడ జంక్షన్ నుంచి చేర్యాల మీదుగా జనగామకు వెళ్లే రహదారి ప్రయాణికులు, వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. రోజు వందలాది వాహనాలు నడిచే ఈ రహదారిపై నుంచే వెళ్తున్నాయి. రోడ్డుపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడడంతో ప్రయాణం సాహసయాత్రగా తయారైంది. అడుగుకో గుంతతో అనే ప్రమాదాలతో నెత్తురోడుతున్నది. రహదారిపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడడంతో వాహనదారులు ఇవి తప్పించడానికి ప్రయత్నం చేయడంతో ఎదురుగా వచ్చే వాహనాల డ్రైవర్లు అయోమయానికి గురి కావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ద్విచక్ర వాహనదారులు కుటుంబ సభ్యులతో వెళ్తూ అదుపుతప్పి రోడ్డుపై పడి తీవ్రగాయాల పాలైన సంఘనలు చాలానే ఉన్నాయి. ఇంత జరుగుతున్నా రహదారి విస్తరణ పనులు చేపట్టకపోవడంపై కేంద్ర ప్రభుత్వ తీరుపై ప్రజలు భగ్గుమంటున్నారు. దీనిని 365బీ జాతీయ రహదారిగా మార్చినప్పటికీ పనుల్లో పురోగతి లేదు.
కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. ఈ రహదారికి కావాల్సిన నిధులు మంజూరు చేయడంతో పాటు పనులు త్వరగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. నిధులు మంజూరయ్యేలా తీవ్రంగా కృషి చేసింది. ఎట్టకేలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నుంచి సిద్దిపేట, దుద్దెడ, చేర్యాల మీదుగా బచ్చన్నపేట, జనగామ నుంచి సూర్యాపేట రహదారికి కలిపేలా జాతీయ రహదారిగా మారుస్తూ నిధులు మంజూరు చేసింది. పనులు జాప్యం అవుతుండడంతో రహదారి విస్తరణ పనులు త్వరగా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ ఆధ్వర్యంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నేతృత్వంలో చేర్యాల పట్టణంలో రాస్తారోకో సైతం చేశారు. కాగా, ఇటీవల మంత్రి హరీశ్‌రావు సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, రహదారి విస్తరణ పనులు త్వరగా చేపట్టాలని అదేశించారు. మంత్రి ఆదేశాలతో రహదారి విస్తరణ పనులను త్వరలో ప్రారంభిస్తామని, ఈలోగా రోడ్డుపై ప్యాచ్ వర్కులు చేపట్టనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
సిద్దిపేట జిల్లాలోని దుద్దెడ జంక్షన్(రాజీవ్హ్రదారి) నుంచి చేర్యాల పట్టణం మీదుగా బచ్చన్నపేట, జనగామ వరకు ఈ రహదారి 46 కిలోమీటర్లు ఉంటుంది. దీంట్లో దుద్దెడ జంక్షన్ నుంచి బచ్చన్నపేట వరకు తారు ఎగిరిపోయి సుమారు 29 కిలోమీటర్లు అడుగడుగునా గుంతలే ఉన్నాయి. బచ్చన్నపేట నుంచి జనగామ వరకు కొంత రహదారి బాగానే ఉంది. నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా ఉండే రహదారి విస్తరణ పనులు త్వరగా చేపట్టాలని ఇక్కడి ప్రాంత ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. కొన్నేండ్లుగా ఈ రోడ్డు అధ్వానంగా తయారైంది. ఈ రహదారిని జాతీయ రహదారిగా మార్చారు. దీనికి 365బీ అని నామకరణం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నుంచి సిద్దిపేట మీదుగా దుద్దెడ, చేర్యాల, బచ్చన్నపేట, జనగామ మీదుగా సూర్యాపేట వరకు ఈ రోడ్డు వెళ్తుంది. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు ఈ రహదారి కలుస్తుంది. వ్యాపార, వాణిజ్య సంబంధాలు ఎక్కువగా ఉండడంతో నిత్యం వందలాది వాహనాలు ఈ రహదారి మీదుగా నడుస్తుంటాయి. దీంతో రహదారి గత నాలుగైదు ఏండ్ల నుంచి పూర్తిగా పాడైపోయింది. దుద్దెడ జంక్షన్ నుంచి చేర్యాల పట్టణం మీదుగా బచ్చన్నపేట వరకు రహదారి పూర్తిగా పాడైపోయింది. తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
46 కిలోమీటర్ల మేర అభివృద్ధికి రూ.423 కోట్లు
జాతీయ రహదారికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పలుసార్లు ప్రతిపాదనలు పంపడంతో ఎట్టకేలకు గత జనవరిలో దుద్దెడ జంక్షన్ నుంచి జనగామ వరకు జాతీయ రహదారి విస్తరణకు 46 కిలోమీటర్లకు గానూ రూ.423 కోట్లు మంజూరు చేసింది. దీంతో ఏప్రిల్‌లో టెండర్లను పిలిచారు. ఆగస్టులో ఈ టెండర్లను ఫైనల్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోకు చెందిన ఆర్అండ్సీ ఇన్ఫ్రా కంపెనీకి టెండరు దక్కింది. దీంతో సెప్టెంబర్ 26న పనులు చేపట్టడానికి అగ్రిమెంట్ ప్రక్రియను పూర్తి చేశారు. దాని ప్రకారం ఈ రోడ్డును రెండేండ్లలో పూర్తి చేయాలి.
