అందోల్, నవంబర్ 8:ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకుల పాలనలో ఉనికిని కోల్పోయిన గీతవృత్తికి స్వరాష్ట్రంలో పూర్వ వైభవం వస్తున్నది. ప్రభుత్వా లు ఎన్ని మారిన తమ తలరాతలు మారడం లేదే అని మదనపడిన గౌడన్నల తల రాత స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా మార్చేసింది.
తాతలు.. తండ్రుల వారసత్వంగా వచ్చిన గీత వృత్తిని నమ్ముకుని ఎంతోమంది కార్మికులు కుటుంబాలను పోషిస్తున్నా ఉమ్మడి రాష్ట్రంలో సరైన ఆదరణ లేకుండే. ఈత, తాటి చెట్ల నుంచి సహజ సిద్ధమైన కల్లును సేకరించి గ్రామాల్లో విక్రయించి ఉపా ధి పొందడమే కాకుండా మరింత మందికి ఉపాధి కల్పించిన గౌడన్నల పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో కాలక్రమేణా ప్రశ్నార్ధకమైంది. ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి కింద పడి మృతిచెందితే అరకొర నష్ట పరిహారం ఇచ్చి చేతులు దులుపు కోవడంతో అతడిపైనే ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వయస్సు పై పడి గీత వృత్తి చేయలేని వారి పరిస్థితైతే మరీ దారుణం.. పనులు లేకా పస్తులున్నా సరే పింఛన్లకు తావే లేకుండే. లైసెన్సులు పొందడం.. కల్లు విక్రయించడం ఎంతో సహసంతో కూడుకున్న పనిగా మారిం ది.
దీంతో చాల మంది గీత కార్మికులు పొట్టచేతబట్టుకుని ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లి జీవనం సాగించేవారు. కానీ స్వరాష్ట్రం ఏర్పడి కేసీఆర్ సీఎం అయ్యాక.. గీత వృత్తికి మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. గీత కార్మికులను, గౌడ న్నలకు ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి.. కులవృత్తికి జీవం పోశారు. గీత కార్మికులకు అందుతు న్న ప్రమాదబీమా పరిహారన్ని రూ. 2లక్షల నుంచి 5లక్షలకు పెంచి అర్హులైన ప్రతి ఒక్కరికీ 50ఏండ్లకే రూ. 2016 ఆసరా పింఛన్లను అందజేస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన కార్మికులకు ప్రమాద తీవ్రతను బట్టి బీసీ కార్పొరేషన్ ద్వారా తక్షణ సహయంగా రూ.15-25వేలు చెల్లిస్తున్నారు.
టీఎఫ్టీ లైసెన్సులు సైతం సులభతరం చేసి ఫీజులను పూర్తిగా రద్దు చేశారు. గతంలో ఎన్నుడూ లేని విధంగా వైన్‌షాపుల్లో గౌడ కులస్తులకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గొప్ప నిర్ణయం తీసుకోవడంతో పనులు లేక పట్టణాలకు వెళ్లిన గౌడ బిడ్డలు, గీత కార్మికులు గ్రామాలకు వచ్చి సంతోషంగా కుల వృత్తిని చేపడుతు న్నారు. తెలంగాణ ఏర్పడక ముందు కల్లుగీత లైసెన్స్ రెన్యువల్, రెంటల్ ఫీజు.. ఇతరత్రా ఫీజులు చెల్లించేందుకు పడే బాధలు వర్ణానతీతం. గీత కార్మికులు పనులన్నీ వదులుకుని ఎక్సైజ్ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరాగా ల్సిన పరిస్థితి. ఇవన్నీ గుర్తించిన సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం మొదటగా రెంటల్ విధానాన్ని రద్దుచేసి గౌడన్నలకు అండగా నిలిచి కార్మికులకు గీత వృత్తిపై భరోసా కల్పించారు. ఆ తరువాత చెట్లపై విధించే పన్ను రద్దు చేయడం, లైసెన్స్ రెన్యువల్‌ను ఐదేండ్లకొకసారి చేసి.. దాన్ని మళ్లీ ఇటివలే పదేండ్లకొకసారి చేసి నిర్ణయం తీసుకుని గీత వృత్తికి ప్రాణం పోశారు.
కల్లు విశిష్ట తను తెలియపరి చేందుకు పలు కార్యక్రమాలు చేపడుతూనే హైదరాబాద్‌లో సీంమాంధ్రులు మూసి వేయించిన కల్లు దుకాణాలు మళ్లీ తెరిపించి.. కులవృత్తికి మరోసారి అండగా నిలవడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని అరిస్తున్న గుడుంబాను గ్రామాల నుంచి పూర్తిగా తరిమికొట్టారు. ఇప్పుడూ కొత్తగా వైన్స్‌షాప్‌లో 10శాతం రిజర్వేషన్ అమలు చేయడంతో గౌడ బిడ్డలు లైసెన్స్‌లు పొంది ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.
