పాపన్నపేట, అక్టోబర్30: కొందరు పోలీసు అధికారుల నిర్లక్ష్యం మరికొందరికి శాపంగా మారుతున్నది. పాపన్నపేట మండలంలోని మల్లంపేట గ్రామానికి చెందిన ఎంబడి రాంరెడ్డికి టీఎస్15 యూబీ 3155 నెంబర్ గల లారీ ఉంది. దీనిపై ఆధారపడి అతడి కుటుంబం జీవనం సాగిస్తున్నారు. ఈ లారీ ఈనెల 24న పాపన్నపేట మండలంలోని లక్ష్మీనగర్‌లోని ఒక రైస్ మిల్లులో బియ్యం లోడ్ చేసుకుని ఇదే మండల పరిధిలోని నార్సింగి గ్రామ శివారులో ఉన్న గోదాంలో లోడ్ ఖాళీ చేయడానికి వెళ్లింది. ఆ రోజు నుంచి ఈ నెల 30 వరకు లోడ్ ఖాళీ కాకపోవడంతో అదే గోదాంలో ఉంది.
అనుకోకుండా ఈ నెల 29న ఉదయం రాంరెడ్డి లారీ సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్నట్లు రూ.1100 ఫైన్ వేస్తున్నట్లు సమాచారంతో కూడుకున్న మేసేజ్ ఆదివారం ఉదయం రాంరెడ్డి ఫోన్‌కు వచ్చింది. దీంతో అతడు అవాక్కయ్యాడు. తమ లారీ ఈనెల 24 నుంచి ఆదివారం ఉదయం వరకు అన్ లోడ్ కాకపోవడంతో నార్సింగి శివారులో గల గోదాంలో ఉండగా తమకు ఫైన్ పడడం ఏమిటని ఆయన ఆందోళన గురయ్యాడు. ఏమీ అర్థం కాక టీఎస్ ఈ చలాన్ ఓపెన్ చేసి చూడగా లారీ స్థానంలో ఫోర్ వీలర్ ఆటో ఫొటో పంపుతూ ఇతడికి ఫైన్ వేశారు.
ఆందోళన గురైన రాంరెడ్డి చలాన్ పూర్తిగా పరిశీలించగా లారీ స్థానంలో ఆటో ఉంది. ఆటో నంబర్‌కు లారీ నెంబర్‌కు తేడా చూడగా రెండు అంకెల మార్పు కనిపించింది. లారీ నెంబర్ టీఎస్ 15 యూబీ3155 కాగా, ఆటో నెంబర్ టీఎస్ 15 యూబీ 3188 ఉంది. ఆటో పశువులు తీసుకెళ్తున్నది. ఇలా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. లారీ డ్రైవర్ చదువుకున్న వ్యక్తి కావడంతో ఈ విషయం గమనించాడు. అధికారులు చేసిన పొరపాటును గుర్తించి ఫైన్ ఉపసంహరించుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.