గజ్వేల్, నవంబర్ 1 : అచ్చం ఒకప్పటిలాగే మారిపోయింది రాజీవ్ రహదారి. పచ్చని చెట్లతో అందరికీ ఆహ్లాదాన్ని పంచుతున్నది. ఒకప్పుడు సిద్దిపేట జిల్లాలోని రాజీవ్ రహదారిపై నుంచి ప్రయాణిస్తున్నప్పుడు ఇరువైపులా భారీగా పెరిగిన మర్రి, మామిడి, రావి, వేప చెట్లు ఉండేవి. అప్పట్లో బస్సులు, డీసీఎంలు, లారీలు, ద్విచక్రవాహనాల్లో ఎక్కువగా ప్రయాణించేవారు. కార్లు తక్కువే మరి. రహదారిపై ప్రయాణించే వారు ఎండ తీవ్రతనో… ప్రయాణం కారణంగానో అలసిపోతే రోడ్డు పక్కన పెద్ద చెట్ల కింద సేద తీరేవారు. కానీ, రోడ్డు విస్తరణతో ఆ చెట్లన్నీ నేలమట్టం అయ్యాయి. దీంతో రోడ్డు ఇరుపక్కలా నిలువ నీడ లేకుండా పోయింది. 2014లో గజ్వేల్ ప్రాతినిథ్యం వహించడంతో పాటు తెలంగాణ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని ఖాళీ ప్రదేశాల్లో భారీసంఖ్యలో మొక్కలను నాటడంతో పాటు వాటిని వందశాతం సంరక్షించడంతో అద్భుతమైన హరిత సంపద పెరిగింది.
ప్రతి రహదారి వెంబడి చెట్లు పెరగడంతో ప్రయాణికులకు చల్లగాలులతో పాటు అహ్లాదాన్ని పంచుతున్నాయి. రాజీవ్ రహదారికి ఇరువైపులా పెరిగిన చెట్లతో వచ్చిన మార్పును గమనించిన సీఎం కేసీఆర్ మూడంచెలుగా రహదారికి ఇరుపక్కలా చెట్లను పెంచాలని ఆదేశించారు. దీంతో అప్పటి కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి ఆధ్వర్యంలో అటవీశాఖ అధికారులు మొత్తం 23,164 వేల మొక్కలను ములుగు మండలం లక్ష్మక్కపల్లి నుంచి గజ్వేల్ మండలం కొడకండ్ల వరకు మూడంచెలుగా నాటి సంరక్షించారు. ఇప్పుడు ఏపుగా పెరిగిన చెట్లతో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. రహదారి వెంబడి ప్రజ్ఞాపూర్ మొదలుకొని వంటిమామిడి వరకు చిరు వ్యాపారులు సీజనల్ పండ్లు, మక్కకంకులు, కూరగాయలను ఈ చెట్ల నీడన కూర్చుని విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. వాహనదారులు సైతం చెట్ల అందాలకు ముగ్ధులై కాసేపు వాహనాలను ఆపి సేదతీరి వెళ్తున్నారు. చిరువ్యాపారుల వద్ద పండ్లు, కంకులు కొనుగోలు చేసి వెళ్తున్నారు.
హరితహారంతో చాలా మార్పులు
గజ్వేల్ ప్రాంతంలో హరితహారంతో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నియోజకవర్గంలోని లక్ష్మక్కపల్లి – కొడకండ్ల వరకు రాజీవ్ రహదారికి ఇరువైపులా సీఎం కేసీఆర్ ఆదేశాలతో మల్టీలెవల్ ప్లాంటేషన్‌ను చేపట్టాం. మూడు వరుసల్లో వివిధ స్థాయిలో చెట్లు ఏపుగా పెరిగాయి. చెట్ల సంరక్షణకు అటవీశాఖ అధికారులు, సిబ్బంది బాగా శ్రమించారు. ఫలితంగా ఇప్పుడు రహదారి చాలా అందంగా కనబడుతున్నది. ఇక్కడి అడవులను చూడడానికి వచ్చిన వారు కూడా రాజీవ్ రహదారిని చూసి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజీవ్ రహదారి వెంబడి గుల్మోర్, పెల్టోఫామ్, సుక్రేసియా, రావి, వేప, మర్రి, మేడి, జకరాండ, తెల్లమద్ది లాంటి మొక్కలు నాటాం. భవిష్యత్తులో ఇవి మరింత భారీగా పెరిగి రహదారికి గొడుగులా మారుతాయి. డివైడర్లపై నాటిన మొక్కలు ఏపుగా పెరిగి అందంగా కనబడుతున్నాయి.
– కిరణ్‌కుమార్, ఎఫ్ఆర్వో గజ్వేల్ (సిద్దిపేట జిల్లా)