యాసంగి సీజన్ యాక్షన్ ప్లాన్ను మెదక్, సంగారెడ్డి జిల్లాల వ్యవసాయశాఖలు ఖరారు చేశాయి. సంగారెడ్డి జిల్లాలో 1,48,281 ఎకరాలు, మెదక్ జిల్లాలో 2,43 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవడం, ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో నీళ్లు ఉండడంతో సాగు విస్తీర్ణం మరింత పెరగొచ్చని భావిస్తున్నారు. అధికశాతం రైతులు వరి వైపే మొగ్గుచూపుతుండగా, మొక్కజొన్న, శనగ, చెరకు పంటలు తర్వాత స్థానంలో ఉన్నాయి. రైతులు ఇబ్బంది పడకుండా అవసరమైన యూరియా, డీఏపీ, ఎంవోసీ కాంప్లెక్స్ ఎరువులతో పాటు వరి, జొన్న, మొక్కజొన్న, శనగ, పొద్దుతిరుగుడు తదితర విత్తనాలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
సంగారెడ్డి/మెదక్, అక్టోబర్ 31(నమస్తే తెలంగాణ): వర్షాలు సమృద్ధిగా కురవడం, పుష్కలంగా సాగునీరు అందుబాటులో ఉండడంతో ఈ సారి సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో యాసంగి సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. జిల్లాలో ఇప్పటికే వరి కోతలు ప్రారంభించి, కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యాన్ని తరలిస్తున్నారు. కొన్ని మండలాల్లో మొక్కజొన్న, వేరుశనగ పంటలకు సంబంధించి విత్తనాలు విత్తుతున్నారు. డిసెంబర్ మూడో వారంలో వరి నాట్లు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే జిల్లాలో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయి. వరి సాగులో ప్రస్తుతం ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో యాసంగిలోనూ సాగు విస్తీర్ణం పెరగనున్నది.
ఈ ఏడాది భారీ వర్షాలతో జిల్లాలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. మెదక్ జిల్లాలో ఈసారి 2 లక్షల ఎకరాలకు పైగా పంట పండించారు. యాసంగిలో నూ వరి విస్తీర్ణం 2.10 లక్షల ఎకరాల్లో సాగయ్యేలా వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొత్తం సాగులో 90 శాతం వరి సాగయ్యే అవకాశాలున్నాయి. మొక్కజొన్న, వేరుశనగకు ఈ సీజన్ అనుకూలమైనదిగా భావిస్తున్నారు. రెండో పంటగా మొక్కజొన్న 10 వేల ఎకరాల్లో సాగు చేయనున్నారు.
వానకాలంలో కురిసిన భారీ వర్షాలకు మెదక్ జిల్లాలోని 2,837 చెరువులు, ఘనపూర్, రాయిన్పల్లి, పోచారం ప్రాజెక్టుల్లోకి భారీగా నీళ్లు చేరాయి. దీంతో యాసంగి పంటలకు ఢోకా లేదని రైతులు చెబుతున్నారు. ప్రతీ ఏడాది ఘనపూర్ ప్రాజెక్టు కింద 25వేల ఎకరాల్లో పంటలు పండగా, ఈసారి చివరి గ్రామాల రైతులు కూడా వరి వేసే అవకాశం ఉంది. పల్లెల్లోని చెరువులు, కుంటలు అలుగు పారుతుండడంతో వాటి కింద ఉన్న పొలాలు కళకళలాడనున్నాయి.
జిల్లాలో యాసంగిలో 1,48,281 ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఈసారి పంటల సాగు విస్తీర్ణం రెండు లక్షల ఎకరాల వరకు ఉండే అవకాశం ఉంది. గతేడాది యాసంగిలో జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ ఏడాది 1,48,281 ఎకరాల్లో పంటలు సాగు కానున్నాయి. వరి 74,421 ఎకరాల్లో, శనగ 30,359 ఎకరాల్లో, చెరుకు 16,260 ఎకరాల్లో సాగవుతాయని అంచనా. వీటితో పాటు జొన్న 15,380 ఎకరాల్లో, కుసుమ 5,476 ఎకరాల్లో, ఇతర పంటలు 6,305 ఎకరాల్లో పంటలు సాగు కానున్నాయి. జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో నీటితో నిండుగా ఉన్నాయి. దీంతో వరి సాగు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వరితో పాటు శనగ, మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచింది. ఎరువులు, విత్తనాలకు రైతులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జిల్లాల్లో అవసరమైన వరి, జొన్న, మొక్కజొన్న, శనగ, పొద్దుతిరుగుడు విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నది.
మెదక్ జిల్లాలో 2.43 లక్షల ఎకరాల్లో యాసంగి పంటలు సాగు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుం డా అన్ని చర్య లు తీసుకుంటున్నాం. ఈ ఏడాది భారీ వర్షాలతో భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగింది. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.
– ఆశాకుమారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి