ఝరాసంగం, నవంబర్6: కేతకీ సంగమేశ్వరస్వామి దేవాలయం దక్షిణ కాశీగా బాసిలుతున్నది. ఆదివారం స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. కార్తిక మాసం కావడంతో తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ర్ట నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం శివ నామస్మరణతో మార్మోగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు అమృత గుండంలో పుణ్యస్నానాలు ఆచరించారు. పార్వతీ సమేత సంగమేశ్వర స్వామికి కుంకుమార్చన, రుద్రాభిషేకం, క్షీరాభిషేకంతో పాటు అన్నపూజ చేశారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేకంగా కార్తిక మాసం లో శివుడి దేవాలయానికి వెళ్లి దీపాలు వెలిగిస్తే సకల దోషాలు తొలిగిపోతాయని నమ్మకం. ఏటా మహిళలు కార్తిక మాసంలో నియమనిష్టలతో దీపాలు వెలిగిస్తుంటారు. కార్తిక పౌర్ణమి రోజు నోములు నోచుకుంటారు. శివాలయాలకు వెళ్లి దీపాలు వెలిగిస్తూ మొక్కులు చెల్లింకుంటారు. మహిళలు, పిల్లలు, యువకులు, వృద్ధులు కలిసి బొగుడ వృక్షం కింద దీపాలు వెలిగిస్తారు. భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.
వీరభద్రస్వామి సన్నిధిలో..
గుమ్మడిదల, నవంబర్6: జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రాల్లో ఒకటైన బొంతపల్లి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు వీరభద్రస్వామి సన్నిధిలో బారులు తీరి దర్శనాలు చేసుకున్నారు. ఆల య ప్రాంగణంలో కార్తిక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. వీరభద్రస్వామికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. భద్రకాళీ అమ్మవారి వద్ద సామూహిక కుంకుమార్చన చేశారు. సామూహికంగా రుద్రాభిషేకాలు, సత్యనారాయణ వ్రతాలు, కుంకు మార్చనలు చేశారు. దేవాలయాల్లో సాయంత్రం సమయంలో దీపాలు వెలిగించి, శివనామస్మరణ చేశా రు. తులసికోటలో కార్తిక దీపాలు వెలిగించారు. ఈవో శశిధర్గుప్తా,జూనియర్ అసిస్టెంట్ సోమయ్యల పర్యవేక్షణలో వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు.