జహీరాబాద్, నవంబర్ 8 : సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులతో రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్ నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జహీరాబాద్ మండలంలోని రంజోల్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో అండర్-14,17,19 రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్(మల్టీజోన్) క్రీడలు నిర్వహించేందుకు మైదానం సిద్ధం చేశారు. సంగారెడ్డి జిల్లాలోని రంజోల్ బాలికల గురుకుల పాఠశాలలో నేటి నుంచి 12వ తేదీ వరకు రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 60 గురుకుల పాఠశాలలకు చెందిన 882 మంది బాలికలు పోటీలో పాల్గొంటుండగా, పోటీలు నిర్వహించేందుకు 120 మంది వ్యాయామ, 100మంది ఉపాధ్యాయులు హాజరవుతున్నారు. రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను విజయవంతంగా ముగించేందుకు పాఠశాల ప్రిన్సిపాల్ ఎం. కృష్ణవేణి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర స్థాయి స్పోర్ట్ మీట్ 2022-23ను నిర్వహిస్తున్నారు. స్పోర్ట్స్ మీట్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, హ్యాండ్ బాల్, బాల్ బ్యాడ్మింటన్, టెన్నికాయిట్ (డబుల్), చదరంగం(సింగిల్), క్యారమ్స్(డబుల్స్) పోటీలు నిర్వహించనున్నారు. వీటితో పాటు అథ్లెటిక్స్‌లో 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 600 మీటర్లు, 800 మీటర్లు, 1500 మీటర్లు, 3వేల మీటర్లు, షాట్‌పుట్ నిర్వహించేందుకు మైదానం సిద్ధం చేశారు.
నాలుగు రోజుల క్రీడా పోటీలకు అన్ని ఏర్పాట్లు చేశారు. 60 గురుకుల పాఠశాలలకు చెందిన 882 మంది విద్యార్థినులు క్రీడా పోటీలకు హాజరవుతున్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు మల్టీ జోన్ -2 పరిధిలోని జనగాం, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెంది విద్యార్థినులు ఇప్పటికే చేరుకున్నారు. క్రీడలు ప్రారంభించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతారని అధికారులు తెలిపారు. స్పోర్ట్స్ మీట్‌కు వచ్చే విద్యార్థినుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాల నుంచి విద్యార్థినుల ప్రత్యేక బస్సులో రంజోల్ పాఠశాలకు తీసుకొచ్చారు.