సదాశివపేట, నవంబర్ 3 : గజిబిజి.. ఉరుకులు, పరుగుల జీవితంతో ప్రజలు నిత్యం సతమతమవుతూ గజినీలుగా మారుతున్నారు. మెదడు ఆలోచనా వలయంలో చిక్కుకోవడంతో ఏకాగ్రత కోల్పోతూ క్షణాల వ్యవధిలోనే పాత విషయాలను మర్చిపోతున్నారు. మెదడు ‘స్మార్’్టగా పట్టుతప్పుతున్నది. మనిషి దైనందిన జీవితంపై స్మార్ట్‌ఫోన్ అధిక ప్రభావం చూపుతున్నది. అండ్రాయిడ్ ఫోన్‌కు గంటలకొద్దీ అతుక్కుపోతుండడంతో మానసిక, శారీరక సమస్యలు దాడి చేస్తున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా మతిమరుపు వ్యాధి అందరినీ ఇబ్బందిపెడుతున్నది. స్మార్ట్‌ఫోన్ వినియోగంపై స్వీయనియంత్రణ లేకుంటే పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
చిన్నా, పెద్దా తేడా లేదు..
చిన్నా, పెద్దా తేడాలేకుండా చాలా మంది మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారు. ఇది ఆందోళన కలిగించే విషయమని వైద్యులు అంటున్నారు. తొలి దశలోనే మతిమరుపుకు చెక్ పెట్టకపోతే అది అనేక సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. స్టౌపై వంట పూర్తి చేసి గ్యాస్ రెగ్యులేటర్ ఆఫ్ చేయడం దగ్గర నుంచి ఆఫీసుకు వెళ్లే సమయంలో ఇంట్లో మొబైల్ మరిచిపోవడం, జేబులో పర్సు పెట్టుకోకపోవడం తరుచుగా జరుగుతున్నాయంటే మతిమరుపు ఉన్నట్లే. గతంలో వృద్ధాప్యంలో మతిమరుపు, దృష్టిలోపం వంటివి ప్రధాన ఆరోగ్య సమస్యలుగా ఉండేవి. కానీ, సెల్‌ఫోన్ పుణ్యమా అని పదిహేను సంవత్సరాల వయసు నుంచే విద్యార్థులు, యువత ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.
స్మార్ట్‌ఫోన్ వినియోగం విపరీతంగా పెరగడంతో దాని ప్రభావం మెదడుపై పడుతున్నది. బేసిక్ ఫోన్లు ఉన్న కాలంలో 10కి పైగా ఫోన్ నెంబర్లు గుర్తుండేవి. ఇప్పుడు ఒకట్రెండు కూడా గుర్తుండడం కష్టమే. ఒకప్పుడు చిన్న చిన్న లెక్కల కోసం ఎక్కాల్ని స్మరించుకుంటూ చేతివేళ్లపై పూర్తి చేసే వాళ్లం. ఇప్పుడు చిన్న పాటి లెక్కలకూ స్మార్ట్‌ఫోన్ వినియోగించే పరిస్థితి దాపురించింది.
ఆహార సమతుల్యత ముఖ్యం..
మెదడు ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. ఆహారంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వు పదార్థాలు, ప్రోటీన్లు అవసరమైన మేరకు ఉండేలా చూసుకోవాలి. ప్రొటీన్లు మాత్రం తప్పనిసరిగా శరీరానికి అందాలి. ఆహారంలో అధిక శాతం కొవ్వు ఉండడంతో మెదడులో జ్ఞాపకశక్తికి కేంద్రస్థానమైన హిప్సోక్యాంపస్ భాగం పనితీరు దెబ్బతింటుంది. అయితే, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మాత్రం మెదడు మరింత చురుగ్గా పని చేసేందుకు తోడ్పడతాయి. ముఖ్యంగా గర్భస్థ శిశువులో మెదడు ఎదుగుదలకు ఇది బాగా అవసరం.
బ్రెయిన్ పిల్స్ వాడొద్దు..
జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి, మెదడును చురుగ్గా ఉంచుకోవడానికి మార్కెట్లో దొరికే మందులు, ఔషధాలను వాడడం వల్ల ఎలాం టి ప్రయోజనం ఉండదు. ఏ రకమైన ప్రొటీన్లు, విటమిన్లు అయినా సహజ ఆహార రూపంలో తీసుకుంటేనే ప్రభావవంతంగా పని చేస్తాయి. అడ్డగోలుగా సప్లిమెంట్లను వినియోగిస్తే జీర్ణాశయ సమస్యలు, లైంగిక పట్టుత్వం కోల్పోవడం, అధిక రక్తపోటు, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి.
– డాక్టర్ ప్రవీణ్‌కుమార్,ఆత్మకూర్ పీహెచ్సీ
విశ్రాంతి లేక విసుగు చెందుతున్న మెదడు..
మన మెదడు చురుగ్గా పని చేయాలంటే శరీరానికి తగినంత నిద్ర, విశ్రాంతి అవసరం. నిద్రకూడా పూర్తి స్థాయి గాఢ నిద్ర ఉండాలి. రోజుకు 6 నుంచి 8 గంటల వరకు నిద్ర అవసరం. పని మధ్యలోనూ పది నుంచి పదిహేను నిమిషాలు విశ్రాంతి తప్పనిసరి. మెలకువతో ఉన్నంత సేపు ఏదైనా చూసినా, విన్నా, అనుభూతి చెందిన ప్రతి జ్ఞాపకం మెదడుకు చేరుతుంది. వాటిని మెదడు ప్రాసెస్ చేసి శరీర అవయవాలకు ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ క్రమంలో మెదడులో కొన్ని రకాల ప్రొటీన్లు ఉత్పత్తి అవుతుంటాయి. ఎక్కువ సేపు నిద్ర పోకుండా ఉండేలా ఆ ప్రోటీన్లు మెదడులో పేరుకుపోతూనే ఉంటాయి. దీని వల్ల మనం దేనిపైనా ఏకాగ్రత పెట్టకపోవడం, ఆలోచించలేకపోవడం, కొత్త విషయాలను నేర్చుకోకపోవడం జరుగుతాయి.
మెదడుకు చురుగ్గా ఉండాలంటే..
రోజుకు మితంగా కాఫీ తీసుకోవాలి.
చేపలు, మాంసం వారంలో ఒక్క సారైనా తినాలి.
రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.
క్రాస్‌వర్డ్స్, ఫజిల్స్, సుడోకో వంటి వాటిపై దృష్టి పెట్టండి.
యోగా, ధ్యానం వంటివి రోజూ కొద్దిసేపు చేయాలి.