సంగారెడ్డి, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): సుదీర్ఘకాలంగా సంగారెడ్డి ప్రజలు ఎదురుచూస్తున్న కల త్వరలో నెరవేరనున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు జిల్లా కేంద్రంలో 150 సీట్లతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. కళాశాల ఏర్పాటు కోసం 45 ఎకరాల స్థలం కేటాయించటంతోపాటు రూ.510 కోట్ల నిధులు కేటాయించారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చొరవతో బోధన సిబ్బంది నియామకాలు త్వరితగతిన జరిగాయి. సంగారెడ్డి ప్రభుత్వ దవాఖాన ప్రాంగణంలో ఈ మెడికల్ కాలేజీ నిర్మాణం పనులు చేపట్టారు. ప్రస్తుతం భవనం నిర్మాణం పనులు పూర్తి అయ్యాయి. నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) అక్టోబర్‌లో మెడికల్ కాలేజీకి అనుమతులు మంజూరు చేసింది. ఇటీవల ఎంబీబీఎస్ సీట్ల కోటాను ఖరారు చేసింది. ఆల్ ఇండియా స్థాయిలో 22 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించగా, స్టేట్ కోటాలో 128 సీట్లు కేటాయించారు. త్వరలోనే మెడికల్ కౌన్సిలింగ్ ద్వారా 150 సీట్లు భర్తీ కానున్నాయి. కాగా, ఆల్ ఇండియా స్థాయి సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభమవగా, 22 సీట్లను భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం విద్యార్థుల కళాశాలలో చేరుతుండగా, త్వరలోనే స్టేట్ కోటాకు సంబంధించిన విద్యార్థుల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానున్నది. దీంతో సంగారెడ్డి మెడికల్ కాలేజీలో 2022-23 తొలిబ్యాచ్ తరగతులు మొదలు పెట్టనున్నారు.
15వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం
సంగారెడ్డి జిల్లా మెడికల్ కాలేజీలో ఈనెల 15వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు హాజరయ్యే అవకాశమున్నది. సంగారెడ్డి మెడికల్ కాలేజీలో చేరిన విద్యార్థులకు మెడికల్ కాలేజీ స్టాఫ్ ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేపట్టారు. సంగారెడ్డి కలెక్టర్ శరత్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అదేరోజు ఎంబీబీఎస్ విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశం జరుగుతుంది. సంగారెడ్డి మెడికల్ కాలేజీ గురించి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.వాణి వివరించనున్నారు. ఆతర్వాత అధికారికంగా తరగతులను ప్రారంభిస్తారు.
బోధనకు సిద్ధంగా సంగారెడ్డి మెడికల్ కాలేజీ ..
సంగారెడ్డి మెడికల్ కాలేజీ బోధనకు సిద్ధంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం రూ.510 కోట్ల నిధులు కేటాయించడంతో భవన నిర్మాణం ఒకటి పూర్తి చేశారు. ఇందులోనే మొదటి బ్యాచ్ తరగతులు ప్రారంభం కానున్నాయి. మెడికల్ కాలేజీ భవనంలో బోధనకు వీలుగా తరగతి గదులు, ల్యాబ్‌రూమ్‌లు, డెమో ల్యాబ్‌లు నాలుగు, ఈ లైబ్రరీ, రీడింగ్ రూములు, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ల్యాబ్‌లను నిర్మించారు. వీటితోపాటు అనాటమీ మ్యూజియం, అనాటమీ డిటెక్షన్హాల్, 20 ఫ్యాకల్టీ గదులు, కంప్యూటర్ ల్యాబ్‌లు, డిపార్టుమెంట్ గదులు, క్యాంటీన్ నిర్మించారు. వీటితోపాటు విద్యార్థులు వైద్య చికిత్సలు నేర్చుకునేందుకు వీలుగా స్కిల్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో పురుష, స్త్రీ శరీరాకృతులు ఉన్న బొమ్మలు ఉంటాయి. ప్రొఫెసర్లు బొమ్మల ద్వారా విద్యార్థులకు బోధన చేయనున్నారు. ఎంబీబీఎస్ విద్యార్థుల కోసం బోధనా దవాఖాన సిద్ధంగా ఉంది. గతంలో ఉన్న జిల్లా కేంద్ర దవాఖానను సంగారెడ్డి మెడికల్ కాలేజీకి అనుబంధంగా బోధనా దవాఖానగా మార్చారు. 450 పడకల బోధనా దవాఖాన ఎంబీబీఎస్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడనుంది. మెడికల్ కాలేజీలోని అన్ని డిపార్టుమెంట్లకు చెందిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు సంగారెడ్డి జనరల్ దవాఖానలో ప్రతిరోజు వైద్య సేవలు అందజేస్తున్నారు. రోగులను పరిశీలించటంతోపాటు అవసరమైన వైద్య చికిత్సలు, శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.

