మెదక్-సిద్దిపేట జాతీయ రహదారి పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌తో కలిసి రోడ్లు భవనాల శాఖ అధికారులతో మెదక్- సిద్దిపేట జాతీయ రహదారి పనులపై సమీక్ష నిర్వహించారు. మెదక్ నుంచి సిద్దిపేట వరకు రూ.882.18 కోట్లతో 69.97 కి.మీటర్ల రోడ్డును వేస్తున్నారన్నారు. జాతీయ రహదారి వెళ్లే గ్రామాల వద్ద సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు. మెదక్ జిల్లాలో 33.67 కి.మీటర్లు, సిద్దిపేట జిల్లాలో 36.302 కిలోమీటర్ల వరకు నాలుగు వరుసల రహదారి రానున్నట్లు చెప్పారు. రోడ్డు విస్తరణపనులకు కావాల్సిన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని సిద్దిపేట, మెదక్ జిల్లాల కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. అటవీ భూమి కూడా సేకరించాల్సి ఉండడంతో ఫారెస్ట్ అధికారులతో మంత్రి ఫోన్లో మాట్లాడారు.
సిద్దిపేట, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మెదక్-సిద్దిపేట జాతీయ రహదారి పనులను వెంటనే ప్రారంభించాలని, భూసేకరణ పనులు త్వరితగతిన చేపట్టాలని సిద్దిపేట, మెదక్ జిల్లాల కలెక్టర్లను ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో రోడ్లు భవనాల శాఖ అధికారులతో మెదక్- సిద్దిపేట జాతీయ రహదారికి సంబంధించిన రీచ్-1, రీచ్-2 పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్షలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ జాతీయ రహదారి వెళ్లే గ్రామాల వద్ద ఫోర్‌లైన్ రోడ్డు, స్ట్రీట్ లైట్లు, సైడ్ డ్రైన్లు, రేలింగ్, ఫుట్‌పాత్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. రీచ్-1లో జాతీయ రహదారి సిద్దిపేట జిల్లాలోని పోతారెడ్డిపేట నుంచి రంగధాంపల్లి బ్రిడ్జి వరకు, రీచ్-2 పనులు మెదక్ పట్టణం నుంచి నిజాంపేట వరకు నిర్మాణం జరగనున్నదని తెలిపారు. మెదక్ నుంచి సిద్దిపేట వరకు రూ.882.18 కోట్లతో 69.97 కి.మీటర్ల రోడ్డును వేస్తారన్నారు. మెదక్ జిల్లాలో 33.67 కి.మీటర్లు, సిద్దిపేట జిల్లాలో 36.302 కి.మీటర్ల వరకు నాలుగు వరుసల రహదారి రానున్నట్లు చెప్పారు. సిద్దిపేట జిల్లాలో పోతిరెడ్డిపేట, అక్బర్పేట, చిట్టాపూర్, హబ్సీపూర్, ధర్మారం, తిమ్మాపూర్, ఇర్కోడు, బూరుగుపల్లి గ్రామాలతో పాటు సిద్దిపేట పట్టణ పరిధిలో నాలుగు వరుసల రోడ్డు రానున్నట్లు తెలిపారు.
మెదక్ జిల్లాలో మెదక్ టౌన్, పాతూరు, అక్కన్నపేట, రామాయంపేట, కోనాపూర్, నందిగామ, నిజాంపేట గ్రామాల్లో నాలుగు వరుసల రహదారి రావడంతో ఈ గ్రామాల రూపురేఖలు మారనున్నట్లు వివరించారు. జాతీయ రహదారి సాగే గ్రామాల వెంట ఫోర్‌లైన్ రోడ్డు, స్ట్రీట్ లైట్లు, ఇరువైపులా ప్రమాదాలు జరగకుండా రేలింగ్, ఇరువైపులా వర్షం నీరు నిల్వకుండా సైడ్ డ్రైన్లు, ఫుట్‌పాత్‌లు నిర్మించాలని అధికారులకు మంత్రి హరీశ్‌రావు సూచించారు. సిద్దిపేట టౌన్లో ఎన్సాన్పల్లి జంక్షన్ నుంచి రంగధాంపల్లి బ్రిడ్జి వరకు రెండు వరుసల రోడ్డుతో పాటు ఇరువైపులా స్థానిక ప్రజల సౌకర్యార్థం సర్వీస్ రోడ్డులను ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఎన్సాన్పల్లి సర్కిల్ వద్ద వెహికల్ అండర్ పాస్, సిద్దిపేటలో హైదరాబాద్-కరీంనగర్ రోడ్డు వద్ద వెహికల్ ఓవర్ పాస్ నిర్మించనున్నట్లు అర్అండ్బీ అధికారులు మంత్రికి వివరించారు. మెదక్ రామాయంపేట ఎన్‌హెచ్-44ను క్రాస్ చేసేందుకు వెహికల్ అండర్ పాస్, గజ్వేల్ రోడ్డులో రామాయంపేట సమీపంలో మరో వెహికల్ అండర్ పాస్ నిర్మిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
అక్కన్నపేట వద్ద వెహికల్ ఓవర్ పాస్ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. మెదక్ జిల్లాలో అక్కన్నపేట వద్ద రైల్వే ట్రాక్ ఉండడంతో అక్కడ వాహనాలు పోయేందుకు రైల్ అండర్ బ్రిడ్జి నిర్మించనున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ రోడ్డు నిర్మాణంతో సిద్దిపేటలో 4 మేజర్ జంక్షన్లు, 19 మైనర్ జంక్షన్లు, అభివృద్ధి కానున్నాయి. మెదక్ జిల్లాలో 4 మేజర్ జంక్షన్లు, 15 మైనర్ జంక్షన్లు అభివృద్ధి కానున్నట్లు అధికారులు వివరించారు. రామాయంపేటలో 2.65 కిలోమీటర్లు బైపాస్ రోడ్డు రానున్నట్లు మంత్రి హరీశ్‌రావుకు చెప్పారు.
జాతీయ రహదారి విస్తరణ పనులకు కావాల్సిన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట, మెదక్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. భూసేకరణ వేగంగా చేపట్టాలని ఫోన్ ద్వారా రెండు జిల్లాల కలెక్టర్లకు సూచించారు. ఈ పనుల కోసం మెదక్ జిల్లాలో 26.82 హెక్టార్లు, సిద్దిపేట జిల్లాలో 18.25 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉంటుంది. మెదక్ జిల్లాలో 9.35 హెక్టార్ల అటవీ భూమిని సేకరించాల్సి ఉందని అధికారులు మంత్రికి వివరించారు. అటవీ భూమి కూడా సేకరించాల్సి ఉండడంతో ఫారెస్ట్ అధికారులతోను మంత్రి హరీశ్‌రావు ఫోన్లో మాట్లాడారు.
అటవీ సేకరణ భూముల ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆర్‌యూబీలు, ఆర్వోబీలు నిర్మించే చోట వర్షాకాలంలో నీళ్లు నిలవకుండా జాగ్రత్తలు వహించాలని, అందుకు అనుగుణంగా డ్రైనేజీ ఏర్పాటు చేయాలని రోడ్డు భవనాల శాఖ అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. జాతీయ రోడ్డుతో గ్రామాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
సైన్ బోర్డులు, రేడియంతో ఏర్పాటు చేసే సూచికలు అవసరమైన చోట్ల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో అందోల్ ఎమ్మెల్యే క్రాంతికుమార్, రోడ్డు భవనాల జాతీయ విభాగం ఈఈ ధర్మారెడ్డి, ఎస్ఈ శ్రీనివాస్‌రెడ్డి, రోడ్లు భవనాల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.