జహీరాబాద్, నవంబర్ 5: ప్రకృతిలో అంతరించిపోతున్న చిరుధాన్యాలు, సేంద్రియ ఎరువులు, ఔషధ మొక్కలను కాపాడేందుకు కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) పరిశోధనలు చేస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో పంటల పరిశోధన చేసేందుకు ప్రభుత్వం జహీరాబాద్ శివారు దిడ్గి సమీపంలో కేవీకేను ఏర్పాటు చేసింది. నవంబర్ మాసంతో కేవీకే నెలకొల్పి 30 సంవత్సరాలు పూర్తి అవుతుంది. కేవీకేకు పలు దేశాలకు చెందిన ప్రతినిధులు వచ్చి ఇక్కడ చేస్తున్న చిరుధాన్యాలు, నూనె గింజల సాగును అధ్యయనం చేస్తున్నారు. అలాగే, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల రైతులు వచ్చి పంటలను పరిశీలిస్తున్నారు. కేవీకే శాస్త్రవేత్తలు రైతులు పంట మార్పిడి చేసేందుకు మట్టి పరీక్షలు నిర్వహించి ఫలితాలు అందిస్తున్నారు. ఔషధమొక్కలు, ఉద్యాన మొక్కల సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. పనితీరును ప్రమాణికంగా కేంద్ర ప్రభుత్వం కేవీకేలకు ఏ,బీ,సీ గ్రేడ్లు ఇస్తుంది. మౌలిక సదుపాయలు, చిరుధాన్యాల సాగు, సేంద్రియ ఎరువుల ఉత్పత్తి, నూనె గింజల సాగును ప్రోత్సహించడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు జహీరాబాద్‌కు బీ గ్రేడ్ కు ప్రకటించింది.
దేశంలోనే ఆదర్శం..
సేంద్రియ ఎరువులతో చిరుధాన్యాలు సాగు చేసి, అధిక దిగుబడులు సాధించేందుకు కృషి విజ్ఞాన కేంద్రం ఎన్నో పరిశోధనలు చేస్తున్నది. వివిధ పంటలపై పరిశోధన చేసేందుకు దేశంలో 733 కేవీకే కేంద్రాలు పని చేస్తున్నాయి. తెలంగాణలో 16 కేవీకే ఉండగా, సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ శివారులో ఒకటి ఉంది. ఈ కేవీకేలో వ్యవసాయ శాస్త్రవేత్తలు చిరుధాన్యాలు, ఉద్యాన పంటలు, నూనె గింజలపై పరిశోధన చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ సంస్థలో రైతులకు శిక్షణ ఇచ్చేందుకు మౌలిక సదుపాయలు, భవనాలు, ల్యాబ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. సేంద్రియ ఎరువులతో శనగను సాగు చేసేందుకు జహీరాబాద్ కేవీకే పరిధిలో 8 గ్రామాల రైతులకు ఒక ఎకరానికి 30కిలోల శనగలు ఉచితంగా రైతులకు పంపిణీ చేశారు.
50 ఎకరాల్లో తెల్ల కుసుమలు పెంచేందుకు 300 మంది రైతులకు ప్రతి రైతుకు ఎకరానికి 4 కిలోల విత్తనాలు అందజేశారు. సేంద్రియ ఎరువులతో సాగు చేసే చిరుధాన్యాల పంటలను పరిశీలించేందుకు ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు కేవీకేకు వస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన శాస్త్రవేత్తలు కేవీకేకు వచ్చి సాగు పద్ధతులు తెలుసుకుంటున్నారు.
చిరుధాన్యాల సాగుకు ప్రోత్సాహం
జహీరాబాద్ శివారులో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు సేంద్రియ ఎరువులు, చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దేశంలో ఉన్న కేవీకేలకు ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది. కొన్ని కేవీకేలు రసాయన ఎరువులతో పంటల సాగుపై పరిశోధన చేస్తుండగా, జహీరాబాద్‌లో కేవీకే సేంద్రియ ఎరువులతో పంటలు సాగు చేసే పద్ధతులపై పరిశోధన చేస్తున్నది. అంతరించిపోతున్న పంటలైన శనగ, తెల్ల కుసుమల సాగును ప్రోత్సహించేందుకు ఈ ఏడాది రైతులకు ఉచితంగా విత్తనాలు పంపిణీ చేశారు. ఎలాంటి రసాయన ఎరువులు వినియోగించకుండా పంటలు సాగు చేసేందుకు కేవీకే శాస్త్రవేత్తలు రైతుల పొలాల వద్దకు వెళ్లి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. జహీరాబాద్, మొగుడంపల్లి, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, రాయికోడ్ మండలాల్లో చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నారు.
