సదాశివపేట, నవంబర్ 8: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు పెద్దలు. విద్యార్థులకు విద్యనందిస్తే భవిష్యత్తులో మంచి పౌరులుగా తయారవుతారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సీఎం కేసీఆర్ ‘మనఊరు-మనబడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. సదాశివపేట మండలంలో మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా తొలివిడతలో 24 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఈ పాఠశాలలకు రూ.10 కోట్ల 45లక్షల నిధులు మంజూరయ్యాయి. తొలి విడతలో ఎంపికైన పాఠశాలల్లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 60శాతం పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. విద్యావ్యవస్థపై దృష్టి సారించి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న తెలంగాణ సర్కార్‌కు తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెబుతున్నారు.
మారుతున్న బడుల రూపు రేఖలు
ప్రభుత్వ పాఠశాలలు అందంగా కనిపిస్తున్నాయి. అందులో విద్యార్థులకు నాణ్యమైన చదువులు అందుతున్నాయి. ఇక వసతుల విషయానికొస్తే కార్పోరేట్‌కు ధీటుగా ఉన్నాయి. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన కొనసాగుతున్నది. ప్రతి రోజూ స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు ఆంగ్లంలో మాట్లాడుతుంటే తల్లిదండ్రులు చూసి మురిసిపోతున్నారు. తమ పిల్లలకు పరీక్షలో మంచి మార్కులు వస్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
శరవేగంగా నిర్మాణ పనులు
సదాశివపేట పట్టణం, మండలంలో మొత్తం 71 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో 42 ప్రైమరీ స్కూల్స్, 14 అప్పర్ ప్రైమరీ స్కూల్స్, 15 హైస్కూల్స్ ఉన్నాయి. ఇందులో పట్టణం, మండలంలో కలిపి 24 పాఠశాలలు తొలి విడతలో ‘మనఊరు-మనబడి’ కార్యక్రమానికి ఎంపికయ్యాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలు చేయనున్న నేపథ్యంలో సర్కారు పాఠశాలలను బలోపేతం చేస్తున్నది. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా నాణ్యమైన విద్యనందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అధికారులు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. వంటగదులు, ప్రహరీ, గేటు, మరుగుదొడ్ల మరమ్మతులు, పెయింటింగ్, నార్మల్, మేజర్ తదితర పనులు చేపడుతున్నారు. నిర్మాణ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి.
హాజరుశాతం పెరుగుతున్నది..
ప్రభుత్వ పాఠశాలల్లో ఏటికేడు విద్యార్థుల హాజరుశాతం పెరుగుతున్నది. ‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతున్నాయి. ప్రభుత్వం విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తున్నది. వచ్చే సంవత్సరం నుంచి అనుభజ్ఞులైన ఉపాధ్యాయులతో ఆంగ్ల మాధ్యమంలో బోధన జరగనున్నది. ప్రభుత్వం కార్పోరేట్స్థాయిలో విద్యా ప్రమాణాలు అమలు చేస్తున్నది. శరవేగంగా బడుల మరమ్మతుల పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 60శాతం పనులు పూర్తయ్యాయి. త్వరలోనే మిగతా పనులు పూర్తవుతాయి. – అంజయ్య, ఎంఈవో, సదాశివపేట