మెదక్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ)/మెదక్ అర్బన్ : అఖండ భారతానికి ఒక రూపాన్ని తీసుకొచ్చిన మహనీయుడు భారతరత్న సర్దార్ వల్లభాయ్‌పటేల్ అని అధికారులు, ప్రజాప్రతినిధులు కొనియాడారు. కలిసి ఉంటే కలిగే ప్రయోజనాలు వివరిస్తూ సంస్థానాలను విలీనం చేయడంలో పటేల్ కీలక పాత్ర వహించారని తెలిపారు. ఆయన జయంతిని (అక్టోబర్ 31) జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకొంటున్నామన్నారు. ప్రతి ఒక్కరూ దేశ సమైక్యతకు పాటుపడాలని సోమవారం మెదక్ కలెక్టరేట్లోని ప్రజావాణిహాల్లో, జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అధికారులు, ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు.
సంగారెడ్డి కలెక్టరేట్/ సంగారెడ్డి, అక్టోబరు 31: దేశానికి స్వాతంత్య్రం వచ్చినా కొన్ని సంస్థానాల పాలనలో ఉన్న కాశ్మీర్, జునాఘడ్, హైదరాబాద్‌లను దేశంలో విలీనం చేశారని వల్లభాయ్ పటేల్‌ను అధికారులు కొనియాడా రు. సంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో, జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం దేశ సమగ్రత, ఐక్యత, భద్రతను కాపాడేందుకు అంకితమవుతానని, దేశ అంతర్గత భద్రతను పటిష్ట పరిచేందుకు స్వీయ తోడ్పాటు అందిస్తానని ఉద్యోగులు ప్రతిజ్ఞ చేయించారు. వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల అసోసియేషన్ డీన్ శ్రీనివాస్ కుమార్ ఆధ్వర్యంలో వ్యవసాయ, ఇంజినీరింగ్ విద్యార్థులు 2కే రన్‌ను ప్రభుత్వ అతిథిగృహం నుంచి పాత బస్టాండ్ వరకు నిర్వహించారు. ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర ఆధ్వర్యంలో పట్టణంలోని పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.