రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నది. నిరుపేదలకు సర్కారు దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా రోగనిర్ధారణ పరీక్షల కోసం పేదలు ప్రైవేట్ డయాగ్నోస్టిక్‌లకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తున్నది. ఇది పేదలకు భారమవుతున్నది. దీనిని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు ఉచిత రోగనిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో టీ-డయాగ్నోస్టిక్ హబ్‌లు ఏర్పాటు చేశారు. ఇందులో 57 రకాల రోగనిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. ఇప్పటి వరకు సంగారెడ్డి జిల్లాలో 20.82 లక్షల మందికి, మెదక్ జిల్లాలో 1.77 లక్షల మందికి పరీక్షలు చేశారు. పీహెచ్సీ, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఏరియా దవాఖానల్లో చూపించుకునే రోగుల నుంచి రక్త, మూత్ర, ఇతర నమూనాలు సేకరించి జిల్లా కేంద్రాల్లోని డయాగ్నోస్టిక్ కేంద్రాలకు పంపుతారు. 24 గంటల్లోనే రిపోర్టులు తిరిగి వారి చెంతకు చేరుతాయి. దీంతో రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది టీఆర్ఎస్ సర్కారు. ఇందుకోసం ఇప్పటికే వైద్యరంగంలో అనేక సంస్కరణలు తెచ్చి సర్కారు వైద్యంపై ప్రజల్లో నమ్మకాన్ని తీసుకువచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానలకు రోగులు క్యూ కడుతుండడంతో వారికి మరిన్ని మెరుగైన సౌకర్యాలను అందించేందుకు ‘టీ-డయాగ్నోస్టిక్ హబ్’లను ఏర్పాటు చేసింది. ఖర్చు లేకుండా 57 రకాల ఖరీదైన రోగ నిర్ధారణ పరీక్షలను ఈ కేంద్రాల్లో ఉచితంగా నిర్వహించి కావాల్సిన వైద్యం అందజేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఈ సేవలు ప్రారంభించగా, ఇప్పటి వరకు లక్షల్లో నమూనాలు సేకరించి రోగనిర్ధారణ పరీక్షలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ-డయాగ్నోస్టిక్ హబ్‌లపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సంగారెడ్డి/ మెదక్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులకు మెరుగైన వైద్యసేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ సామాన్యులకు ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర వ్యాప్తంగా టీ-డయాగ్నోస్టిక్ హబ్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో 57 రకాల రోగనిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. ఈ హబ్‌లు రోగుల పాలిట వరంగా మారాయి. పీహెచ్సీ, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఏరియా దవాఖానల్లో చూపించుకునే రోగుల నుంచి అక్కడే రక్త, మూత్ర, ఇతర నమూనాలు తీసి జిల్లా కేంద్రంలోని డయాగ్నోస్టిక్ కేంద్రాలకు పంపుతారు. పంపిన 24గంటల్లోనే రిపోర్టులు తిరిగి వారి చెంతకు చేరుతాయి. అంతేకాకుండా రోగుల సెల్ఫోన్లకు సమాచారం పంపిస్తున్నారు.
మెదక్ జిల్లాలో టీ-డయాగ్నోస్టిక్ హబ్ ద్వారా ఇప్పటి వరకు 95,865 శాంపిళ్లు సేకరించి 1,77,607 పరీక్షలు చేశారు. జిల్లా కేంద్రంలోని డయాగ్నోస్టిక్ హబ్‌లో 6 మంది ల్యాబ్ టెక్నీషియన్లు ఉండగా, ఒక ల్యాబ్ మేనేజర్ విధులు నిర్వహిస్తున్నారు. కాగా, మెదక్ జిల్లాలోని ప్రభుత్వ, పీహెచ్సీ, ఆర్బన్ పీహెచ్సీలలో శాంపిళ్ల సేకరణకు నాలుగు ప్రత్యేక వాహనాలు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఏరియా దవాఖానలు కలిసేలా రూట్ మ్యాప్ తయారు చేసుకుని, సేకరించిన శాంపిళ్లను జిల్లా కేంద్రంలోని డయాగ్నోస్టిక్ కేంద్రానికి తీసుకువస్తారు. మెదక్ జిల్లాలోని 25 దవాఖానల నుంచి నమూనాలను సేకరిస్తున్నారు. వాటి ఫలితాలను ఆన్లైన్లో పొందుపరుస్తుంటారు. ఫలితాల వివరాలు సంబంధిత దవాఖానలకు చేరడంతో పాటు రోగుల ఫోన్లకు సమాచారం వెళ్తుంది. రేగోడ్, అల్లాదుర్గం, గడిపెద్దాపూర్, పెద్దశంకరంపేట పీహెచ్‌సీల నుంచి నమూనాలను సంగారెడ్డి జిల్లా వైద్య