గజ్వేల్, అక్టోబర్ 31: పెద్దలు అన్నట్లు సూక్ష్మంలో మోక్షం అన్న నానుడి కార్తికమాసంలో చేసే పుణ్యకార్యాలకు వర్తిస్తున్నది. కార్తిక మాసంలో చేసిన దీపారాధన, దీపదానం, ఉసిరి, శాలగ్రామ, తాంబూల, స్వయంపాకం తదితర దానాల వల్ల జన్మజన్మల పాపాలు నశించి దానం చేసిన వారికి ఇహంలో రాజభోగాలు, పరంలో సద్గతులు కలుగుతాయన్నది ముమ్మాటికి నిజం. కార్తిక మాసంలో అన్నదానం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుంది. అందులోనూ ద్వాదశి రోజు చేసే సామూహిక వన భోజనాలు, అన్నదానాలు గొప్ప ఫలితాలు ఇస్తాయి. ఇందుకోసమే కార్తిక వన భోజనాలు నిర్వహిస్తుంటారు.
కార్తిక మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అంటారు. ఈ రోజు విష్ణుమూర్తి నిద్రనుంచి మేల్కొంటాడు. ఈ రోజు స్వామివారిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించి, ఉపవాస దీక్షలు ఉంటారు. తెల్లవారి ద్వాదశి రోజు బ్రాహ్మణులకు యధాశక్తి స్వయంపాకం దానం ఇవ్వాలి. శక్తి ఉన్నవారు సామూహిక భోజనాలు కూడా నిర్వహిస్తుంటారు. భోక్తలు భుజించిన తర్వాత దీక్ష తీసుకున్నవారు భోజనం చేసి ఉపవాస దీక్షను విడుస్తారు. కార్త్తిక శుద్ధ ద్వాదశిని చిలుకు ద్వాదశి అని కూడా అంటారు. ఈ రోజు ధాత్రీనారాయణ(ఉసిరిచెట్టు) తులసి కల్యాణం చేయడం జరుగుతుంది. అలాగే సాలగ్రామపూజ, దానం, దీపారాధన, కార్తిక పురాణ పఠనం చేసిన అనంతరం భోజనాలు చేస్తారు. ఈ కార్యక్రమాలన్నీ ఉసిరి చెట్టుకింద నిర్వహిస్తారు. ప్రస్తుతం వన భోజనాలు తోటలు, అడవి ప్రాంతాలతో పాటు ఆలయాల ప్రాంగణాల్లో కూడాఎక్కువ సంఖ్యలో నిర్వహిస్తున్నారు. వనభోజన మహిమ ఎంతో ప్రాశస్తమైనదే కాక పుణ్యాన్ని ఇస్తుంది. అలాగే సంవత్సరం మొత్తం దీపాలు వెలిగించని వారు ఈ రోజు లేదా కార్తిక పౌర్ణమి రోజు 365 వత్తులను ఒకేసారి వెలిగించడం కూడా చేస్తారు. దీపారాధన సకల పాపాలను నశింపజేస్తుంది.
వసిష్టుడు జనక మహారాజుతో… ఓ జనక మహారాజా ! కార్తిక మాసంలో స్నాన, దాన పూజానంతరం శివాలయం, విష్ణు ఆలయంనందుగానీ శ్రీ మద్భవద్గీత పారాయణం తప్పక చేయవలెను. అలా చేసిన వారి సర్వపాపాలు నివృత్తియగును. ఈ కార్తికమాసంలో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్లుదురు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును. చివరకు అందలి శ్లోకములో ఒక్క పాదమైననూ కంఠస్థం చేసిన ఎడల విష్ణుసాన్నిధ్యం పొందుదురు. కార్తిక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండిఉన్న ఉసిరి చెట్టుకింద సాలగ్రామమును యధోచితంగా పూజించి, విష్ణుమూర్తిని ధ్యానించి, ఉసిరిచెట్టు నీడన భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టుకిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలెను. వీలును బట్టి ఉసిరిచెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలెను. ఈ విధంగా చేసిన బ్రాహ్మణపుత్రునకు నీచజన్మముపోయి నిజరూపము కలిగెనుఅని వశిష్టుల వారు చెప్పిరి. అదివిని జనకరాజు “ మునివర్యా! ఆ బ్రాహ్మణ యువకునకు నీచజన్మమేల కలిగెను. దానికి గల కారణమేమి.” యని ప్రశ్నించగా, వశిష్టుల వారు ఈ విధంగా చెప్పనారంభించిరి.
రాజా! కావేరి తీరమునందొక చిన్ని గ్రామమున దేవశర్మయను బ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికొక పుత్రుడు కలడు. వానిపేరు శివశర్మ. శివశర్మ చిన్నతనము నుంచి భయభక్తులు లేక అతి గారాబంగా పెరుగుట వల్ల నీచసహవాసములు చేసి దురాచారపరుడై మెలుగుచుండెను. అతని దురాచారములను చూచి ఒకనాడు అతడి తండ్రి పిలిచి బిడ్డా నీ దురాచారములకు అంతులేకుండాయున్నది. నీ గురించి ప్రజలు పలు విధాలుగా చెప్పుకొనుచుండిరి. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీ వల్ల కలుగుతున్న నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను. కార్తిక మాసమున నదీస్నానం చేసి, శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయాల్లో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగుటయే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును. కావున నీవు అటుల చేయుమని బోధించెను. అంతట కుమారుడు… తండ్రీ స్నానము చేయుట ఒంటి మురికి పోవుటకు మాత్రమే కానీ వేరుకాదు.
