నర్సాపూర్, నవంబర్ 9 : నర్సాపూర్ మున్సిపాలిటీ దినదినాభివృద్ధ్ది చెందుతూ పట్టణవాసులకు అన్ని రకాల సౌకర్యాలు అందజేస్తున్నది. ఇప్పటికే మున్సిపాలిటీలో వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్, మున్సిపల్ భవనం తదితర నిర్మాణాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వీటితో పాటు ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు చకచకగా కొనసాగుతున్నాయి. దీంతో ప్రజల ఇక్కట్లు తీరనున్నాయి.
నర్సాపూర్ పట్ణణంలో కూరగాయలను కొనుగోలు చేయడానికి పట్ణణ ప్రజలే కాకుండా మండల పరిధిలోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా అధిక సంఖ్యలో వస్తారు. శుక్రవారం సంత రోజు కావడంతో ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చి కూరగాయలు, సామగ్రిని కొనుగోలు చేస్తారు. నర్సాపూర్ మున్సిపాలిటీలో కూరగాయలు, నాన్ వెజ్ అమ్ముకోడానికి సరైన స్థలం లేక ఇటు వ్యాపారులు అటు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి నర్సాపూర్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి చొరవతో మంత్రి హరీశ్‌రావు ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి గతంలో శ్రీకారం చుట్టారు. నర్సాపూర్ మున్సిపాలిటీలోని పాత రెవెన్యూ కార్యాలయ స్థలంలో ఎకరా 20 గుంటల విస్తీర్ణంలో రూ.2 కోట్లతో ఈ మార్కెట్‌ను నిర్మిస్తున్నారు. ఆరు నెలల్లో ఈ మార్కెట్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి రానున్నదని మున్సిపల్ అధికారులు వెల్లడించారు.
ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆరు నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రస్తుతం వెజ్ మార్కెట్ పనులు చివరి దశకు వచ్చాయి. నాన్ వెజ్ మార్కెట్ నిర్మించే స్థలంలో ఎక్సైజ్ కార్యాలయం ఉండడంతో నిర్మాణానికి ఆటంకం ఏర్పడింది. ఎక్సైజ్ కార్యాలయం స్థలం మున్సిపాలిటీకి అప్పగిసే నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు ప్రారంభిస్తాం.
– చాముండేశ్వరి, మున్సిపల్ కమిషనర్
నర్సాపూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇప్పటికే వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్, మున్సిపల్ భవన నిర్మాణం జరిగింది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పూర్తయితే ప్రజలు, వ్యాపారుల ఇబ్బందులు తొలిగిపోతాయి. మున్సిపాలిటీకి చెందిన ఎక్సైజ్ కార్యాలయ స్థలం మార్కెట్ నిర్మాణానికి ముందుగానే అప్పగించడం జరిగింది. ఏదైనా సమస్య ఉంటే సంబంధిత అధికారులతో చర్చిస్తా.
-మదన్‌రెడ్డి, ఎమ్మెల్యే (నర్సాపూర్)