మనోహరాబాద్, అక్టోబర్ 30 : బాధితురాలు తేజశ్రీకి న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని ముదిరాజ్ మహాసభ ఆయా జిల్లాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పేర్కొ న్నారు. మనోహరాబాద్ జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి, పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం తూప్రాన్ డీఎస్పీ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మనోహరాబాద్ మండలం ధర్మరాజుపల్లి గ్రామానికి చెందిన తేజశ్రీ ముదిరాజ్‌ను అదే గ్రామానికి చెందిన యశ్వంత్‌రెడ్డి ప్రేమించి, ఈ నెల 19న నాచారం దేవస్థానంలో వివాహం చేసుకుని, తూప్రాన్‌లో కాపురం పెట్టాడన్నారు. వివాహామై న రెండురోజులకు కుటుంబ సభ్యుల మాటలు విని తేజశ్రీని యశ్వంత్‌రెడి వదిలిపెట్టాడని ఆరోపించారు.
ప్రస్తుతం ఆమె ను వదిలించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరో పించారు. తూప్రాన్, మనోహరాబాద్ పోలీస్స్టేషన్లలో బాధితురాలు న్యాయం చేయాలని కోరినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదన్నారు. ఈ విషయం తమదృష్టికి రావడం తో 13 జిల్లాల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, కార్యవర్గం తో బాధితురాలికి మద్దతుగా నిలబడ్డామన్నారు. తేజశ్రీని భేషరతుగా యశ్వంత్‌రెడ్డి వద్దకు చేర్చాలని, లేకుంటే జిల్లా, మండల కేంద్రాల్లో ఆందోళనలను ఉధృత్తం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగ్ ముదిరాజ్, జిల్లాల అధ్యక్షులు శైలేంద్ర శివయ్య, బైండ్ల సత్యనారాయణ, శంకర్, ప్రధాన కార్యదర్శులు సదానందం, కార్తీక్, రాష్ట్ర నాయకుడు భాషబోయిన చంద్రశేఖర్ ముదిరాజ్, నాయకులు కూచా రం నరేశ్ ముదిరాజ్, బాలకృష్ణ ముదిరాజ్ పాల్గొన్నారు.