సదాశివపేట, నవంబర్ 8 : ప్రభుత్వం అమలు చేస్తు న్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించేలా కార్యాచరణ చేపట్టింది. మున్సిపల్ రికార్డుల్లో ఇంటి నెంబరు లేకుండా ఉన్న వారిని గుర్తించేందుకు ఆస్తుల వివరాలను భువన్‌యాప్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపగ్రహ ఛాయ చిత్రాల ఆధారంగా పన్ను లు వసూలు చేసే ప్రక్రియ వేగవంతం చేసింది. సదాశివపేట మున్సిపాలిటీలో జీఐఎస్ (జియో గ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం) ఆధారంగా సర్వే వందశాతం పూర్తి కావచ్చింది. అధికారుల లెక్కల ప్రకా రం సదాశివపేట మున్సిపాలిటీలో 55,500మంది జనాభా ఉన్నది. పట్టణంలో 9,450ఇండ్లకు ఆస్తిపన్ను వసూ లు అవుతున్నది. ప్రస్తుతం రూ. 3.20కోట్లు ఇంటి పన్ను వసూలు అవుతున్నది. అదనంగా మరో రూ. 18 లక్షలు ఇంటి పన్ను పెరిగే అవకాశం ఉన్నది. కొద్ది నెలల క్రితం నిర్వహించిన జీఐఎస్ సర్వే ద్వారా ప్రతి ఇంటి కొలతలను తీసుకున్నారు. అంతకుముం దు ఇండ్ల నిర్మాణాలు జరిగినా, అనుమతికి మించి కట్టడాలు నిర్మించి నా ఆస్తిపన్ను వసూలు అయ్యేది కాదు. స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలు, కార్యాలయ సిబ్బంది సహకారంతో ఈ వ్యవహారం నడిచేది. సర్వే తరువాత మున్సిపల్ లెక్కలో లేని మ రో కొన్ని ఇండ్లు వెలుగులోకి వచ్చా యి. ఇకపై పన్ను చెల్లించే ఇండ్ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భువన్‌యాప్‌లో నమోదు చేయడం వల్ల మున్సిపల్లో ఇండ్ల సంఖ్య, ఇంటి నంబర్ లేనివి వంటి వాటిని తేల్చారు. ప్రత్యేక కార్యాచరణ ద్వారా పన్ను చెల్లింపులోకి వచ్చే ఆస్తులకు యజమానుల పేరిట ఉన్న వివరాలను భువన్ యాప్‌లో నమోదు చేశారు. ఇంటింటికీ వెళ్లి సెల్‌ఫోన్ నెంబర్లు సేకరించి మున్సిపల్ వెబ్సైట్లో నమోదు చేశారు. ఈ ప్రక్రియతో ఇండ్ల స్థలాల ఇంటి రుణా లు, సామాజిక పింఛ న్లు, వ్యక్తిగత మరగుదొడ్లు, పేదలకు రూపాయికే నల్లా కనెక్షన్ వంటి పథకాలు ఆసలైన లబ్ధిదారుల వివరాలను నమోదు చేశారు.
బయటపడ్డ అక్రమ నిర్మాణాలు..
