నర్సాపూర్, నవంబర్ 7 : తెలంగాణ సొంత ప్రజలకే కాకుండా ఇతర రాష్ర్టాల ప్రజలకు ఉపాధి కల్పిస్తూ వారి జీవనోపాధికి అండగా నిలుస్తున్నది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో వారు ఉపాధి పొందేలా తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా సహాయసహకారాలను అందజేస్తున్నది. అధికారులు, స్థానిక ప్రజలు ఇతర రాష్ట్రాల కూలీలకు అన్ని విధాలుగా మద్ధతుగా ఉంటున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో దినసరి కూలీ ఎక్కువగా ఉండడంతో ఉపాధి నిమిత్తం ఇతర రాష్ర్టాల వారు తరలివస్తున్నారు. ఇక్కడ పనులు చేసుకుంటూ వచ్చిన ఆదాయాన్ని వారి కుటుంబ సభ్యులకు పంపిస్తున్నారు. వ్యవసాయ పొలాల్లో, అడవిలో పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని నర్సాపూర్, శివంపేట్ మండలాల్లో ఛత్తీస్గఢ్ రాష్ర్టానికి చెందిన కూలీలు పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. నర్సాపూర్ మండలంలోని బ్రాహ్మణపల్లి, శివంపేట్ మండలంలోని పెద్దగొట్టిముక్కుల, కొత్తపేట్ గ్రామాల పరిధిలోని అటవీ ప్రాంతంలో కూలీ పనులు చేస్తున్నారు. అటవీశాఖ వారు అడవిప్రాంతంలో చిన్న చిన్న కందకాలు తీయడానికి ఛత్తీస్గఢ్ కూలీలను రప్పించారు. ఒక్కో కందకం 3 మీటర్ల పొడువు, 40 సెం.మీటర్ల లోతులో తీస్తున్నారు. అడవిలోని చెట్లకు నీరు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో అటవీశాఖ వారు ఈ కందకాలను తీస్తున్నారు.
సుమారు 60 మంది ఛత్తీస్గఢ్ కూలీలు అడవిలో కందకాలు తీశారు. వీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు కందకాలు తీస్తూ రోజుకు రూ. 500 నుంచి 700 వరకు ఉపాధి పొందుతున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దినసరి కూలి మహిళలకు రూ.150, పురుషులకు రూ. 200 మాత్రమే ఉండడంతో అక్కడి కూలీలు తెలంగాణ రాష్ర్టానికి వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణలో దినసరి కూలీ రెట్టింపు కంటే ఎక్కువ ఉండడంతో, కూలీలు ఇక్కడికి తరలివస్తున్నారు. పైగా ఇక్కడి అధికారులు, ప్రజలతో మమేకమై ఉత్సాహంగా కూలీ పనులు చేసుకుంటున్నారు.
ఐదేండ్ల క్రితమే మేము కూలీ పనులు చేసుకోడానికి తెలంగాణకు వచ్చాం. ఇక్కడ మాకు ఉపాధి పనులు దొరుకుతున్నాయి. పైగా కూలీ డబ్బులు కూడా మాకు సకాలంలో అందిస్తున్నారు. ప్రస్తు తం అడవిలో కందకాలు తీస్తున్నాం. గ్రామాల్లోని ప్రజలు, అటవీ అధికారులు మాకు సహాయసహకారాలు అందిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్సాహంగా పనులు చేసుకుంటున్నాం.
-నారాయణ్ కూలీ, ఛత్తీస్గఢ్
మా రాష్ట్రం ఛత్తీస్గఢ్లో దినసరి కూలీ చాలా తక్కువగా ఉంటుంది. అక్కడితో పోలిస్తే తెలంగాణలో రెట్టింపు కంటే ఎక్కువే. పురుషులకు రూ. 200, మహిళలకు రూ. 150. అదే తెలంగాణలో దినసరి కూలీ రూ. 500 నుంచి 600 వరకు ఇస్తున్నారు. కాం ట్రాక్ట్ పద్ధతిపై కూలీ పనులు చేస్తే రోజుకు రూ. 700 నుంచి రూ. 1000 వరకు సంపాదించుకుంటున్నాం. ఇక్కడి ప్రజలు సోదరభావంతో మెలుగుతూ మాకు సహాయసహకారాలు అందజేస్తున్నారు.
-పరదేశీ, ఛత్తీస్గఢ్