మెదక్, (నమస్తే తెలంగాణ)/ సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 9: ముసాయిదా ఓటరు జాబితాను జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రదర్శించినట్లు సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా ఓటరు జాబితాలను పరిశీలించి మార్పులు, చేర్పులు, అభ్యంతరాలు ఉన్నట్లయితే తెలుపాలని ప్రజలకు సూచించారు. అభ్యంతరాలు, క్లెయిమ్‌లు డిసెంబర్ 9లోగా చేసుకోవాలని పేర్కొన్నారు. ఓటరు నమోదు, జాబితా సరిచూసుకునేందుకు ఈ నెల 26, 27, డిసెంబర్ 10, 11 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. తుది ఓటరు జాబితా జనవరిలో ప్రచురితం అవుతుందన్నారు. 2023 జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. ఓటు ప్రాముఖ్యతను వివరిస్తూ జిల్లావ్యాప్తంగా స్వీప్ కార్యక్రమాలు చేపట్టేలా కార్యాచరణ రూపొందించామని వివరించారు.
జిల్లాలో 1557 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, మరో మూడు కొత్త పోలింగ్ స్టేషన్లను ప్రాతిపాదించామని తెలిపారు. జిల్లాలో మొత్తం 1560 పోలింగ్ కేంద్రాలు, 11,95,883 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. పురుషులు 6,05,071 మంది కాగా, మహిళలు 5,89,977 మంది, ఇతరులు 35 మంది ఉన్నారని వివరించారు. జిల్లాలో మొత్తం 365 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారని, అందులో నియోజకవర్గం వారీగా నారాయణఖేడ్‌లో 68 మంది, అందోల్‌లో 48 మంది, జహీరాబాద్‌లో 106 మంది, సంగారెడ్డిలో 69 మంది, పటాన్చెరులో 74 మంది ఉన్నారని పేర్కొన్నారు. డిసెంబరులో నిర్వహించే ప్రత్యేక శిబిరాలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఓటు ఎంతో విలువైనది, శక్తివంతమైనదని, ఓటు ద్వారా మంచి నాయకుని ఎన్నుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు. జిల్లా ఎన్నికల అధికారి హరీశ్ ఆదేశాల మేరకు బుధవారం తన చాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో డ్రాఫ్ట్ ఎలక్టోరల్ పబ్లికేషన్ సీడీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 6 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, అభ్యంతరాలపై మెదక్ నియోజకవర్గంలో 5,176 దరఖాస్తులు, నర్సాపూర్ నియోజకవర్గంలో 5,413 దరఖాస్తులు పరిశీలించి జాబితా సవరించామన్నారు.
బుధవారం ప్రకటించిన డ్రాఫ్ట్ పబ్లికేషన్ నాటికీ జిల్లా మొత్తం 4,06,629 పురుష, మహిళా ఓటర్లు, 108 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారన్నారు. రన్నారు. మెదక్ నియోజకవర్గంలో 2,01,358 మంది, నర్సాపూర్ నియోజకవర్గంలో 2,05,271 మంది ఓటర్లు ఉన్నారని అన్నారు. జిల్లాలోని 576 పోలింగ్ బూత్‌ల్లో ప్రదర్శించామన్నారు. జిల్లాలో 76 శాతం ఆధార్ అనుసంధానాం చేసి అగ్రస్థానంలో ఉన్నామన్నారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ నుంచి చింతల నర్సింలు, టీడీపీ నుంచి మహమ్మద్ అఫ్జల్, బీఎస్పీ నుంచి అప్పాజిపల్లి సురేశఖ, సీపీఐ నుంచి విజయలక్ష్మి, సీపీఎం నుంచి మల్లేశం, ఎమ్మార్పీఎస్ నుంచి చెట్లపల్లి యాదగిరి, ఆర్డీవో సాయిరామ్, స్వీప్ నోడల్ అధికారి రాజిరెడ్డి, డీఈవో రమేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.