అమ్మవారి శోభాయాత్ర..
శతచండీ మహాయాగంలో భాగంగా గురువారం సాయంత్రం సీతా రామచంద్రస్వామి ఆలయం నుంచి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. కాకతీయనగర్ నుంచి జ్యోతినగర్ మీదుగా బీరంగూడ కమాన్ వరకు అక్కడి నుంచి ఆలయం వరకు అమ్మవారి ఊరేగింపు జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు ఊరేగింపులో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
రామచంద్రాపురం, నవంబర్ 10 : లోక కల్యాణార్థం బ్రాహ్మణులంతా ఏకమై శతచండీ మహాయాగానికి శ్రీకారం చుట్టారు. మూడు రోజుల పాటు ఈ యాగాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే చండీయాగానికి సంబంధించి యాగమండపం, కలశ పూజకు కావాల్సిన ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేశారు. సీతారామచంద్ర స్వామి ఆలయం చుట్టూ విద్యుత్ దీపాలతో అలంకరించారు. మూడు రోజులు పాటు ప్రతి రోజు మధ్యాహ్నం ఆలయ ప్రాగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఆర్సీపురం మండల బ్రాహ్మణ సంఘం సభ్యులందరూ కలిసి శతచండీ మహాయాగాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పార్వతీపరమేశ్వరుల అనుగ్రహాన్ని పొందాలని వారు సూచించారు.
సిద్ధం చేస్తున్న యాగ మండపం
వంద మంది వేద పండితులతో..
ఆర్సీపురంలోని కాకతీయనగర్ కాల నీ సీతా రామచంద్రస్వామి ఆలయంలో నిర్వహించే శతచండీ మహాయాగాన్ని, కలశ స్థాపన, అగ్నిప్రతిష్ఠను వందమంది వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య నిర్వహించనున్నారు. వంద కేజీల పాయసం, విశేష యాగ సుగంధ ద్రవ్యాలతో చండీ యాగాన్ని నిర్వహించనున్నారు. మూడు రోజులు (శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం వరకు) పూజలు జరుగుతాయి. శనివా రం చండీ యాగానికి శ్రీమాధవానంద సరస్వతీ స్వామి హాజరవుతారని వెల్లడించారు.