మెదక్ రూరల్, నవంబర్ 6 : జిల్లావ్యాప్తంగా ఆలయాలు అఖండ దీపారాధనలతో దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. పున్నమి వెన్నెలకు తోడు దీపకాంతులు, ఆధ్యాత్మిక సౌరభాల తో కార్త్తికపౌర్ణమి కాంతిమయం కానున్నది. పరమ శివుడికి అత్యంత ప్రీతికరమైనది కార్తికమాసం. ఈ సందర్భంగా శైవ, వైష్టవ క్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. భక్తులు ఇష్టదైవాలను దర్శించుకుని దీపారాధన చేస్తారు.
ఆలయాలు ముస్తాబు
మెదక్ మండలంలోని శివాలయం, గరుడగంగ సరస్వతీ ఆలయం, కొయ్యగుట్ట మల్లికార్జున తదితర ఆలయాల్లో సుం దరీకరణ పనులు పూర్తి చేశారు. సోమవారం కార్తిక పౌర్ణమి పురస్కరించకుని ఆలయాల్లో పంచామృత అభిషేకాలు, విశేషాలంకరణ, బిల్వ పత్రాలతో ప్రత్యేక పూజలు, సత్యనారాయ ణ వత్రాలు నిర్వహిస్తారు. రాత్రి ఆలయాల్లో మహిళలు ఉసరి చెట్టు వద్ద పూజలు చేసి దీపాలు వెలిగించనున్నారు.
మల్లన్నస్వామి, రేణుకమాతకు ప్రత్యేక పూజలు
మెదక్ మండలంలోని మంబోజిపల్లి శివారులోని కొయ్య గుట్టపై మల్లన్నస్వామికి భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, చేసి, ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. రేణుకాలయంలో మహిళలు పూజాలు నిర్వహించారు.
నేడు బగళాముఖి శక్తిపీఠంలో జ్వాలాతోరణం
శివ్వంపేట, నవంబర్ 6 : మండలకేంద్రం శివ్వంపేటలోని బగలాముఖీ శక్తిపీఠంలో సోమవారం సాయంత్రం 7 గంటల నుంచి జ్వాలాతోరణం నిర్వహిస్తున్నట్టు శక్తిపీఠం వ్యవస్థాపకుడు, ఆలయ ఉపాసకుడు శాస్ర్తుల వెంకటేశ్వరశర్మ తెలిపారు.
సామూహిక సత్యనారాయణ వ్రతాలు
వెల్దుర్తి, నవంబర్ 6 : మాసాయిపేట మండల పరిధిలోని స్టేషన్ మాసాయిపేటలో సామూహిక సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు. స్థానిక హనుమాన్ దేవాలయంలోని దేవతామూర్తులకు విశేషాలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సామూహిక సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు.