టీఆర్ఎస్ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో మూడు షిఫ్టుల్లో ఉత్పత్తులు చేస్తూ దేశ విదేశాలకు ఎగుమతులు చేస్తూ లక్షలాది మందికి ఉపాధి చూపుతున్న పరిశ్రమలకు ఇప్పుడు డాలర్ భయం పట్టుకున్నది. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుతుండడంతో మన దేశ రూపాయి బక్కచిక్కి పరిశ్రమలపై ప్రభావం చూపుతున్నది. డాలర్‌తో లావాదేవీలు చేసే సమయంలో మన పరిశ్రమలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. ప్రధానంగా ఫార్మా, కెమికల్, ఇంజినీరింగ్ ఉత్పత్తులకు ఉమ్మడి మెదక్ జిల్లాలోని పటాన్చెరు ప్రాంతం నిలయం. డాలర్ బలపడడం ఈ పరిశ్రమలను ఇబ్బందులను గురిచేస్తున్నది. దీంతో నష్టాలు చవిచూడాల్సి వస్తున్నదని పారిశ్రామిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు. కరోనా తర్వాత విదేశాల నుంచి ఫార్మా ఉత్పత్తులను ఆర్డర్లు తగ్గడంతో ఫార్మా రంగంలో వేగం మందగించింది. అలాగే ఫార్మా, ఇంజినీరింగ్ కంపెనీలకు విదేశాల నుంచే అధిక శాతం ముడిసరుకు , మిషన్లు దిగుమతి చేసుకోవాల్సి వస్తుండడతో డాలర్‌తో మారకం విలువ చేయడంతో ఎక్కువ చెల్లించాల్సి వస్తున్నది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ‘ఆత్మనిర్భర్ భారత్’ను సీరియస్‌గా తీసుకొని పరిశ్రమలను కాపాడాలని పరిశ్రమల వర్గాలు కోరుతున్నాయి.
– పటాన్చెరు, అక్టోబర్ 30
పటాన్చెరు, అక్టోబర్ 30: డాలర్ ఎఫెక్ట్ పారిశ్రామికవాడలపై ప్రభావం చూపుతున్నది. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుతుండడంతో మన దేశ రూపాయి బక్కచిక్కుతున్నది.దీంతో డాలర్‌తో లావాదేవీలు చేసే సమయంలో మన పరిశ్రమలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. ప్రధానంగా ఫార్మా, కెమికల్, ఇంజినీరింగ్ ఉత్పత్తులకు ఉమ్మడి మెదక్ జిల్లా నిలయం. డాలర్ బలపడడం ఈ పరిశ్రమలను ఇబ్బందులను గురిచేస్తున్నది. దీంతో నష్టాలు చవిచూడాల్సి వస్తున్నదని పారిశ్రామిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు. కరోనా మహమ్మారి తర్వాత విదేశాలు ఫార్మా ఉత్పత్తులను అధికంగా ఆర్డర్లు ఇవ్వడం లేదు. దీంతో ఫార్మా రంగంలో వేగం మందగించి ఎగుమతులు తగ్గాయి.
ఫార్మా, ఇంజినీరింగ్ కంపెనీలకు విదేశాల నుంచే అధిక శాతం ముడిసరుకు దిగుబమతి చేసుకోవాల్సి వస్తున్నది. మిషనరీ సైతం విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. దీంతో గతంలో వచ్చిన ధరకు అదనంగా సొమ్ము కడితేనే ఆ సరుకులు మనకు లభిస్తున్నాయి. మన పరిశ్రమలతో పాటు విదేశాల్లో మెడిసిన్, ఇంజినీరింగ్, ఇతర ఉన్నత చదువులు చదువుతున్న మన విద్యార్థులపైనా డాలర్ ప్రభావం ఉన్నది. వీరంతా ఇండియన్ రూపీలో ఫీజు చెల్లించాల్సిన సమయంలో అధికంగా కట్టాల్సి వస్తున్నది. ఇది తల్లిదండ్రులకు ఆర్థికంగా భారంగా మారుతున్నది. విదేశాల నుంచి దిగుమతులు తగ్గించుకుంటేనే మేలని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. కానీ, పెట్రో, డీజిల్, ముడి సరుకులు, మిషినరీల దిగుమతులు తప్పకపోవడంతో డాలర్ పోటు అన్నివర్గాలపై పడుతున్నది. కష్టాల్లో ఉన్న పరిశ్రమలకు ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహాకాలు ఇవ్వడం లేదు. దీంతో పరిశ్రమలు విలవిలలాడుతున్నాయి.
