నంగునూరు, నవంబర్ 5 : బీజేపీకి వడ్లు కొనడం చేతకాదు కానీ, ఎమ్మెల్యేలను కొనడం చేతనైతదని కేంద్రం పై ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మండలంలో ని సిద్దన్నపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతన్నల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, చెక్‌డ్యాంల నిర్మాణంతో నేడు రాష్ట్రంలో కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తూ, దేశానికి తెలంగాణ ధాన్యాగారంగా మారిందన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి జిల్లాలో కేవలం లక్ష మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండితే నేడు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల పండుతుందన్నారు.
రంగనాయకసాగర్ రిజర్వాయర్ ద్వారా జిల్లాలోని చెరువులు నింపి పొలాలకు నీరు అందిస్తున్నామని తెలిపారు. ఈసారి పెద్దవాగులోకి కూడా నీటిని వదిలి చెక్‌డ్యామ్‌లు నింపుతామన్నారు. కొంతమంది హైదరాబాద్‌లో కూర్చొని కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితం రాలేదని మాట్లాడుతున్నారని, గ్రామా ల్లో తిరిగితే రైతులే సమాధానం చెబుతారన్నారు. ధాన్యం కొన్న మూడురోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ అయ్యేలా ప్రభుత్వం నిధులు సమకూర్చిందన్నా రు. రాష్ట్ర ప్రగతిని చూసి ఓర్వలేని కేంద్రం బావుల వద్ద మోటర్లకు మీటర్లు పెట్టి రైతులకు బిల్లులు వసూలు చేస్తే, రాష్ర్టానికి రూ.30 వేల కోట్లు ఇస్తామని ఆశ చూపెడుతున్నారన్నారు.
ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి, రైస్ మిల్లులో ధాన్యం దింపుకోవడానికి, తరుగు ఇతరత్రా ఇబ్బందులు పెట్టకుండా ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఏఎంసీ చైర్మన్లు, ఐకేపీ సిబ్బంది పర్యవేక్షించాలని మంత్రి అన్నారు. పెద్ద రైతులు ఆయిల్‌పామ్ సాగు చేసేందుకు ముందుకు రావాలని, ఆయిల్‌పామ్ తోటలకు ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తున్నదని మంత్రి అన్నారు. మూడేండ్ల తర్వాత రెట్టింపుకు మించి ఆదాయం వస్తున్నదన్నారు. పంట అమ్ముకోవడానికి నర్మెట గ్రామంలో రూ.300 కోట్లతో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సారయ్య, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రమేశ్‌గౌడ్, నాయకులు వెంకట్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, సంగు పురేందర్ పాల్గొన్నారు.