మెదక్ మున్సిపాలిటీ, అక్టోబర్ 30: పేదరికం చదువుకు ఆటంకం కావద్దనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉపకార వేతనం అందిస్తూ భరోసా కల్పిస్తున్నది. 8వ తరగతిలో డ్రాపౌట్స్‌ను నివారించేందుకు ఏటా నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎస్ఎంఎంఎస్)తో ప్రోత్సాహిస్తున్నది. ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్ రెండో సంవత్సరం వరకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఉపకార వేతనం అందజేస్తున్నది. 2022-23 విద్యా సంవత్సరంలో జిల్లా పరిషత్, మోడల్, ఎయిడెడ్ తదితర ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్కు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3.50 లక్షలు ఉండాలి. ప్రస్తుతం 8వ తరగతి చదువుతూ 7వ తరగతిలో జనరల్, బీసీ కులానికి చెందిన వారు 55 శాతం, ఎస్సీ, ఎస్టీలు 50 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు మాత్రమే పరీక్ష రాసేందుకు అర్హులు. జనరల్, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీలు రూ.50 ఫీజు చెల్లించాలి. ఆన్లైన్లో http//bse.telangana.gov.in ఎస్బీఐ కలెక్ట్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించాలి.
డిసెంబర్ 18న రాత పరీక్ష..
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో విద్యార్థులకు ఈ ఏడాది డిసెంబర్ 18న ఎస్ఎంఎంఎస్ రాత పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషల్లో పరీక్ష ఉంటుంది. జిల్లాలో మెదక్, నర్సాపూర్, తూప్రాన్‌లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పరీక్ష రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి మెంటల్ ఎబిలిటి, రెండోది అప్టిట్యూట్ టెస్ట్. ఇందులో 7, 8వ తరగతి పాఠ్య పుస్తకాల్లోని సైన్స్, గణితం, సామాజిక అధ్యయనాల్లో 90 మార్కుల చొప్పున 180 మార్కులు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఇస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష నిర్వహిస్తారు. కనీస మార్కులు 40 శాతం, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 32 శాతం కటాఫ్‌గా నిర్ణయించారు. ఎంపిక సమయంలో రిజర్వేషన్ నిబంధనలు పాటిస్తారు.
విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
ఎస్ఎంఎంఎస్ పథకాన్ని వి ద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు నవంబర్ 7 లోగా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత పరీక్షలో ప్రతిభ కనబరిస్తే నాలుగేండ్ల పాటు ఏటా రు.12 వేల చొప్పున స్కాలర్షిప్ అందజేస్తారు. – రమేశ్‌కుమార్, డీఈవో, మెదక్