పటాన్చెరు, నవంబర్ 9: ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ ప్రారంభమైందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంతోపాటు మండలంలోని పలు పాఠశాలలను ఎమ్మెల్యే సందర్శించారు. ‘మనఊరు-మనబడి’ కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాల్లో శంకుస్థాపనలు చేశారు. ఘనపూర్‌లో రూ. 2 కోట్లతో ప్రభుత్వ ఉన్నత పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నందిగామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. బచ్చుగూడెం, పోచారం, రుద్రారం గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘మనఊరు మనబడి’తో పాఠశాలల్లో కొత్త వసతులు కల్పిస్తున్నామన్నారు. మరమ్మతులు కొనసాగుతున్నాయన్నారు. సీఎస్సార్ నిధులతో అనేక సమస్యలను పరిష్కరించుకుంటున్నామన్నారు. అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సుష్మశ్రీవేణుగోపాల్‌రెడ్డి, జడ్పీటీసీ సుప్రజావెంకట్‌రెడ్డి, సర్పంచ్‌లు కావ్యకాశిరెడ్డి, సుధీర్‌రెడ్డి, జగన్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాండు, ఎంపీటీసీలు మన్నేరాజు, భిక్షపతి, నీనాచంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పటాన్చెరు డివిజనల్ 113లో బండ్లగూడలో రూ.80 లక్షలతో ప్రాథమిక పాఠశాలకు నూతన భవనం నిర్మించేందుకు ఎమ్మెల్యే నిర్ణయించారు. బుధవారం జీహెచ్ఎంసీ డివిజన్లోని మార్క్స్ నగర్‌లోని ఈ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే పారగాన్ పాలిమర్స్ పరిశ్రమ సీఎస్సార్ నిధులను వెచ్చించి స్కూల్‌కు నూతన భవనం నిర్మిస్తామని తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని పారగాన్ పాలిమర్స్ సంస్థ ప్రతినిధులు హామీనిచ్చారు. కార్యక్రమంలో పరిశ్రమ ప్రతినిధులు శ్రీజిత్, భీను, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.