సిబ్బంది సేకరిస్తున్నారు. జిల్లాలో 20 పీహెచ్‌సీలు, రెండు సీహెచ్‌సీలు, రెండు ఏరియా దవాఖానల నుంచి నమూనాలను సేకరిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా కేంద్రం దవాఖానలో ప్రభుత్వం టీ-డయాగ్నోస్టిక్ హబ్‌ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం రూ.2 కోట్ల వరకు వెచ్చించింది. రోగులకు ఉచిత రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు అధునాతన యంత్రాలను ఏర్పాటు చేయటంతోపాటు వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లను నియమించి రోగులకు సేవలు అందజేస్తున్నది. గతేడాది ఫిబ్రవరి నుంచి ఈ అక్టోబర్ వరకు టీ-డయాగ్నోస్టిక్ హబ్‌లో 1,27,312 మంది రోగుల నుంచి 2,12,425 నమూనాలను సేకరించారు. ఈ నమూనాల ఆధారంగా 20,82,958 రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లాలోని 52 పీహెచ్‌సీలు, నాలుగు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, నాలుగు ఏరియా దవాఖానలు, 13 బస్తీ దవాఖానాలు, సంగారెడ్డిలోని ప్రభుత్వ దవాఖాన, మాతాశిశుసంరక్షణ కేంద్రం నుంచి రోగనిర్ధారణ పరీక్షల కోసం నమూనాలు టీ-డయాగ్నోస్టిక్ హబ్‌కు వస్తాయి. పీహెచ్సీ, సీహెచ్‌సీ, బస్తీ దవాఖానల నుంచి రక్తనమూనాలు తీసుకువచ్చేందుకు ఎనిమిది వాహనాలను ఏర్పాటు చేశారు. ఈ వాహనాల ద్వారా రక్తం ఇతర నమూనాలను టీ-డయాగ్నోస్టిక్ హబ్‌కు వస్తాయి. ఇక్కడ నమూనాలను సిబ్బంది పరీక్షించి ఫలితాలను రోగులకు ఫోన్ ద్వారా అందజేస్తారు. రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు టీ-డయాగ్నోస్టిక్ హబ్‌లో ఫెథాలజిస్టు, బయోకెమిస్టు వైద్యులతోపాటు ఆరుగురు ల్యాబ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. ప్రతిరోజు నిత్యం సగటున 400 నుంచి 500 నమూనాలను పరీక్షలు చేస్తున్నారు. కాగా, నారాయణఖేడ్ కేంద్రానికి మినీ టీ-డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ప్రభుత్వం మంజూరు చేయగా, ఈ కేంద్రాన్ని త్వరలోనే ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
టీ-డయాగ్నోస్టిక్ హబ్ ద్వారా 57 రకాల రోగనిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. చికున్ గున్యా, థైరాయిడ్, లిపిడ్ ప్రొఫెల్, ఆర్ఎఫ్టీ, కేఎఫ్టీ, కొలస్ట్రాల్, సీబీపీ, యూరిన్ అనాలసిస్, సీ రియాక్టివ్ ప్రొటీన్ (సీఆర్పీ), యూరియా సీరం, లాక్టేట్ డీ హైడ్రేగెన్స్ ఐజీజీ, ఐజీఎం, ఆర్ఎఫ్టీ, రీనల్ పంక్షన్ టెస్టు, సీబీపీ, సీఆర్పీ, ఏఎస్వో, టైపాయిడ్, క్యాల్షియం, షుగర్ తదితర 57 రకాల రోగనిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేస్తున్నారు.
టీ-డయాగ్నోస్టిక్ హబ్ ఏర్పాటుతో ప్రైవేట్ డయాగ్నాస్టిక్ హబ్‌ల దోపిడీకి చెక్ పడింది. గతంలో రోగనిర్ధారణ పరీక్షల కోసం ప్రైవేట్ కేంద్రాలను ఆశ్రయిస్తే పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేవారు. దీంతో పేదలకు రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకోవటం భారంగా మారేది. ప్రస్తుతం టీ-డయాగ్నోస్టిక్ హబ్ ద్వారా 57 రకాల ఉచిత రోగనిర్థారణ పరీక్షలు అందుబాటులోకి రావటంతో గ్రామీణ, పట్టణాల్లో రోగులు ప్రభుత్వ కేంద్రాల్లోనే పరీక్షలు నిర్వహించుకుంటున్నారు.
డయాగ్నోస్టిక్ హబ్‌లో 50 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఎలాంటి ఖర్చు లేకుండా పరీక్షలు చేసి వివరాలను బాధితులకు చేరవేస్తున్నాం. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన శాంపిళ్లను ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నాం. రిపోర్టులు 24 గంటల్లో సంబంధిత దవాఖాన డాక్టర్‌కు, రోగి సెల్‌ఫోన్‌కు మెసేజ్ పంపిస్తాం. ప్రతిరోజూ నాలుగు రూట్లో ప్రత్యేక వాహనాల ద్వారా శాంపిళ్లు సేకరిస్తాం. ఈ డయాగ్నోస్టిక్ సెంటర్‌తో పేదలకు ఎంతో ప్రయోజనం.
– ప్రజ్ఞ, డయాగ్నోస్టిక్ హబ్ ల్యాబ్ మేనేజర్, మెదక్