రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. సోమవారం మెదక్, సంగారెడ్డి కలెక్టరేట్లలో ప్రభుత్వ ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి బండి సంజయ్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మెదక్, సంగారెడ్డి జిల్లాల టీఎన్జీవో అధ్యక్షులు దొంత నరేందర్, సుశీల్‌బాబు మాట్లాడుతూ తెలంగాణ సాధనలో ఉద్యోగ సంఘాల పాత్ర మరువొద్దని, తమ ఉద్యోగాలు, జీవితాలను పణంగా పెట్టి సకల జనుల సమ్మె చేపట్టామని అన్నారు. తమపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మెదక్, అక్టోబర్ 31 ( నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ టీఎన్జీవో నాయకులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మెదక్ జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు దొంత నరేందర్ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా ఉద్యోగులు నల్ల బ్యాడ్జిలతో సోమవారం విధులకు హాజరై నిరసన తెలిపారు. స్థానిక నీటిపారుదల శాఖ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం లో అన్ని వర్గాల ఉద్యోగులు, ప్రజలందరినీ ఏకం చేసి 16 రోజుల సహాయ నిరాకరణ, 42 రోజుల సకలజనుల సమ్మె చేశామన్నారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం ఏ పార్టీ ముందుకొచ్చినా మద్దతు తెలుపుతూ వారి బాటన నడిచింది టీఎన్జీవోలు కాదా అని ప్రశ్నించారు. అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తలపెట్టిన పోరుయాత్రను విజయవంతం చేసింది తాము కాదా అని మండిపడ్డారు. బండి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బేషరతుగా ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మినీకి రాజ్‌కుమార్, ఉపాధ్యక్షులు ఎండీ ఎక్బాల్బాషా, సంయుక్త కార్యదర్శి టి.రాధ, మెదక్ యూనిట్ అధ్యక్షుడు పంపరి శివాజీ, డీఈలు శివనాగరాజు, వత్సల, ఏఈఈ శ్రీహరిగౌడ్, మంద శేఖర్, సంతోశ్, సలీం, కృష్ణ, శ్రీధర్, ప్రసాద్, రేణుక పాల్గొన్నారు.
సంగారెడ్డి, అక్టోబర్31: ఉద్యోగులు రాజకీయాలకు అతీతంగా పని చేసేవారని, వారిపై విమర్శలు చేస్తే సహించేది లేదని టీన్జీవో సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సుశీల్‌బాబు అన్నారు. బండి వ్యాఖ్యలను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్ ఎదుట నిరసన చేశారు. ఈ సందర్భంగా సుశీల్‌బాబు మాట్లాడుతూ ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని, తగిన బుద్ధిచెబుతామని హెచ్చరించారు. స్వరాష్ట్ర సాధనలో ఉద్యోగ సంఘాల పాత్ర మరువొద్దని గుర్తుచేశారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ కేంద్ర సంఘం కార్యదర్శి రవి, జిల్లా సంఘం కార్యదర్శి నర్సింలు, అసోసియేట్ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, కోశాధికారి శ్రీకాంత్, ఉపాధ్యక్షులు నిర్మల, రాజకుమానీ, కేంద్ర సంఘం కార్యవర్గ సభ్యు డు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి భాస్కర్, వసతిగృహ సంక్షేమ అధికారుల రాష్ట్ర సంఘం ఉద్యోగులు పాల్గొన్నారు.