నాడు రోడ్డంటే తెలియని పల్లెలుండేవి. నేడు రోడ్డు లేని గ్రామం అనే మాటే లేకుండా చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. గతంలో గతుకులు, బురద దారులు.. కల్వర్టులు లేని రోడ్లు దర్శనమిచ్చేవి. బురదలో ఆటోలు దిగబడేవి. రోడ్ల కోసం బురదలోనే నిరసన తెలిపిన ఘటనలు అనేకం. రోడ్ల అభివృద్ధితో నేడు ప్రయాణం సుఖవంతంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రోడ్ల అభివృద్ధికి టీఆర్ఎస్ సర్కార్ పెద్దపీట వేసింది. మారుమూల ప్రాంతాల్లోని రోడ్లను సైతం అభివృద్ధి చేసింది. దీంతో ప్రయాణం సాఫీగా సాగుతున్నది. ఇదంతా సీఎం కేసీఆర్ చొరవేనని ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఒకప్పుడు బురద రోడ్లు.., గుంతల మయంగా ఉండే రహదారులతో అంబులెన్స్‌లు సైతం రాలేని దుస్థితి. వాగులపై వంతెనలు లేక పల్లె ప్రజల ప్రయాణం సాహసంగా ఉండేది… కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీను మారింది. ప్రతి గ్రామానికి సీఎం కేసీఆర్ ‘అభివృద్ధి మార్గాలు’ వేశారు. ఎన్నో ఇబ్బందులను చూసిన ప్రజలే నేడు మా ఊరికి రోడ్డొచ్చిందని సంబుర పడుతున్నారు. ఈ మార్పు తీసుకువచ్చిన టీఆర్ఎస్ సర్కారుకు జేజేలు కొడుతున్నారు.
రామాయంపేట, అక్టోబర్ 29: దశాబ్దం క్రితం తెలంగాణ అంటేనే గతుకులు, బురద రోడ్లు, కల్వర్టులు లేని రహదారులు, రోడ్ల కోసం గ్రామస్తుల పాట్లు.. ఇది పట్టని ప్రభుత్వాలపై ప్రజలు బురదలోనే నిరసనలు తెలిపేవారు. బురద రోడ్లపై ఆటోలు దిగబడితే ప్రయాణికులే బురదలో నుంచి లేపేవారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రోడ్ల అభివృద్ధికి టీఆర్ఎస్ సర్కారు పెద్దపీట వేసింది. గ్రామీణ ప్రాంతాలకు సైతం రహదారుల నిర్మాణాలు చేపట్టడంతో గ్రామీణ ప్రజల ప్రయాణం సాఫీగా సాగుతున్నది. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో అన్ని గ్రామాల రోడ్లు బాగయ్యాయి. నేడు ప్రతి గ్రామానికి ప్రభుత్వం రోడ్లు వేసి, అవసరమైన చోట కల్వర్టులు, వంతెనల నిర్మాణం చేపట్టింది.
అప్పట్లో చాలా తిప్పలు పడ్డాం..
ఉమ్మడి రాష్ట్రంలో సరైన రోడ్లు లేవు. రాత్రి అయ్యిందంటే మాకు వణుకు పుడుతుండే. ఎప్పుడు ఇంటికి చేరుతామోననే భయం ఉంటుండే. వర్షాకాలంలో ఎప్పుడు వాన వస్తుందో, వరద ఎక్కడి నుంచి వస్తుందోననే భయంతో ఇంటికి కాలినడకన వెళ్తుంటిమి. ఒకవేళ వరదగిట్ల వచ్చిందో ఇగ చెట్టు, పుట్ట వెతుక్కునేవాళ్లం. ఎన్ని కష్టాలు పడ్డామో మాకే తెల్వదు.
– కుంట యాదగిరి, ఖాసింపురా, నిజాంపేట(మెదక్ జిల్లా)
సీఎం సార్ మంచిగ చేసిండు..
మా మారుమూల గ్రామాలకు రోడ్లు వేసి సీఎం కేసీఆర్ సార్ మంచిగ చేసిండు. అసలు మాఊరికి రోడ్డే లేకుండే. అటువంటిది ఇప్పుడు మంచిగ రోడ్డువేసిండు. కల్వర్టులను కట్టిండు. బస్సు సౌకర్యం కూడా కల్పించిండు. మాఊర్లకు తెలంగాణ రాష్ట్రంతోనే వెలుగచ్చింది.
– మైలు శ్రీశైలం, ఖాసింపురా, నిజాంపేట (మెదక్ జిల్లా)