జీఐఎస్ విధానంతో ఇంటి కొలతలు పక్కాగా తేలడంతో దానికి అనుగుణంగా నిబంధనల మేరకు ఆస్తిప న్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఇన్నాళ్లు మున్సిపాలిటీకి పన్నులు ఎగ్గొడుతున్న వారి ఆటలకు అడ్డుకట్ట పడ్డట్లేనని అధికారులు అంటున్నారు. మున్సిపల్లో తీసుకున్న అనుమతుల ప్రకారం ఒక పోర్షన్ కట్టుకున్న వారు అంతకే ఆస్తిపన్ను చెల్లిస్తున్నారు. ఆ తరువాత మరో గది లేదా మరో పోర్షన్‌ను అనుమతి లేకుండా కట్టుకుంటున్నారు. దీనిని మున్సిపల్ సిబ్బంది పట్టించుకోకపోవడంతో గతం లో మాదిరిగా ఒకే పోర్షన్‌కు పన్ను చెల్లిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం అదనపు పోర్షన్‌కు కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మున్సిపల్ సిబ్బందిలో కొందరు కొలతలకు వెళ్లినప్పుడు ప్రలోభాలకు లోనై తక్కువ చేసి చూపించేవారు. పలు చోట్ల నివాస గృహల కు అనుమతి తీసుకుని వ్యాపారాలకు వినియోగిస్తున్న వైనం వెల్లడైంది. ఈ క్రమంలో అక్రమాలకు తావులేకుం డా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
తేలిన పన్ను ఎగవేతదారులు
సొంత ఆదాయ మార్గాలకు గండికొడుతున్న వ్యవహారాన్ని గాడిలో పెట్టేందుకు పురపాలక శాఖ కార్యాచరణ చేపట్టింది. పట్టణ ప్రాంత పరిధిలో ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా పన్నులు వసూలు చేసే ప్రక్రియను పూర్తి చేసింది. వార్డులు, కాలనీల్లో ఇండ్లు నిర్మించుకున్న వాటి అసెస్మెంట్ (ఆస్తిపన్ను కొలతలు) నిర్ధారణలో సిబ్బంది చేతివాటం చూపించడంతో పురపాలక సంఘం ఇప్పటి వరకు కోట్లాది రూపాయలు నష్టపోయింది. ఇంటి నిర్మాణం పూర్తయినా ఆస్తిపన్ను చెల్లించని వారి వివరాలు బయటపడ్డాయి. ఆస్తిపన్ను, నల్లాల బకాయిలు, ట్రేడ్ లైసెన్స్ (వ్యాపార ధ్రువపత్రం) ద్వారా ఆదాయం రాబట్టడానికి జీఐఎస్ (జియో గ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం) ద్వారా చేపట్టిన సర్వే సత్ఫలితాలను ఇచ్చింది. ఇండ్ల సంఖ్య ఆధారంగా బల్దియా సిబ్బంది బృందాలుగా విడిపోయి సర్వే చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేసి ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే దిశలో అడుగులు పడుతున్నాయి. ఇదివరకు అనుమతులకు విరుద్ధంగా కట్టడాలు నిర్మించడం, ఇంటి కొలతలు తక్కువ చేసి చూపడం, నివాసాలకు అనుమతులు తీసుకుని కమర్షియల్ (వ్యాపారానికి) వినియోగించడం లాంటి వ్యవహారాలు వెలుగు చూశాయి. ప్రభుత్వం నూతనంగా జీఐఎస్‌తో ఇండ్ల కొలతలు పక్కగా నమోదు చేయడంతో వాటికి చెక్ పడింది. సర్వేలో తేలిన అంశాల ఆధారంగా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆస్తిపన్నును నిర్దారించనున్నారు. పట్టణంలో 26వార్డుల్లో 26 బృందాలు చేపట్టిన సర్వేలో తేలిన ఇండ్ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు.
వందశాతం పూర్తి చేశాం..
సదాశివపేట పట్టణంలోని 26వా ర్డులల్లో జీఐఎస్ సర్వే ద్వారా ఇంటి కొలతలు నమోదు చేశాం. దీని ద్వారా వందశాతం ఆస్తిపన్ను వసూ లు చేయనున్నాం. ఇప్పటి వరకు అదనంగా నిర్మించుకున్న కట్టడాలు పన్ను పరిధిలో లేకుండే. అలాంటి కట్టడాల తో పాటు వాణిజ్య సముదాయాలు, ఇంటి అనుమతి తీసుకుని నిర్మించిన భవనాల్లో వ్యాపారాల నిర్వాహణ తదితర వాటిని జీఐఎస్ ద్వారా గుర్తించగలిగాం. దీంతో పన్ను ఎగవేతదారులకు అడ్డుకట్ట పడింది.
– కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్, సదాశివపేట