నిత్యజీవితంలో ఇంటర్నెట్ భాగంగా మారింది. ఇంటింటికీ ఇంటర్నెట్ సేవలు అందిస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ నెరవేరనున్నది. ప్రతి పంచాయతీ భవనాన్ని అనుసంధానం చేస్తూ అందులోనే ఇంటర్నెట్ను సరఫరా చేసే మిషన్లను బిగించి, కనెక్షన్లు ఇచ్చారు. మెదక్ జిల్లాలోని తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లోని పలు గ్రామాల్లో ఇప్పటికే ఇందుకు సంబంధించిన సామగ్రిని బిగించారు. వీటిని మానిటరింగ్ చేసేందుకు స్థానిక తహసీల్ కార్యాలయాల్లో ఫైబర్ ఇంటర్నెట్ను సరఫరా చేసే మిషన్లు ఏర్పాటు చేసి టెస్ట్ డ్రైవ్ చేస్తున్నారు. త్వరలోనే వీటికి ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఇవ్వనున్నారు.
మనోహరాబాద్, నవంబర్ 2 : ఇంటింటికీ ఫైబర్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఇందు కోసం ప్రతి గ్రామ పంచాయతీ భవనానికి అనుసంధానం చేస్తూ, ఇంటర్నెట్ సామగ్రిని తరలించింది. తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లోని పలు గ్రామాల్లో ఇప్పటికే ఇంటర్నెట్కు సంబంధించిన సామగ్రిని తీసుకొచ్చి బిగించారు. వీటికి ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఇవ్వనున్నారు. ఇంటింటికీ ఇంటర్నెట్ సేవలను అందిస్తామని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ నెరవేరనున్నది. పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో కొత్తగా నిర్మిస్తున్న పంచాయతీ భవనాలను మినహా, అన్ని పక్కా పంచాయతీ భవనాల్లో ఫైబర్ ఇంటర్నెట్కు సంబంధించిన సామగ్రిని బిగించారు.
గ్రామ పంచాయతీల్లో ..
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ ఏ విధంగా మంచి నీరు అందుతున్నాయో అదే తరహాలో ఇంటింటికీ ఫైబర్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పిస్తామని మంత్రి కేటీఆర్ గతంలో ప్రకటించారు. ఇందులో భాగంగానే ప్రతి గ్రామానికి ఫైబర్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మానిటరింగ్ చేసేందుకు మనోహరాబాద్ తహసీల్‌లో మిషన్లను ఏర్పాటు చేసి టెస్ట్ డ్రైవ్ చేస్తున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రజలకు ఇంటర్నెట్ సేవలు నిత్యవసరంగా మారాయి. మారుమూల గ్రామాల్లో ప్రైవేటు టెలికాం వ్యవస్థల ద్వారా ప్రజలు అధిక ఖర్చులు చెల్లించి ఇంటర్నెట్ సేవలను పొందుతున్నారు. కాగా కొన్ని మారుమూల గ్రామాల్లో నెటవర్క్ సమస్యల ద్వారా అంతంత మాత్రంగానే పని చేస్తున్నాయి.
ఉద్యోగులు, వ్యాపార సముదాయాలు, విద్యార్థులకు ఇంటర్నెట్ తప్పనిసరిగా మారింది. పెద్ద పెద్ద పట్టణాలకే తప్ప.. మారుమూల గ్రామాల్లో ఫైబర్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేవు. దీంతో మారుమూల గ్రామాల ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు పట్టణాల్లో అద్దె గదులు, దుకాణాలను ఏర్పాటు చేసుకొని కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మారుమూల గ్రామాలకు సైతం ఫైబర్ ఇంటర్నెట్ సేవలను అందించాలనే ఉద్దేశంతో ఇంటింటికీ ఇంటర్నెట్ సేవలను అందిస్తామని ప్రకటించింది. దీనిపై పలు మార్లు మంత్రి కేటీఆర్ బహిరంగ ప్రకటలను సైతం చేసి, కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకున్నారు.
చేరువ కానున్న సేవలు..
ఫైబర్ ద్వారా వచ్చే ఇంటర్నెట్ మొబైల్ టెలికాం ద్వారా వచ్చే ఇంటర్నెట్ స్పీడ్ కంటే అధిక రెట్లు స్పీడ్‌గా ఉంటుంది. దీంతో వారు ప్రైవేటు ఫైబర్ ఇంటర్నెట్లకే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఫైబర్ నెట్‌సేవలు పూర్తి దశకు చేరుకుంటే ఇంటింటికీ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు పూర్తి స్థాయిలోకి అందుబాటులోకి వస్తాయి.