నర్సాపూర్, నవంబర్7: కొడుకు మరణ వార్త విని గుండెపోటుతో తల్లి మృతి చెందిన ఘటన నర్సాపూర్ మండలంలోని ఖాజీపేట్ గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఖాజీపేట్ గ్రామానికి చెందిన ముచ్చర్ల విజయ్‌గౌడ్(32) గతేడాది డెయిరీ ఫాం పెట్టి, పాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. డెయిరీ ఫాంలో కొన్ని బర్రెలు చనిపోయాయి.
దీంతో విజయ్‌గౌడ్ ఆర్థికంగా నష్టపోయాడు. డైరీ ఫాం వేయడానికి తీసుకున్న అప్పులు ఎలా కట్టాలి అనే విషయాన్ని తరుచూ తండ్రి నర్సింహగౌడ్‌తో చర్చించేవాడు. డెయిరీ ఫాంలోని బర్రెల కోసం చేసిన అప్పుల గురించి మనస్తాపం చెంది శుక్రవారం అక్కడే గడ్డిమందు తాగాడు. తర్వాత విజయ్‌గౌడ్ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో చెప్పడంతో హుటాహుటిన నర్సాపూర్‌లోని ఒక ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడం తో విజయ్‌గౌడ్ ఆదివారం మృతి చెందాడు. ఈ విషయం మృతుడి తల్లి ముచ్చర్ల స్వరూపకు తెలిసింది. దీంతో కొడుకుపై బెంగ పెట్టుకున్నది. అదే రోజు అర్ధరాత్రి ఆమెకు గుండెపోటు రావడంతో మృతిచెందింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడు విజయ్గౌడ్కు భార్య, కుమారుడు ఉన్నారు. ఇద్దరి అంత్యక్రియలు సోమవారం ఖాజీపేట్ గ్రామంలో నిర్వహించారు.
తల్లీకొడుకు మరణవార్త తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి ఖాజీపేట్ గ్రామానికి వెళ్లి వారి భౌతికకాయాలకు నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోధైర్యం చెప్పారు. ఇటాంటి ఘటన జరగడం దురదృష్టకరమని విజయ్‌గౌడ్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎమ్మెల్యేతో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) రాష్ట్ర నాయకుడు అశోక్‌గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, టీఆర్ఎస్ నాయకులు సుధాకర్‌రెడ్డి, మదన్మోహన్ తదితరులు ఉన్నారు.