కోహీర్, నవంబర్ 10: నిరుపేదలకు సొంతింటి కలను సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారు. గూడు లేని వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి దశలవారీగా పంపిణీ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని దిగ్వాల్ గ్రామంలో 88 డబుల్ బెడ్ రూమ్‌లను నిర్మించారు. పూర్తైన వాటిని అర్హులైన వారికి పంపిణీ చేసేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 88 ఇండ్ల కోసం 283 మంది దరఖాస్తు చేసుకొన్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గతంలో తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన కిషన్ ఆధ్వర్యంలో దరఖాస్తుదారుల వద్దకు వెళ్లి సర్వే పూర్తి చేశారు. మొదటి విడుతలో 74మందిని గుర్తించారు. వీరందరికీ త్వరలో యాజమాన్య పత్రాలను అందజేయనున్నారు.
ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం…
దిగ్వాల్ గ్రామంలోని 74మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భవన సముదాయాలకు విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ దీపాలు, మీటర్ల బిగింపు తదితర పనులను ట్రాన్స్‌కో అధికారులు చేపట్టారు. ఆవరణలో పంచాయతీ రాజ్ శాఖ అధికారులు సిబ్బందితో హరితహారం మొక్కలు నాటిస్తున్నారు. రహదారులకు రెండు వైపులా మొక్కలను నాటి వాటికి నీటిని అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. భవనానికి రంగులు వేస్తున్నారు. నీటి సరఫరా, పారిశుధ్య పనులను సంబంధిత అధికారులు చేపట్టారు.
అర్హులకు ఇండ్లు..
దిగ్వాల్ గ్రామ శివారులో ఉన్న గోదాం సమీపంలో ప్రభుత్వం 88డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించింది. ఇండ్ల కోసం 283 మంది నిరుపేదలు గతంలో దరఖాస్తు చేసుకున్నారు. ముందుగా 74మంది అర్హులను గుర్తించారు. మిగతా 14 ఇండ్లను ఉన్నతాధికారులు కేటాయిస్తారు. మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే మాణిక్‌రావు తదితరులు అర్హులకు పట్టాలను అందించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
– విజయ్‌కుమార్, తహసీల్దార్, కోహీర్
చాలా సంతోషంగా ఉంది
నేను చాలా పేద కావడంతో సొంతంగా ఇల్లు కట్టుకొనే పరిస్థితి లేదు. కాబట్టి డబుల్ బెడ్ రూమ్ కావాలని దరఖాస్తు చేసుకున్నాను. నాలాంటి వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి
ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. సొంతింట్లో ఉండాలనే దశాబ్దాల కల త్వరలో నెరవేరుతున్నది. ఇంతమంచి పని చేస్తున్న ప్రభుత్వానికి
కృతజ్ఞతలు.
– రాణెమ్మ, ఇంటి లబ్ధిదారురాలు, దిగ్వాల్
ఇల్లు ఇస్తున్నందుకు ధన్యవాదాలు
నాకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. మేము చాలా నిరుపేదలం. సొంతంగా ఇల్లు కట్టుకోలేని పరిస్థితి మాది. పేదల ఇబ్బందులు గుర్తించిన సీఎం కేసీఆర్ మా కష్టాలు తీరుస్తున్నడు. కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయడం చాలా ఆనందంగా ఉంది.
– స్వప్న, లబ్ధిదారురాలు, దిగ్వాల్