ఝరాసంగం, నవంబర్7: సంగారెడ్డి జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన కేతకి సంగమేశ్వరస్వామి ఆలయంలో సోమవారం కార్తిక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్వతీ సమేత సంగమేశ్వరుడి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవాలకు తెల్లవారు జాము నుంచే తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. అమృతగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తిక దీపాలు వెలిగించారు. ఏటా కార్తిక పౌర్ణమి రోజుమహా ప్రాణ దీపం వెలిగించడంతో పాటు నోములు నోచుకోవడం, సత్యనారాయణ పూజలు చేయడం భక్తుల ఆనవాయితీ.
కేతకి సంగమేశ్వరస్వామి ఆలయంలో కార్తిక పౌర్ణమి పురస్కరించుకుని అర్చకుల వేద మంత్రోచ్చరణల మధ్య పార్వతీ సమేత సంగమేశ్వరుడి కల్యాణోత్సవం, గంగా హారతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అమృత గుండలంలో మహిళలు భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు చేసి దీపాలు వెలిగించి వదిలారు.
స్వామివారికి భక్తులు తోచిన రీతితో కానుకలు సమర్పించుకుని తీర్థ ప్రసాదాతీసుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో శశిధర్, ఆలయ చైర్మన్ నీలం వెంకటేశం గుప్తా, ఎంపీడీవో సుజాత, సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్, ఆలయ ధర్మకర్తలు నాగన్నపటేల్, సిద్దన్నపటేల్, లక్ష్మయ్య, నారాయణరెడ్డి, సంగన్న, గ్రామ పెద్దలు సంగమేశ్వర్, కేదర్నాథ్, భక్తులు పాల్గొన్నారు.
గుమ్మడిదల, నవంబర్7: వీరభద్రస్వామి దేవాలయం లో కార్తిక మాస పౌర్ణమి సందర్భంగా భక్తుల తాకిడి పెరిగింది. కార్తిక సోమవారంతో పాటు పౌర్ణమి కూడా కావడంతో దేవాలయ ప్రాంగణంలో భక్తుల శివనామస్మరణతో మార్మోగింది. మండలంలోని వీరన్నగూడెంలోని బొంతపల్లి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవాలయం లో భక్తులు అధికసంఖ్యలో దైవదర్శనాలు చేసుకున్నారు. ఆలయ ప్రాంగణంతో పాటు తులసికోటలో కార్తిక దీపాలు వెలిగించారు.
సామూహిక సత్యనారాయణవ్రతాలు, రుద్రాభిషేకాలు, వీరభద్రస్వామి ప్రస్తాయాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పటాన్చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సతీమణి గూడెం యాదమ్మ వీరభద్రస్వామి వారికి అభిషేకాలు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రకాళీ అమ్మవారి వద్ద కుంకుమార్చనలు చేశారు. వీరితో పాటు ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ఆలేటి శ్రీనివాస్‌రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ సోమయ్య, మహిళలు ఉన్నారు. అనంతరం అన్నదానం చేశారు.
పాపన్నపేట, నవంబర్7: కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని దీపాల కాంతుల్లో ఏడుపాయల మెరిసింది. సోమవారం సాయంత్రం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు ఏడుపాయల వనదుర్గాభవానీ మాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఏడుపాయల్లో నిర్వహించి కార్తిక దీపోత్సవంతో పాటు పౌర్ణమి పురస్కరించుకుని ఏర్పాటు చేసే పల్లకీ సేవలో భారీగా భక్తులు పాల్గొన్నారు. దుర్గామాత ఆలయంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, ఏడుపాయల చైర్మన్ బాలాగౌడ్, ఆలయ ఈవో సార శ్రీనివాస్ కార్తిక దీపోత్సవాన్ని ప్రారంభించారు.
ముందుగా అమ్మవారి సన్నిధిలో దీపాలు ముట్టించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణంతో పాటు మంజీరా నదికి ఇరుపక్కలా, రాజగోపురం నుంచి ఆలయం వరకు రహదారి వెంట దీపాలు వెలిగిం చారు. భక్తులు ప్రమిదలు వెలిగిస్తూ మొక్కులు చెల్లించున్నారు. దీంతో ఏడుపాయల అటవీ ప్రాంతంలో కార్తికదీపాలు వెలుగులు విరజిమ్మాయి. ఏడుపాయల అటవీ ప్రాంతం కార్తిక పౌర్ణమి కాంతులతోపాటు, దీపాల వెలు గుల్లో శోభాయమానంగా కనిపించింది.
కొంతమంది భక్తులు దీపాలు వెలిగించి నదిపాయల్లో వదిలి మొక్కుకున్నారు. ప్రతి పౌర్ణమికి నిర్వహించే పల్లకీ సేవ సైతం నిర్వహించారు. ముందుగా వనదుర్గాభవానీ మాత ఉత్సవ విగ్రహాన్ని ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లారు. రాజగోపురం మీదుగా ఏడుపాయల్లోని పురవీధుల్లో ఊరేగిస్తూ అమ్మవారి ఆలయానికి చేర్చారు. ఈ కార్యక్రమం తిలకించడానికి భక్తులు భారీగా హాజరయ్యారు. వీరికి అవసరమైన ఏర్పాట్లను ఆలయ అధికారులతో పాటు సిబ్బంది. పాలకమండలి సభ్యులు చేశారు.