సంగారెడ్డి, నవంబర్9: మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తున్నదని, పట్టణంలోని రోడ్లను బీటీ రోడ్లుగా తీర్చిదిద్దుంతున్నదని హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్, టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ అన్నారు. బుధవారం పట్టణంలోని 6, 25వ వార్డులను కలిపే రోడ్లను బీటీ రోడ్లుగా వేసేందుకు 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.18 లక్షలు మంజూరయ్యాయి. ఈ పనులను మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మీతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో పట్టణాలు, పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. పట్టణంలోని ప్రధాన రోడ్లను బీటీ రోడ్లుగా వేస్తామన్నారు. నారాయణఖేడ్‌లో సీఎం ప్రకటించిన రూ.50 కోట్ల నిధులకు సంబంధించిన ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వ అనుమతులకు నివేదించామన్నారు. ఉత్తర్వులు రాగానే పట్టణాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ లత, కౌన్సిలర్లు సోసైల్ అలీ, షేక్ సాబేర్, అజ్జు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.