రామాయంపేట, నవంబర్ 9 : పంట సాగులో భాగంగా ఇటీవల రసాయన ఎరువుల వాడకం గణనీయంగా పెరిగింది. దీని ప్రభావంతో భూమి నిస్సారంగా మారి సాగుకు పనికి రాకుండా పోతున్నది. ఈ నేపథ్యంలో అధిక శాతం రైతులు వర్మీ కంపోస్టు సేంద్రియ ఎరువుల వాడకం వైపు దృష్టిని సారిస్తున్నారు. దీంతో రైతులు నేరుగా తమ వ్యవసాయ భూముల్లోనే తమకు అనువైన ప్రాంతంలో గుంతలు తీసి వ్యర్థ పదార్థాలను అందులో వేస్తున్నారు.
వీటితో పాటు ఆ పదార్థాల్లో వాన పాములు వేయడంతో అది వర్మీకంపోస్ట్ ఎరువుగా మారుతున్నది. వాన పాములకు సేంద్రియ పదార్థాలను వేస్తే వాటిని తిని విసర్జించే పదార్థమే వర్మీ కంపోస్టుగా మారి నత్రజని, భాస్వరం, పొటాషియంగా మారుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. రామాయంపేట మండలంలోని కోనాపూర్ గ్రామంలో ఆదర్శ రైతు కిషన్, నందిగామలో చేర్ల సామేలు సేంద్రియ ఎరువులను తయారు చేసి తక్కువ ధరలకే రైతులకు విక్రయిస్తున్నారు.
మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 450 ఎకరాలకు పైగా రైతులు సేంద్రియ ఎరువులతోనే పంటలు సాగు చేస్తున్నారు. జిల్లాలో రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన రైతు కిషన్, నందగామకు చెందిన చేర్ల సామేలును ఇప్పటికే కొన్ని మండలాలకు తీసుకెళ్లి సేంద్రియ ఎరువులపై అవగాహన కల్పించాం. రాబోయే రోజుల్లో సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచుతాం.
-ఆశా కుమారి, మెదక్ జిల్లా వ్యవసాయశాఖ అధికారి
మనం పండించే పంటలకు సేంద్రియ ఎరువులు వాడితే రోగాలు దరిచేరవు. ఒకవేల ఏదైనా రోగం వచ్చిందంటే వేపకషాయం, వేపపిండిని నీళ్లలో కలిపి పంటపై చల్లితే రోగాలు మాయమవుతాయి. ప్రస్తుతం రైతు లు వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు కూరగాయ పంటలకు ఎక్కువ శాతం సేంద్రియ ఎరువులు వాడేలా అవగాహన కల్పిస్తున్నా. రైతులు కూడా ఈ ఎరువులవైపే మొగ్గుచూపుతున్నారు.
-కిషన్,ఆదర్శ రైతు