కార్మికులకు అందుతున్న సంక్షేమ పథకాలు
గీత కార్మికులు ప్రమాదవశాత్తు చెట్టు పై నుంచి కిందపడి మృతి చెందినా.. శాశ్వత వైకల్యం పొందినా ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు కేవలం రూ. 2లక్షలు మాత్రమే పరిహారంగా అందజేసేవి. కానీ స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ రూ. 5 లక్షల పరిహారాన్ని అందజేస్తున్నది. గతంలో గీత కార్మికులకు పింఛన్ అనే ముచ్చటే లేకుండే.. కానీ తెలంగాణ ప్రభుత్వం అర్హులైన ప్రతి కార్మికుడికి రూ. 2016 పింఛన్ అందిస్తూ ఆర్థికంగా అండగా ఉంటుండగా.. జిల్లా వ్యాప్తం గా 906మంది కార్మికులు ప్రతి నెలా పింఛన్ పొందుతున్నారు. వృత్తిని మరింత ప్రోత్సహించాలనే లక్ష్యంతో హరితహారంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్, అటవీ శాఖల ఆధ్వర్యంలో ఈత, తాటి వనలను నాటారు. ప్రమాదవశాత్తు కార్మికులు గాయపడితే బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రమాద తీవ్రతను బట్టి రూ. 15-25వేలు తక్షణ సహాయంగా అందజేస్తూ కుటుంబాలకు కొండత అండగా ఉంటున్నది తెలంగాణ సర్కార్.
చెట్ల పెంపకంపై దృష్టి
కల్తీ కల్లు నియంత్రణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈత, తాటి వనాలను నాటుతున్నది. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా తమ శాఖ ఆధ్వర్యంలో గీతకార్మికులు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తూ వేల సంఖ్యలో మొక్కలు నాటడం జరిగింది. అంతే కాకుండా కార్మికులకు అన్ని రకాలుగా సహాయ సహకరాలు అందిస్తున్నాం. లైసెన్స్‌ల విషయంలో కానీ, దుకాణాల ఏర్పాటు విషయంలో కానీ పూర్తి అండగా ఉంటు న్నాం. ఈ ఏడాది కొత్తగా ఎంతో మందికి టీఎఫ్టీ లైసెన్సులు సైతం అందజేశాం.
– సుబ్రహ్మణ్యం,ఎక్సైజ్ సీఐ జోగిపేట
ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది
గీత వృత్తికి ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది. గతంలో ఎప్పుడూ మమ్మల్ని ఏ ప్రభుత్వాలు ఆదుకున్న దాఖలాలు లేవు. కానీ తెలంగాణ ప్రభుత్వం, అధికారుల ప్రోత్సాహంతో మాకు మంచి రోజులోచ్చాయి. ఈత, తాటి వనాలు నాటుతూ వనాలు పెరిగేలా చూస్తుండటంతో కార్మికులకు చేతినిండా పనిదొరుకుతున్నది. లైసెన్సులు సైతం సులభతరం కావడంతో ఇబ్బందులు తొలిగాయి.
– అంజాగౌడ్, గీతకార్మికుడు
గతంలో ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రభుత్వం అన్ని రకాలుగా గీత వృత్తికి తోడ్పాటు అందిస్తుండడంతో ఈతకల్లుకు గ్రామాల్లో ఆదరణ పెరుగుతున్నది. కార్మికులకు చేతినిండా పని లభిస్తున్నది. గత ప్రభుత్వాల హయాంలో ఆదరణ కోల్పోయిన కల్లుకు స్వరాష్ట్రంలో మంచి రోజులోచ్చాయి. హరితహారంలో భాగంగా ఈత చెట్లను పెంపకంపై ప్రత్యే క దృష్టి పెట్టడం అభినందనీయం. కొత్తగా వైన్స్ దుకాణాల్లో 10శాతం రిజర్వేషన్ కల్పిచడంతో ఎంతో ఉపయోగకరంగా ఉన్నది.
– ప్రతాప్‌లింగాగౌడ్, గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
మంచి ఆదరణ లభిస్తుంది
తెలంగాణలో గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు చాల బాగున్నాయి. స్వచ్ఛమైన కల్లులో ఎన్నో ఔషధ గుణాలు, రోగనిరోదక శక్తిని పెంపొందించే ఎన్నో సుగుణాలున్నా యి. దీన్ని ప్రభుత్వం గుర్తించి తగిన ప్రోత్సాహం ఇవ్వడం బాగుంది. గీత కార్మికులకు ఉపయోగపడే విధంగా పథకాలు, సబ్సిడీలు అందజేస్తూ ప్రమాద బీమా రూ. 5లక్షలు చేయడం, గాయపడిన కార్మికులకు సాయం ఆందించడంతో వృత్తికి ఆదరణ లభిస్తున్నది.
– రమేశ్‌గౌడ్, కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షుడు