జాతీయ రహదారి దుద్దెడ జంక్షన్ నుంచి సిద్దిపేట జిల్లా సరిహద్దు వరకు 21 కిలోమీటర్లు ఉంటుంది. అవతల జనగామ వరకు మరో 25 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తంగా దుద్దెడ జంక్షన్ నుంచి జనగామ వరకు 46 కిలోమీటర్లు ఉంటుంది. రహదారి విస్తరణలో భాగంగా (టూ లైన్స్) బీటీ రోడ్డు టు బీటీ రోడ్డుకు 10 మీటర్లు ఉండనున్నది. పట్టణాల్లో ఫోర్ లైన్స్ రోడ్డు నిర్మిస్తారు. ఫోర్‌లైన్స్ వచ్చే చోట డివైడర్‌ను 2 మీటర్ల వెడల్పుతో, డివైడర్‌కు అటు, ఇటు 8.5 మీటర్లు వెడల్పుతో రహదారిని విస్తరించడమే కాకుండా డ్రైన్స్‌ను నిర్మిస్తారు. ఫోర్‌లైన్ వచ్చిన చోట సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. దుద్దెడ జంక్షన్ నుంచి కి.మీ. పొడవు, చేర్యాల పట్టణంలో 4 కిలోమీటర్ల పొడవు ఫోర్‌లైన్, బచ్చన్నపేట, జనగామ వద్ద బైపాస్ రోడ్డును నిర్మిస్తారు. మొత్తంగా 46 కి.మీ. నిడివిలో 17 మైనర్ బ్రిడ్జిలు, 1 మేజర్ బ్రిడ్జి నిర్మిస్తారు. ఈ జాతీ య రహదారిని త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు, వాహన దారులు కోరుతున్నారు.
వాహనాలు పాడైపోతున్నాయి..
నిత్యం వందలాది వాహనాలు నడిచే ఈ రోడ్డు పాడు కావడంతో ప్రతిరోజు పదుల సంఖ్యలో వాహనాలు పాడవుతున్నాయి. టైర్లు, ట్యూబ్‌లు పగిలిపోతున్నాయి. టూవీల్లర్ వాళ్లు టైరు పంక్చర్ అయ్యిందని వస్తున్నారు. తీరా టైరు ఇప్పాక ట్యూబ్‌లు పాడైపోతున్నాయి. పెద్దపెద్ద గుంతలు ఉండడంతో రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. వాహనదారులకు చాలా ఇబ్బంది అవుతున్నది. వీలైనంత త్వరగా రోడ్డు పనులు చేపట్టాలి.
– అమీర్ హంజా, మెకానిక్, ఎలికట్టే గ్రామం
ప్రయాణం సాహస యాత్రే..
దుద్దెడ నుంచి చేర్యాలకు పోవాలంటే నరకమైతంది. ఏ గుంతలో ఆటో పడుతుందో అనే భయం వెంటాడుతుంది. ఈరోడ్డుపై పోవాలంటేనే చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రయాణికులతో ప్రతి రోజు ఆటో తీసుకెళతాను. టైర్లు పాడైపోతున్నాయి. రోడ్డు విస్తరణ పనులు చేపట్టి ప్రయాణికుల, వాహనదారుల ఇక్కటు తొలిగించాలి అని విజ్ఞప్తి చేస్తున్నా.
– కనకయ్య, ఆటో డ్రైవర్, వేచరేణి గ్రామం