జైకేసీఆర్.. జై టీఆర్ఎస్.. జై బీఆర్ఎస్ నినాదాలు మిన్నంటాయి. ఊరూవాడ బైక్ ర్యాలీలతో హోరెత్తింది. పటాకుల మోతలు మోగాయి. బ్యాండ్‌మేళాలతో పండుగ వాతావరణం ఏర్పడింది. స్వీట్లు నోటిని తీపిచేశాయి. నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ విజయం సాధించడంతో ఆదివారం ఉమ్మడి మెదక్ జిల్లాలో గులాబీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వామపక్ష నేతలు, అభిమానులు సంబురాల్లో మునిగి తేలారు. ఈ గెలుపుతో గులాబీ దండులో జోష్ నెలకొనగా.. బీజేపీ, కాంగ్రెస్‌లో నైరాశ్యం అలుముకున్నది. సీఎం కేసీఆర్‌కు మునుగోడు ప్రజలు జైకొట్టారని, ఆయన నాయకత్వంలోనే అభివృద్ధి, సంక్షేమ పథకాలకే ఓటేశారని ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు.
సిద్దిపేట, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ విజయం సాధించడంతో గులాబీ శ్రేణుల సంబురాలు మిన్నంటాయి. ఆదివారం ఉమ్మడి మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నారు. మునుగోడు ఓటమితో బీజేపీలో నైరాశ్యం నెలకొనగా, గులాబీ దండులో జోష్ పెరిగింది. బీజేపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా, కేంద్రంలో అధికారంలో ఉన్నామనే ధీమాతో ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి టీఆర్ఎస్ను ఇబ్బందులకు గురిచేసినా ప్రజలు టీఆర్ఎస్కే పట్టం కట్టడంతో మెతుకుసీమలో జోరుగా సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్‌కు మునుగోడు ప్రజలు జై కొట్టారని, సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే అభివృద్ధి, సంక్షేమ పథకాలకే ఓటేశారని టీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీనే అక్కున చేర్చుకొని నిండుగా దీవించారన్నారు.
బీఆర్ఎస్కు జైకొట్టిన ప్రజలు..
తెలంగాణ రాష్ట్రం మాదిరిగా దేశాన్ని తీర్చిదిద్దేందుకు బీఆర్ఎస్ పార్టీ అవతరించింది. నాడు సిద్దిపేట ప్రజలు కేసీఆర్‌ను గెలిపించి తెలంగాణ ఉద్యమానికి పంపితే.. ఇవాళ మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించడం ద్వారా బీఆర్ఎస్ అప్రతిహత ప్రస్థానానికి బాటలు వేశారు. బీఆర్ఎస్కు పునాదిరాయి మునుగోడు ప్రజలయ్యారు. దేశ రాజకీయాలను మలుపు తిప్పే సువర్ణావకాశం మునుగోడు ప్రజలకు దిక్కింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీకి తిరుగులేదు అని మరోమారు ఉప ఎన్నికల్లో ప్రజలు తేల్చి చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో మొత్తం 15 రౌండ్లకు రెండు రౌండ్లు మినహా మిగిలిన ప్రతి రౌండ్లోనూ బీజేపీపై టీఆర్ఎస్ తన ఆధిక్యతను పెంచుకుంటూ భారీ విజయం సాధించండతో ఆదివారం సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబురాలు చేసుకున్నారు. జై కేసీఆర్.. జైజై కేసీఆర్.. దేశ్‌కీ నేత కేసీఆర్ అంటూ పెద్దఎత్తున పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు.
ప్రచారంలో పాల్గొన్న ఉమ్మడి మెదక్ జిల్లా నేతలు…
ఆర్థ్ధిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు నేతృత్వంలో ఉమ్మడి మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు మునుగోడు ఉప ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. పార్టీ గెలుపు కోసం అక్కడే ఉండి కృషి చేశారు. మునుగోడు గెలుపుతో ఆదివారం టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ సంబురాలు నిర్వహించారు. స్వార్థ్ధ రాజకీయ ప్రయోజనాల కోసం అనవసరంగా ఉపఎన్నిక తీసుకువచ్చిన బీజేపీకి మునుగోడు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. చిల్లర రాజకీయాలు చేసి ఉప ఎన్నికల్లో బయట పడుదామనుకున్న ఆ పార్టీని పాతాళాలోకి తొక్కేశారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత వచ్చిన తొలి ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. తెలంగాణ రాష్ట్రంలో దూసుకుపోయిన ‘కారు’ ఇక జాతీయ స్థాయిలో రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోనున్నదని గులాబీ శ్రేణులు పేర్కొన్నారు.