డాలర్ బలుపు…
ప్రపంచ దేశాల కరెన్సీ విలువలన్నీ డాలర్‌తో ముడిపడి ఉం టాయి. విదేశాల నుంచి ఏ వస్తువు దిగుమతి చేసుకోవాలన్నా, ఏ వస్తువును ఎగుమతి చేయాలన్నా డాలర్‌తోనే మన రూపాయలను బదిలీ చేసుకోవాలి. డాలర్ విలువతో మన రూపీ విలువను మార్కెట్ నిర్ధారిస్తుంది. ప్రపంచ దేశాలకు పెద్దన్నగా ఉన్న అమెరికా తన యూఎస్ డాలర్ ప్రామాణికంగా చెలామణి అయ్యేలా సామ, దాన దండోపాయాలు అమలు చేస్తుండడంతో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ డాలర్ మారకంతోనే వ్యాపారం కొనసాగిస్తున్నాయి. కరోనా సమయంలో డాలర్ నోట్లను అమెరికా అధిక మొత్తంలో ముద్రించిందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో తన ప్రజల కొనుగోలు శక్తిని యూఎస్ పెంచుకున్నది. అధిక డబ్బు ప్రజల వద్ద ఉండటంతో డిమాండ్‌కు సరిపడా సరుకులు మార్కెట్లో లేక వస్తువుల ధరలకు రెక్కలు వస్తున్నాయి.
అధిక ధరలను నియంత్రించేందుకు అమెరికా ఇప్పుడు జనవాడకంలో ఉన్న అధిక డాలర్లను తిరిగి రాబడుతున్నది. బ్యాంక్ డిపాజిట్లపై అధిక వడ్డీ ఆఫర్లు ఇచ్చి డాలర్లను సేకరిస్తున్నది. ఇప్పటికే అమెరికా డాలర్లు నిల్వ ఉన్న ప్రపంచ దేశాలపైన ఆ ప్రభావం పడుతున్నది. ఒకప్పుడు డాలర్ విలువను బంగారం నిలువలతో నిర్ధారించేవారు. డాలర్ విలువకు తగ్గ బంగారం నిలువలు అమెరికాలో లేకపోవడంతో ఇప్పుడు డాలర్ విలువను బంగారం, వెండితో సంబంధం లేకుండా ఫియట్ కరెన్సీగా నిర్ధారించారు. అమెరికా విధానాలు ప్రపంచ దేశాల కరెన్సీ విలువను తగ్గిస్తున్నది. ఆ ప్రభావం మన దేశ కరెన్సీపైనా పడింది. డాలర్ విలువ మాత్రం వారు తీసుకుంటున్న చర్యలతో వడివడిగా పెరుగుతున్నది. ఈ బలుపు కారణంగా మన దేశంలోని అన్ని రంగా లు ప్రభావితం అవుతున్నాయి. అందరూ వాడే పెట్రో,డీజిల్, వంట గ్యాస్ దిగుమతులు, సేవారంగం, ఫార్మా రంగం, ఇంజినీరింగ్ పారిశ్రామిక రంగాలపై ప్రధానంగా ప్రభావం చూపుతున్నది.
ప్రభావిత రంగాలు ఇవే…
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామికవాడ ఆసియాలోనే పెద్దది. మెదక్ జిల్లాలోనూ అనేక పరిశ్రమలు ఉన్నా యి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రపంచస్థాయి ఫార్మా పరిశ్రమలు ఉన్నాయి. కెమికల్ పరిశ్రమలు ఎక్కువగా ఉ న్నాయి. బల్క్డగ్స్ సరఫరా చేసే కంపెనీలు అధికంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఉన్న వేలాది పరిశ్రమలు అధికంగా దిగుమతులపైననే ఆధారపడి ఉన్నాయి. బల్క్‌డ్రగ్ పరిశ్రమలకు, ఫార్మా పరిశ్రమలకు విదేశాల నుంచి వంచే ముడిసరుకే కీలకం. సాల్వెంట్స్, కెమికల్స్, ఇతర ముఖ్యమైన పరికరాలు దిగుమతుల ద్వారానే సరఫరా అవుతాయి. ఇంజినీరింగ్ పరిశ్రమల్లో వచ్చే ముడి సరుకు, మిషనరీస్లో అధిక శాతం దిగుమతులపైనే మనం ఆధారపడుతున్నాం. చైనా, రష్యా, ఆఫ్రికా దేశాల నుంచి ఖనిజాలు దిగుమతి చేసుకుంటున్నారు. ఎక్కువగా విదేశాలకు ఎగుమతులు చేసే ఫార్మా, బల్క్‌డ్రగ్ ఉత్పత్తులకు ఇప్పుడు డిమాండ్ తగ్గింది.
