పాడి పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర పాడి పరిశ్రమ, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. గురువారం జహీరాబాద్ మండలం గోవింద్పూర్ గ్రామంలో రూ. 400 కోట్లతో నిర్మించిన హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్‌తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణ రాక ముందు ఫ్యాక్టరీ పెట్టాలంటే పారిశ్రామిక వేత్తలు ఎన్నో కష్టాలు పడేవారని, ప్రత్యేక రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ కొత్త పారిశ్రామిక పాలసీని తీసుకువచ్చి యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తున్నారన్నారు. దీనివల్ల ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. జయేశ్‌రంజన్ మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి మార్కెటింగ్ చేసేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నదని పేర్కొన్నారు. ‘మేడిన్ తెలంగాణ’ అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతున్నదన్నారు.
-జహీరాబాద్, నవంబర్ 10