ఇది ప్రజా విజయం…
తెలంగాణ ప్రజలు అభివృద్ధి, సంక్షేమం కావాలని కోరుకుని మరోసారి మునుగోడులో టీఆర్ఎస్ను గెలిపించి ఇది ప్రజా విజయంగా నిరూపించారు. చౌటుప్పల్ మున్సిపల్లోని రెండు వార్డులకు నేను కూడా ఇన్చార్జిగా పనిచేసి, టీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి నావంతు కృషి చేయడం సంతోషంగా ఉంది. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన రాజగోపాల్‌రెడ్డి పాచికలు మునుగోడు ప్రజలు తిరస్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు పొందుతున్న ప్రజలు ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టారు.
– చింతా ప్రభాకర్, టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్
మునుగోడు ఉప ఎన్నికతో బీజేపీకి గుణపాఠం
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు తీసుకుని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వ్యక్తికి మునుగోడు ప్రజలు ఓటుతో బుద్ధిచెప్పి, టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించడంతో జాతీయ స్థాయిలో సీఎం కేసీఆర్‌కు తిరుగులేదు. మునుగోడు గెలుపు ప్రజాస్వామ్య విజయం. సీఎం కేసీఆర్ వెంట తెలంగాణ ఉందని మరోసారి రుజువైంది. మునుగోడు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు.
– కొనింటి మాణిక్‌రావు, ఎమ్మెల్యే, జహీరాబాద్
మునుగోడు ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారు
బీజేపీ నాయకులు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా మునుగోడు ప్రజలు అభివృద్ధిని మాత్రమే కోరుకున్నారు. మునుగోడు గెలుపు ప్రజల విజయం, తెలంగాణ ప్రజలెప్పుడూ రాష్ర్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే టీఆర్ఎస్ వైపే ఉంటారు. ఇక్కడ టీఆర్ఎస్కు తప్ప, మరే పార్టీలకు చోటులేదన్నారు. హోరా హోరీగా సాగిన పోరాటంలో ప్రజలు అందించిన గొప్ప విజయం ఇది. హాట్సాప్ సీఎం కేసీఆర్ సార్.
– చంటి క్రాంతికిరణ్, ఎమ్మెల్యే, అందోల్
బీఆర్ఎస్కు నాంది పలికిన విజయం
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం బీఆర్ఎస్కు నాంది పలికిందని భావిస్తున్నా. జాతీయ స్థాయి రాజకీయాలకు వెళ్లాలనే సీఎం కేసీఆర్ సంకల్పానికి మునుగోడు ఉప ఎన్నిక విజయం ద్వారా తెలంగాణ ప్రజల ఆమోదం లభించింది. బీజేపీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, కుట్రలకు పాల్పడినా మునుగోడు ప్రజలు మాత్రం టీఆర్ఎస్కు పట్టం కట్టి సీఎం కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని మరోసారి నిరూపించారు. మునుగోడు విజయకంతో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో, జాతీయ స్థాయిలోనూ జైత్రయాత్ర సాగించడం ఖాయం.
– భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే, నారాయణఖేడ్
ఇది మునుగోడు ప్రజల గొప్పతనం
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు టీఆర్ఎస్ను దీవించారు. ఇది మునుగోడు ప్రజల గొప్పతనం. బీజేపీ అభ్యర్థి ప్రజలకు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా గులాబీ పార్టీని ప్రజలు గెలిపించుకున్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో 1వ వార్డు, 13వ వార్డులను ఇన్చార్జిగా ఉండి పార్టీని విజయపథంలో నడిపించాం. చౌటుప్పల్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నా. గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి శుభాకాంక్షలు.
– గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే, పటాన్చెరు
ప్రజలంతా టీఆర్ఎస్ వైపే…
తెలంగాణలో ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారు. ప్రతి పక్షాలు ఎన్ని కుట్రలు, కుంతత్రాలు పన్నినా గులాబీ పార్టీకే పట్టం కట్టారు. ప్రజా సంక్షేమమే ధ్యేయం సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టి, పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలకు నిస్వార్థంగా సేవలందిస్తున్నారు. ప్రతి పక్షాల ఎత్తులను మునుగోడు ప్రజలను చిత్తు చేసి టీఆర్ఎస్ను గెలిపించి పార్టీపై వారికి ఉన్న అభిమానాన్ని చాటారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయానికి తోడ్పడిన మునుగోడు ప్రజలకు కృతజ్ఞతలు.
– గంగుమల్ల ఎలక్షన్‌రెడ్డి, ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్