స్నానము చేసి పూజలు చేసినంతమాత్రాన భగవంతుడు కనిపించునా, దేవాలయంలో దీపాలు వెలిగించిన లాభమేమి. వాటిని ఇంటిలోన పెట్టుటయే మంచిది కదా అనే వ్యతిరేకార్థముతో పెడసరముగా సమాధానమిచ్చెను. కుమారుడి సమాధానం విని తండ్రి ఓరీ నీచుడా… కార్తిక మాస ఫలమునంత చులకనగా చూస్తున్నావు కావున నీవు అడవిలో రావిచెట్టు తొర్రయందు ఎలుకరూపంలో జీవించుదువుగాక యని కుమారుడిని శపించెను. ఆ శాపముతో కుమారుడు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదాలపైపడి “ తండ్రి క్షమించుము, అజ్ఞానాంధకారంలోపడి దైవమును, దైవకార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావాన్ని గ్రహించలేకపోతిని. ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. నాకు శాపవిమోచనము ఎప్పుడు కలుగునో, దానికి కలిగిన తరుణోపాయమును వివరింపుము.”అనెను. అంతట తండ్రి “ బిడ్డా! నాశాపమును అనుభవించుచూ మూషికమువై పడియుండగా నీవెప్పుడు కార్తిక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తినొందుదువు” అని కుమారుడిని ఊరడించెను. వెంటనే శివశర్మ ఎలుక రూపము పొంది అడవికి వెళ్లి ఒక చెట్టు తొర్రలో జీవించుచూ, ఫలములను తినుచూ జీవించుచుండెను.
ఆ అడవి కావేరీ నదీతీరమునకు సమీపమున ఉండుటచే స్నానార్థమై నదికి చాలా మంది వెళ్లుచుండేవారు. ఇట్లు కొంత కాలం అయిన తర్వాత కార్తిక మాసంలో ఒకరోజు విశ్వామిత్ర మహర్షి శిష్యసమేతముగా కావేరీ నదిలో స్నానర్థమై బయలుదేరారు. అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షం కిందకు వచ్చి శిష్యులకు కార్తిక పురాణమును వినిపించుచుండిరి. ఈ లోగా చెట్టుతొర్రలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరున్న పూజా ద్రవ్యములలో దేనినైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కియుండెను.
అంతలో నొక కిరాతకుడు వీరిజాడ తెలిసికొని, “ వీరు బాటసారులై ఉందురు. వీరివద్దనున్న ధన మపహరించవచ్చు”ననెడు దుర్భుద్ధ్ధితో వారికడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనస్సు మారిపోయింది. వారికి నమస్కరించి “మహానుభావులారా! తమరు ఎవరు. ఎక్కడి నుంచి వచ్చితిరి. మీ దివ్యదర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందం కలుగుచున్నది. గాన, వివరింప్పుడు” అని ప్రాధేయపడెను. అంత విశ్వామిత్రులవారు “ ఓయీ కిరాతకా! మేము కావేరీ నదీ స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానమాచరించి కార్త్తిక పురాణమును పఠించుచున్నాము.
నీవు ఇచ్చట కూర్చుండి సావధానుడవై ఆలకింపుము” అని చెప్పిరి. అటుల కిరాతకుడు కార్తికమహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చి, పురాణ శ్రవణానంతరం వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను. అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగియుండి పురాణమంతయు వినుచుండిన ఎలుకకూ తన వెనుకటి బ్రాహ్మణరూపము నొంది “ మునివర్యా! ధన్యోస్మి, తమ దయవల్ల నేను కూ డా మూషికరూపము నుంచి విముక్తుడనైతి”నని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను. కనుక ఓ జనకా! ఇహములో సిరిసంపదలు, పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్త్తిక పురాణమును చదివి, ఇతరులకు వినిపించవలెను.
8వ రోజు – తోచినవి యధాశక్తి
9వ రోజు – మీకు ఇష్టమైనవి, పితృతర్పణలు
10వ రోజు – గుమ్మడికాయ,
స్వయంపాకం, నూనె
11వ రోజు – విభూతి పండ్లు, దక్షిణ
12వ రోజు – పరిమళ ద్రవ్యాలు,
స్వయంపాకం, రాగి, దక్షిణ
13వ రోజు – మల్లె,జాజి వగైరా పువ్వులు
14వ రోజు – నువ్వులు, ఇనుము,
దున్నపోతు లేదా గేదె
15వ రోజు – వరి అన్నపు భోజనం, వెండి
16వ రోజు – నెయ్యి, సమిధలు,
దక్షిణ, బంగారం
17వ రోజు – ఔషధాలు
18వ రోజు – పులిహోర, అట్లు, బెల్లం
19వ రోజు – నువ్వులు, కుడుములు
20వ రోజు – గో, భూ, సువర్ణదానాలు
21వ రోజు – యధాశక్తి సమస్త దానాలు
22వ రోజు – బంగారం, గోధుమలు,
పట్టుబట్టలు
23వ రోజు – మంగళద్రవ్యాలు
24వ రోజు – ఎర్రచీర, ఎర్ర రవికెలగుడ్డ,
ఎర్రగాజులు, ఎర్రపువ్వులు
25వ రోజు – యధాశక్తి దానములు
26వ రోజు – నిలువ ఉండే సరుకులు
27వ రోజు – ఉసిరి, వెండి, బంగారం,
ధనం, దీపాలు
28వ రోజు – నువ్వులు, ఉసిరి
29వ రోజు – శివలింగం, విభూతి,
పండు, దక్షిణ, బంగారం
30వ రోజు – నువ్వులు, తర్పణలు, ఉసిరి