మెదక్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు ఇప్పటి వరకు జిల్లాలో 154 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, 712 మంది రైతుల నుంచి 3,468 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నట్లు అదనపు కలెక్టర్ రమేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఈ వానకాలంలో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసి, అందుకనుగుణంగా ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, డీసీఎంఎస్, రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా 410 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. నేటి వరకు 154 కేంద్రాల్లో రూ.7 కోట్ల 14 లక్షల విలువైన ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ఎప్పటికప్పుడు అధికారులు, కేంద్రం నిర్వాహకులకు తగు ఆదేశాలిస్తూ ధాన్యం కొనుగోళ్లు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. తాళ్లు, ఎఫ్ఎక్యూ ప్రమాణాలకనుగుణంగా పరిశీలించిన తరువాతే ధాన్యం రైస్ మిల్లులకు పంపిస్తున్నట్లు తెలిపారు. అన్లోడ్ చేసుకోవడంలో మిల్లర్లు ఇబ్బందులు కలుగచేయరాదని సూచించారు. ధాన్యం తరలింపునకు వినియోగించే వాహనాలు రోడ్లపై వేచి ఉండకుండా, కొనుగోలు కేంద్రాలు, మిల్లుల్లో అవసరం మేర కూలీలను ఏర్పాటు చేసుకుని, లోడింగ్, అన్లోడింగ్ వెంటనే జరిగేలా చూడాలని పేర్కొన్నారు. ట్యాబ్ ఎంట్రీ కూడా వేగవంతంగా జరగాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాలతో…రైతులకు లాభం…
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర అందించి ఆదుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలతో రైతులకు లాభం చేకూరుతుందని జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్, డీసీవో కరుణ అన్నారు. గురువారం మండలంలోని శెట్పల్లికలాన్, బండపోసాన్‌పల్లి, ఉప్పులింగాపూర్ గ్రామాలలో వెల్దుర్తి సహకార సంఘం ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంఘం చైర్మన్ అనంతరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమాలలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు లత, నరేందర్‌రెడ్డి, ఎంపీడీవో జగదీశ్వరాచారి, డైరెక్టర్ వెంకట్‌రెడ్డి, ఏఈవో ఉత్తమ్‌కుమార్, సీఈవో సిద్దయ్య, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, సిద్దిరాంలు, హన్మంత్‌రావు, కిష్ణారెడ్డి, సునందరెడ్డిలతో పాటు పలువురు పాల్గొన్నారు.