సంగారెడ్డి కలెక్టరేట్/ మెదక్, (నమస్తే తెలంగాణ)/ కౌడిపల్లి, నవంబర్ 7: ధనుర్వాతం, డిప్తీరియా వ్యాధుల నుంచి పిల్లలను రక్షించడానికి ఈనెల 19వ తేదీ వరకు టీడీ (టెటనస్ అండ్ డిప్తీరియా) వ్యాక్సిన్ వేయడానికి వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నది. జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఐదు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు టీడీ వ్యాక్సినేషన్ వేయనున్నట్లు సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి, మెదక్ డీఎంహెచ్‌వో విజయ నిర్మల తెలిపారు. సంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ, విద్య, సంక్షేమ శాఖల అధికారులతో జిల్లా టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించారు.
మెదక్ జిల్లా కౌడిపల్లి జడ్పీ హైస్కూల్లో టీడీ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంను డీఎంహెచ్‌వో ప్రారంభించారు. మెదక్ జిల్లాలోని 944 పాఠశాలల్లో టీడీ టీకా వ్యాక్సిన్‌ను విద్యార్థులకు వేయనున్నారు. జిల్లాలో మొత్తం 25,423 మంది ఉండగా, 10 ఏండ్ల వారు 14,218 మంది, 16 ఏండ్లు గల వారు 10,955 మంది ఉన్నారు. బడి బయట వారు 250 మంది ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ సిబ్బంది గుర్తించారు. సంగారెడ్డి జిల్లాలో ఐదో తరగతి చదువుతున్న పిల్లలు 30,930 మంది, పదో తరగతి విద్యార్థులు 25,384 మంది, కమ్యూనిటీ స్థాయిలో 2,378 మంది పిల్లలున్నారు. ధనుర్వాతం రాకుండా గతంలో టెటనస్ టీకా ఇచ్చే వారు.
డిప్తీరియాతోనూ పిల్లలు బాధపడుతున్నారని గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ 2017 నుంచి టెటనస్ స్థానంలో టీడీ వ్యాక్సిన్ ఇస్తున్నది. ఈ నెల 7నుంచి 19 వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. వ్యాక్సిన్ వేసేందుకు జిల్లాలోని ప్రతి పాఠశాలలో రెండు గదులు ఏర్పాటు చేసి ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో వ్యాక్సిన్ వేయించాలి. ప్రతీ ఏఎన్ఎం రోజు 250 డోసులు ఇచ్చేలా కార్యాచరణ రూపొందించుకున్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ 10, 16 ఏండ్ల వయస్సున్న పిల్లలందరికీ తప్పనిసరిగా టీడీ వ్యాక్సినేషన్ చేయించాలని సూచించారు. ఆయా పాఠశాలల్లో నిర్ణీత తేదీలో టీడీ వ్యాక్సినేషన్ వేయనున్నారని, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది పాఠశాలలకు వస్తారని తెలిపారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ఐదు నుంచి పదో తరగతి విద్యార్థులందరికీ వ్యాక్సిన్ వేయించేలా చూడాలన్నారు. సమావేశంలో డీఆర్వో రాధికా రమణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గాయత్రీదేవి, డాక్టర్ శశాంక్, జిల్లా విద్యాధికారి నాంపల్లి రాజేశ్, సంక్షేమ శాఖల అధికారులు, రెసిడెన్షియల్ పాఠశాలల ఆర్సీవోలు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పాల్గొన్నారు.
మెదక్ జిల్లా కౌడిపల్లి బాలుర జడ్పీహెచ్ఎస్లో టీడీ వ్యాక్సినేషన్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారిని విజయనిర్మల మాట్లాడుతూ టీడీ వ్యాక్సిన్ తప్పకుండా వేయించాలన్నారు. కోరింత దగ్గు, ధనుర్వాతం రాకుండా టీడీ వ్యాక్సిన్ ఉపయోగపడుతుందన్నారు. కంఠంలో పొరలాగా ఏర్పడి చనిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడంతో వ్యాధిని అరికట్టవచ్చు అన్నారు. మొదటిసారిగా కౌడిపల్లిలో ప్రారంభించామన్నారు.
వ్యాక్సిన్‌తో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందన్నారు. 15, 16 సంవత్సరాల వారికి రెండు రకాల క్యాన్సర్ వస్తుందన్నారు. జర్భాశయం, బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందన్నారు. ఇది హార్మోన్స్ ప్రభావం వల్ల జరుగుతుందన్నారు. పెళ్లి కాని వారికి 15 నుంచి 49 వయసు గల వారు చెకప్ చేయించుకోవాలన్నారు. యువత గుట్కా, డ్రగ్స్, ఆల్కహాల్‌కు అలవాటు పడి చిన్న వయసులోనే జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అన్నారు. డీఈవో రమేశ్‌కుమార్, డీఐవో మాధురి, కౌడిపల్లి పీహెచ్సీ డాక్టర్ శోభన, పాఠశాల హెచ్ఎం రాధాకృష్ణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.