పుల్కల్, అక్టోబర్ 31 : తాగు, సాగు నీరే లక్ష్యంగా లక్షలాది ప్రజల గొంతుకలను తడుపుతూ, వేలాది ఎకరాల పంటలను సస్యశ్యామలం చేస్తూ, కరెంట్ ఉత్పత్తి చేస్తున్నది సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని సింగూరు ప్రాజెక్టు. ఈ సారి విస్తారంగా వర్షాలు కురవడంతో సింగూరు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం రెండు నెలలుగా పలుమార్లు అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. కాగా, అదే సమయంలో జల విద్యుత్ కేంద్రంలో 7.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే రెండు టైర్బన్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపట్టారు. ప్రాజెక్టు చరిత్రలోనే ఇప్పటి వరకు జులై 22 నుంచి అక్టోబర్24 వరకు 24.68మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పతి నమోదైంది. ఇదిలా ఉండగా ప్రాజెక్టు చరిత్రలోనే ఇది రెండో అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి. కాగా పదేండ్ల కింద 2010-11లో జల విద్యుత్ కేంద్రం ద్వారా 25.68 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి మాదిరిగానే ఈ సారి కూడా రికార్డును సృష్టించిందని ఏడీఈ సౌజన్య, పాండయ్య, రాధిక, నాగేంద్ర కుమార్, అశోక్ తెలిపారు.
ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు వరద రావడంతో సింగూరు ప్రాజెక్టు జలకళతో కళకళలాడుతుంది. ప్రాజెక్టు పూర్తి సామార్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 29.529 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నది. సంవృద్ధ్దిగా వర్షాలు కురవడంతో సింగూరు ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరిందని ఇరిగేషన్ శాఖ డిప్యూటీ ఈఈ నాగరాజు తెలిపారు.
కొన్నేండ్ల కింది గణాంకాలను పరిశీలిస్తే, 2000-01లో 21.9 మిలియన్ల విద్యుత్ ఉత్పత్తి, 2006-07లో 10.07 మిలియన్లు, 2010-11లో 25.6 మిలియన్లు, 2011-12లో 13.5 మిలియన్లు, 2020-21లో 14.01 మిలియన్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కాగా, ఈ సీజన్లో (2021-22) జులై 22 నుంచి అక్టోబర్ 24 వరకు 24.68 మిలియన్లు ఉత్పత్తి అయ్యి మరో మూడు రోజుల్లో విద్యుత్ ఉత్పత్తి పెరగనునన్నదని జల విద్యుత్ శాఖ కేంద్రం అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో కాళేశ్వరం ద్వారా సింగూరు ప్రాజెక్టుకు నీళ్లు అందించేందుకు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. సింగూరు ప్రాజెక్టు నుంచి సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి నీళ్లు అందించి త్వరలోనే జిల్లా సస్యశ్యామలంగా మారనున్నది. ఇదే కాక సింగూరు ప్రాజెక్టులోకి గోదావరి జలాలు రానుండడంతో సాగు, తాగుతో పాటు విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి ఢోకా ఉండదని జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సుమారు 23 ఏండ్లలో 2010-11లో 45 రోజుల పాటు విద్యుత్ ఉత్పత్తి చేయగా, 25.6 మిలియన్ యూనిట్ల విద్యుత్ తయారైంది. దీనిని బ్రేక్ చేసే విధంగా ఈ ఏడాది జులై 22 నుంచి అక్టోబర్ 24 వరకు (మూడు నెలల్లో) 24.68 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యింది. మరో మూడు రోజుల్లోనే మరింతగా విద్యుత్ ఉత్పత్తి పెరిగే అవకాశమున్నది. ఇక్కడ తయారైన విద్యుత్‌ను 132కేవీ ద్వారా సదాశివపేట, జోగిపేటకు సరఫరా చేయడంతో పాటు జిల్లా అవసరాలకు సైతం విద్యుత్‌ను వినియోగిస్తున్నాం. ఇందుకు సహకరిస్తున్న ఇరిగేషన్, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది ప్రత్యేక ధన్యవాదాలు.
-జెన్ కో ఏడీ పాండయ్య