సుగంధ ద్రవ్యాల మొక్కల పెంపకం
జహీరాబాద్ కేవీకే 15 ఎకరాల్లో ఉంది. ఇక్కడ అంతర్ పంటలుగా ఉద్యాన మొక్కలు పెంచి పరిశోధనలు చేస్తారు. సేంద్రియ ఎరువులతో సుగంధ ద్రవ్యాల మొక్కలు సైతం పెంచుతున్నారు. సర్పగంధ మొక్కలు శాస్త్రీయ నామము రావుల్ఫీలా సెర్పంటీనా అంటారు. దీని వేర్లు ఆకులు, పువ్వులు జాసింట్రీ, యునానీ వైద్యంలో ఉపయోగిస్తారు. అత్తిపత్తి మొక్కలు దీన్ని మైమోస పూడికే అంటారు. దీని ఆకులు, వేర్లు గింజలను పుండ్లు, గాయాలు, పైల్స్, వీర్యవృద్ధికి ఉపయోగిస్తారు. ఇలా వివిధ రకాల మొక్కలను పెంచి పరిశోధనలు చేస్తున్నారు.
భూసార పరీక్షలు..
ప్రతి ఏడాది కేవీకే శాస్త్రవేత్తలు రైతుల పొలంలో మట్టిని సేకరించి, ఉచితంగా మట్టి పరీక్షలు చేస్తున్నారు. పరీక్షలో ఫలితాలు చూసి ఏ పంటలు సాగు చేయాలో ఆవగాహన కల్పిస్తున్నారు. ప్రతి సీజన్లో పంట మార్పిడి చేస్తే అధిక దిగుబడులు సాధించొచ్చని రైతులకు సూచిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా రైతులకే కాకుండా పలు ప్రాంతాల వారికి మట్టి పరీక్షలపై అవగాహన కల్పిస్తున్నారు. మట్టి సేకరించే విధానం, మట్టి పరీక్షల చేసే పద్ధతులు వివరిస్తున్నారు.
గోమూత్రంతో కషాయం ఉత్పత్తి చేసి అమ్మకాలు
గోమూత్రంతో కషాయం తయారు చేసి రైతులకు విక్రయిస్తున్నారు. గోమూత్రంతో కషాయం తయారు చేసే విధానంపై సిబ్బంది రైతులకు ఆవగాహన కల్పిస్తున్నారు. గోమూత్రం, వేప ఆకులు, నాటు పచ్చి మిర్చి, వెల్లుల్లి కషాయం తయారు చేసేందుకు ఉపయోగిస్తున్నారు. ఆధునిక వ్యవసాయంలో రకరకాల రసాయనాలు, ఎరువులు వాడకంతో ఖర్చులు ఎక్కువ అవడంతో పాటు రసాయన ఎరువులు అధికంగా వినియోగించడంతో దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు కేవీకే శాస్త్రవేత్తలు సేంద్రియ ఎరువులతో పంటలు సాగు చేసేలా పరిశోధనలు చేస్తున్నారు. ప్రకృతిలో ఉండే వనరులతో ఆకులను ఉపయోగించి, రకరకాల కషాయలు తయారు చేసి పంటలపై వచ్చే చీడపీడలను ఆరికట్టి పురుగులు, సూక్ష్మాలను కాపాడేందుకు కృషి చేస్తున్నారు.
చిరుధాన్యాల సాగును పెంచేందుకు కృషి
జహీరాబాద్ కేవీకే పరిధిలో చిరుధాన్యాల సాగును పెంచేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. కొన్ని గ్రామాలను యాసంగిలో ఎంపిక చేసి రైతులకు ఉచితంగా శనగలు, తెల్ల కుసుమ విత్తనాలు పంపిణీ చేశాం. ప్రకృతిలో ఉండే ఆకులతో సేంద్రియ ఎరువులు ఉత్పత్తి చేసి పంటలపై పిచికారి చేసేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నాం. పంటల దిగుబడులు పెంచేందుకు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మట్టి పరీక్షలు చేసి రైతులకు పంట మార్పిడి చేసేందుకు ప్రోత్సహిస్తున్నాం. ప్రభుత్వ ప్రోత్సాహంతో చిరుధాన్యాల సాగును పెంచేందుకు కృషి చేస్తున్నాం.
– డాక్టర్, సురేశ్ దగడే, కేవీకే ప్రధాన శాస్త్రవేత్త
ఔషధ మొక్కల పెంపకానికి ప్రోత్సాహం
కేవీకే అవరణలో ఉన్న ఖాళీ భూమిలో ఔషధ మొక్కలు పెంచుతున్నాం. పంటల పరిశోధనతో పాటు ఔషధ మొక్క లు, ఉద్యాన పంటలు, సేంద్రియ ఎరువుల తయారీపై రైతులకు శిక్షణ ఇస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంతో పాటు పలు రాష్ర్టాల రైతులు, శాస్త్రవేత్తలు ఇక్కడికివచ్చి చిరుధాన్యాల సా గును తెలుసుకుంటున్నారు.
– శైలజా, కేవీకే శ్రాస్త్రవేత్త జహీరాబాద్