విదేశాల్లో ఫార్మా ఉత్పత్తులను తక్కువగా దిగుమతి చేసుకుంటుండటంతో ఆ పరిశ్రమల లాభాలపైన ప్రభావం చూపుతున్నది. పెట్రో, డీజిల్, వంటగ్యాస్ వంటివి కూడా దిగుమతులపైనే మనదేశం ఆధారపడడంతో ప్రతీది డాలర్‌తో మారకం జరిగి నష్టాలకు కారణం అవుతున్నది. దిగుమతులు చేసే ప్రతి వస్తువుకు అధికంగా డబ్బులు చెల్లించాల్సి వస్తున్నది. ఎగుమతి చేసే వస్తువులు తక్కువగా ఉండటంతో మరోరకంగా లాభాలు తగ్గుతున్నాయి. దీంతో పారిశ్రామికవేత్తలు నష్టాలను చూస్తున్నారు. మరో పక్క ఎగుమతి ఆర్డర్లు డాలర్‌తో రేట్లు ఫిక్స్ అయినా, మన వద్ద పరిస్థితిని చూసి గ్రహించిన విదేశీ వ్యాపారులు లాభాలు ఇచ్చేందుకు నిరాకరిస్తూ డిస్కౌంట్లు ఆడుతున్నారని సమాచారం. డాలర్ విలువ పెరగడంతో వచ్చే లాభాలను కూడా ఇచ్చేందుకు విదేశీ వ్యాపారులు కొర్రీలు పెడుతున్నారు. ప్రపంచ దేశాల్లో పరిశ్రమల మధ్య పోటీ పెరగడంతో వచ్చిన ఆర్డర్లను నిలుపుకోవడం తలకు మించిన భారంగా మారుతున్నదని పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో సర్కారు చక్కటి మౌలిక వసతులు కల్పించినా, నాణ్యమైన విద్యుత్‌ను అందజేసినా ప్రపంచ మార్కెట్లో డాలర్ రేటు పెరగడం పరిశ్రమకు శాపంగా మారుతున్నది.
వివిధ పారిశ్రామిక వాడలు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో బొల్లారంలో దాదాపు 250 పరిశ్రమలు, పాశమైలారంలో 450 పరిశ్రమలు, పటాన్చెరులో 200 పరిశ్రమలు, ఇస్నాపూర్, చిట్కుల్, రుద్రారం, నందిగామ, కర్ధనూర్, గండిగూడ, సుల్తాన్‌పూర్‌లో 150 వరకు, గడ్డపోతారం, కాజీపల్లిలో 150 పరిశ్రమలు ఉత్పత్తులు తీస్తున్నాయి. దాదాపుగా 1200 కంపెనీలు నియోజకవర్గంలో ఉత్పత్తులు తయారు చేస్తున్నాయి. వీటితో పాటు బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఓడీఎఫ్ వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఉన్నాయి. బీహెచ్ఈఎల్కు అనుబంధంగా అన్సలరీ యూనిట్లు ఉన్నాయి. వీటిలో దాదాపు లక్షమంది వరకు కార్మికులు, సిబ్బంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. మరో ముప్పై వేలమంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఫార్మా, బల్క్‌డ్రగ్, కెమికల్ పరిశ్రమలతో పాటు ఇంజినీరింగ్ పరిశ్రమలు, ఫుడ్ ఇండస్ట్రీస్, ఆగ్రో ఇండస్ట్రీస్‌తో పాటు ఎల్రక్ట్రికల్ పరిశ్రమలు, ఆటోమొబైల్, ఇప్పుడిప్పుడే సాఫ్ట్వేర్ పరిశ్రమలు ప్రారంభమవుతున్నాయి. పలు వ్యాపార సంస్థలు విదేశాలకు సేవలందిస్తూ ఆర్జిస్తున్నాయి.
డాలర్ ఎఫెక్ట్‌తో సతమతమవుతున్నాం..
డాలర్ ఎఫెక్ట్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అనేక పరిశ్రమలు విదేశాల నుంచి మిషిన్లు, ముడి సరుకును దిగుమతి చేసుకుంటున్నాయి. చైనా వంటి దేశాల నుంచి వచ్చే అనేక సామగ్రి, మిషనరీల దిగుమతితోనే మన పరిశ్రమలకు మనుగడ. డాలర్‌తో మన రూపాయిని ఎక్సేంజ్ చేసుకుంటే అధికంగా నష్టపోతున్నారు. డాలర్ రేటు పెరిగిపోవడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ప్రతి వస్తువు ధర పెరిగిపోతున్నది. కోట్ల రూపాయల టర్నోవర్ చేసే సంస్థలకు నష్టాలు వస్తున్నాయి. పోటీ ప్రపంచంలో తక్కువ ధరకు టెండర్లు, ఆర్డర్లు పొందిన వారికి డాలర్ బలోపేతం కావడం నష్టాలకు కారణం అవుతున్నది. మన రూపాయి పటిష్టంగా మనకు కనిపించినా, అన్ని దేశాల్లో డాలర్‌తోనే వ్యవహారాలు జరపాల్సి రావడంతో సమస్యకు కారణం అవుతున్నది. అమెరికా ఏకపక్ష విధానాలతో డాలర్ బలపడుతున్నది. బ్రిక్స్ దేశాలు డాలర్‌కు ప్రత్యామ్నాయం తెస్తే బాగుంటుంది.తద్వారా అప్పుడు మన రూపాయికి సరైన ధర వచ్చే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ‘ఆత్మనిర్భర్ భారత్’ను సీరియస్‌గా తీసుకొని పరిశ్రమలను కాపాడుకోవాలి.
– చందుకుమార్ పొట్టి, సెక్రటరీ సంగారెడ్డి కౌన్సిల్, పారిశ్రామికవేత్త