నారాయణఖేడ్, నవంబర్ 5: నారాయణఖేడ్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో శనివారం 49 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం అల్పాహారంగా ఇచ్చిన అటుకుల ఉప్మాలో పురుగులు ఉండడమే ఇందుకు కారణమని విద్యార్థినులు తెలిపారు. అస్వస్థతకు గురైన విదార్థినులను పోలీసుల సహకారంతో స్థానిక ఏరియా దవాఖానకు తరలించి చికిత్సలు అందిస్తున్నారు. తొలుత 25 మంది అస్వస్థతకు గురయ్యారు.
అనంతరం ఒకరి తర్వాత ఒకరు మొత్తం 49 మంది కడుపునొప్పి, వాంతులతో బాధ పడడంతో వీరిందరినీ దవాఖానకు తరలించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పాఠశాలలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి, విద్యార్థినులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాఠశాలలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మొత్తం 382 మంది విద్యార్థినులు ఉన్నారు. మెనూ ప్రకారం వీరికి భోజనం పెట్టడం లేదని, ఇచ్చే భోజనంలో నాణ్యత, పరిశుభ్రత పాటించడం లేదని విద్యార్థినులు ఆర్డీవో అంబాదాస్ రాజేశ్వర్‌కు తెలిపారు.
ఆర్డీవో దవాఖానను సందర్శించి విదార్థినుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు పాఠశాలను తనిఖీ చేసి, అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. ఈ ఘటనపై జిల్లా అధికారులకు నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట సీఐ రామకృష్ణారెడ్డి, తహసీల్దార్ మురళీధర్, ఎంఈవో విశ్వనాథ్ ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న జడ్పీటీసీ లక్ష్మీబాయి రవీందర్‌నాయక్, మాజీ సర్పంచ్ ఎం.ఏ.నజీబ్, బంజారా సేవాలాల్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్చౌహాన్ దవాఖానను సందర్శించి విద్యార్థుల ఆర్యోగ పరిస్థితిపై ఆరా తీశారు.
ప్రత్యేకాధికారి సహా ఆరుగురిపై వేటు: డీఈవో
పెద్ద సంఖ్యలో విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయాన్ని తెలుసుకున్న డీఈవో రాజేశ్, నారాయణఖేడ్ ఏరియా దవాఖానను సందర్శించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలు అందజేయాలని వైద్యాధికారులను కోరారు. పరిస్థితి తీవ్రంగా ఉన్న విద్యార్థినులను సంగారెడ్డి, హైదరాబాద్ దవాఖానలకు తరలించాల్సిందిగా సూచించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. విదార్థినులకు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందజేయడంలో నిర్లక్ష్యం వహించిన పాఠశాల ప్రత్యేకాధికారిణి రాజేశ్వరితో పాటు ఐదుగురు వంట సిబ్బందిపై సస్పెన్షన్ విధిస్తున్నట్లు పేర్కొన్నారు.