రామచంద్రాపురం, అక్టోబర్ 30: ప్రాంతాలుగా విడిపోయినప్పటికీ తెలుగు వారందరూ కలిసిమెలిసి ఉండాలని కేంద్ర మాజీమంత్రి, ఏపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం భెల్లో నిర్వహించిన శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం 56వ కార్తిక వనసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆల్ ఇండియా కాపుసంఘం అధ్యక్షుడు అరవ రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాముడు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. అనంతరం ప్రముఖులు వనభోజనాల కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ర్టాలుగా విడిపోయినప్పటికీ ప్రజలందరూ కలిసిమెలిసి జీవిస్తున్నారని తెలిపారు. రెండు రాష్ర్టాలు స్నేహభావంతో కలిసి ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. తెలంగాణలో అన్నివర్గాలు, ప్రాంతాల ప్రజలు సంతోషంగా బతుకుతున్నారని చెప్పారు. కాపు కులంలోని యువకులను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు కుల పెద్దలు కృషి చేయాలన్నారు. అనంతరం బాజిరెడ్డి గోవర్ధన్, వంగవీటి రాధకృష్ణ, జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కాపులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. కాపు కులంలోని పేదలకు మనం అండగా నిలువాలన్నారు.
యువతకు విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి, వారిని నిపుణులుగా తీర్చిదిద్ది సమాజంలో మార్పునకు కులం భాగస్వామ్యం కావాలని జేడీ లక్ష్మీనారాయణ సూచించారు. అనంతరం ఆల్ ఇండియా కాపు సంఘం అధ్యక్షుడు అరవరామకృష్ణ మాట్లాడుతూ భెల్లో నిర్వహించిన కాపు సంఘం కార్తిక వనభోజనాలకు దాదాపుగా పదిహేను వేల మంది కులస్తులు హాజరుకావడం చాలా సంతోషంగా ఉన్నదన్నారు. 56 ఏండ్లుగా కార్తిక వనభోజనాలను నిర్వహిస్తు కాపు కులస్తులను ఏకతాటిపైకి తెస్తున్నట్లు చెప్పారు. అనంతరం విద్యార్థులకు రూ.7 లక్షల వరకు ఉపకార వేతనాలు అందజేశారు. గామన్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కాపు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.