సిబ్బంది నియామకం..
సంగారెడ్డి మెడికల్ కాలేజీలో బోధన సిబ్బంది నియామకాలు పూర్తయ్యాయి. 26 మంది ప్రొఫెసర్లు, 39 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 12 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 61 మంది ఇతర బోధనా సిబ్బందిని నియమించగా, కాలేజీ నిర్వహణకు అవసరమైన పరిపాలనా సిబ్బందిని సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రిన్సిపల్‌తోపాటు అసిస్టెంట్ డైరెక్టర్, నలుగురు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లను, అవసరమైన పరిపాలన సిబ్బందిని నియమించింది. మెడికల్ కాలేజీలో చేరే విద్యార్థులకు కోసం హాస్టల్ భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం తాత్కాలికంగా బాలుర కోసం సంగారెడ్డిలోని బీసీ స్టడీ సర్కిల్లో హాస్టల్‌ను ఏర్పాటు చేశారు. మహిళా ప్రాంగణంలో గర్ల్స్ హాస్టల్‌ను ఏర్పాటు చేశారు.
సంగారెడ్డి మెడికల్ కాలేజీలో చేరేందుకు విద్యార్థుల ఆసక్తి
నూతనంగా ప్రారంభంకానున్న సంగారెడ్డి మెడికల్ కాలేజీలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. జాతీయస్థాయి కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు వివిధ రాష్ర్టాలకు చెందిన విద్యార్థులకు సంగారెడ్డి మెడికల్ కాలేజీలో చేరుతున్నారు. త్వరలోనే స్టేట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నది. స్టేట్ కోటాలో 128 మంది విద్యార్థులు సంగారెడ్డి మెడికల్ కాలేజీలో చేరనున్నారు.
త్వరలో నర్సింగ్ కాలేజీ ఏర్పాటు
ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డికి మెడకల్ కాలేజీతోపాటు నర్సింగ్ కాలేజీని మంజూరు చేశారు. 100 సీట్లతో త్వరలోనే నర్సింగ్ కాలేజీ సంగారెడ్డిలో ఏర్పాటు కానున్నది. అధికారుల సమాచారం మేరకు బీఎస్ నర్సింగ్ కాలేజీ తరగతులు జనవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
సంగారెడ్డి మెడికల్ కాలేజీలో డిపార్టుమెంట్లు
ప్లాస్టిక్ సర్జరీ
న్యూరో సర్జరీ
అనాటమీ
ఫిజియాలజీ
బయోకెమిస్ట్రీ
ఫార్మాకాలజీ
మైక్రోబయాలజీ
పాథాలాజీ
ఫోరెన్సిక్ మెడిసిన్
కమ్యూనిటీ మెడిసిన్
జనరల్ మెడిసిన్
పీడియాట్రిక్స్
డీవీఎల్
రెస్పిరేటరీ మెడిసిన్
సైక్రియాట్రీ
జనరల్ సర్జరీ
ఆర్థోపెడిక్స్
ఈఎన్టీ
ఆప్తమాలజీ
గైనకాలజీ
అనస్తీషియా
రేడియో డయాగ్నాసిస్
గ్యాస్ట్రో ఎంట్రాలజీ
యూరాలజీ