మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 9: సృజనకు పదును పెట్టి వైజ్ఞానిక ప్రదర్శనల్లో సత్తా చాటేందుకు విద్యార్థులకు ఈ నెల వేదికగా మారింది. ఒకే నెలలో మూడు ప్రదర్శనల్లో (సైన్స్ ఫెయిర్, బాలల సైన్స్ కాంగ్రెస్, స్కూల్ ఇన్నోవేషన్) పాల్గొనే అద్భుత అవకాశం దక్కింది. అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో అన్ని విద్యాలయాల్లో సందడి నెలకొన్నది. కరోనా కారణంగా రెండేండ్లుగా ఆన్లైన్లో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ ఈసారి ప్రత్యక్షంగా జరుగనున్నది. 50వ రాష్ట్రీయ బాలల వైజ్ఞానిక ప్రదర్శన-2022ను (జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సైన్స్, మ్యాథ్స్ ఎన్విరాన్మెంట్ ఎగ్జిబిషన్ ఈసారి నుంచి రాష్ట్రీయ బాలల వైజ్ఞానిక ప్రదర్శనగా రూపాంతరం చెందింది. ఈ నెల 24 నుంచి 26 తేదీల్లో జిల్లా కేంద్రంలోని వెస్లీ పాఠశాలలో జిల్లా స్థాయిలో ప్రదర్శనలు నిర్వహించనున్నారు. డిసెంబర్ మొదటి వారంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించేందుకు విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించింది. ఆసక్తి గల వారు ఈనెల 20లోగా తమ ప్రాజెక్టులను ఆన్లైన్ నమోదు చేసుకోవాలి. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో అన్ని యాజమాన్యాల పరిధిలోని 6 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులు అందరికీ అవకాశం కల్పిస్తున్నట్లు ఎస్సీఈఆర్టీ ప్రకటించిన విషయం తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎస్సీఈఆర్టీ విశ్వేశ్వరయ్య టెక్నాలజీ వారు సంయుక్తంగా సైన్స్ ఫెయిర్‌ను నిర్వహిస్తారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థుల ప్రదర్శన అంశాలను ఎస్సీఈఆర్టీ శాస్త్రవేత్తల సహకారంతో అభివృద్ధి చేస్తారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు ఢిల్లీలో రాష్ట్రపతి, మానవ వనరులశాఖ మంత్రి ద్వారా ప్రశంసా పత్రాలు అందుకుంటారు.
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పాఠశాలలు రాష్ట్ర స్టేట్ ఇన్నోవేషన్ చాలెంజ్‌లో పాల్గొనేందుకు అర్హులు. ఈనెల 10 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి. ప్రతి పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయుడు ఇందులో పాల్గొనేందుకు తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంది. ఏ సబ్జెక్ట్ టీచరైనా ఇందులో వివరాల నమోదుకు అర్హులే. ఉపాధ్యాయులు వారి పాఠశాలల్లో 5 నుంచి ఏడుగురు విద్యార్థుల బృందాన్ని ఏర్పాటుచేయాలి. 2 నుంచి 4 బృందాలు వరకు ఒక పాఠశాల నుంచి ఏర్పాటు చేసుకోవచ్చు. పేర్లు నమోదు చేసుకున్న ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు.
ఈ విద్యాసంవత్సరంలో జాతీ య బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లాస్థాయి ప్రదర్శనను ఈ నెల 30న విద్యాశాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నారు. ‘ఆరోగ్యం, సంక్షే మం కోసం పర్యావరణ వ్యవస్థను అర్థం చేసుకోవ డం’ అనే అంశంపై ప్రాజెక్టులను విద్యార్థులు రూపొందిచాల్సి ఉంది. విద్యార్థుల నివేదికలతో హాజరై వాటి గురించి క్లుప్తంగా వివరించాలి.
– రాజిరెడ్డి, జిల్లా సైన్స్ అధికారి, సంగారెడ్డి
విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలను ప్రాజెక్టులుగా రూపొందించి, ప్రదర్శించడానికి వైజ్ఞానిక ప్రదర్శన వేదిక. వైజ్ఞానిక ప్రదర్శన, బాలల సైన్స్ కాంగ్రెస్, స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ ఇన్స్పైర్ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నది. విద్యార్థులు ఈ అవకాశా న్ని సద్వినియోగం చేసుకోవాలి. పాజెక్ట్లపై ప్రధానోపాధ్యాయులు శ్రద్ద తీసుకోవాలి.
– చిలుముల రాజిరెడ్డి, జిల్లా సైన్స్ అధికారి