అందోల్, అక్టోబర్ 28: అభివృద్ధి పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ అధికారులకు సూచించారు. శుక్రవారం అందోల్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డితో కలిసి అందోల్ నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండలాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ 10 వరకు క్రీడా ప్రాంగణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. హరితహారంలో భాగంగా అన్ని గ్రామాల్లో మూడు కిలోమీటర్లు ఎవెన్యూ ఫ్లాంటేషన్ ఉండాలని, నాటిన మొక్కల నిర్వహణ సరిగా లేనైట్లెతే చర్యలు తప్పవని హెచ్చరించారు. వందశాతం హరితహారం లక్ష్యం పూర్తికావాలని, జియో ట్యాగింగ్ చేయాలన్నారు. గ్రామ సరిహద్దు బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. క్లస్టర్‌కు ఒక వైకుంఠ రథాన్ని, బాడీ ఫ్రీజర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. చాటింపు ద్వారా ఇతర గ్రామాల ప్రజలు వినియోగించుకునేలా తెలియజేయాలన్నారు. వైకుంఠధామాల గోడలపై మంచి స్లోగన్స్ రాయించాలని సూచించారు. డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలను వినియోగించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పొడి చెత్తతో గ్రామపంచాయతీకి ఆదాయం సమకూరేలా చూడాలన్నారు. డ్రైవేస్టు అమ్మకానికి ఏజెన్సీలతో టైఅప్ చేయాలని, గ్రామాల్లో ఎక్కడా చెత్త కనిపించరాదని స్పష్టం చేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నెలాఖరులోగా బ్యాంక్ లింకేజీ లక్ష్యం పూర్తి చేయాలన్నారు. అంగన్వాడీ డే నిర్వహించాలని, గర్భిణుల నమోదు వందశాతం ఉండాలన్నారు. ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లోనే జరగాలన్నారు. వైద్యులు అంకిత భావంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలన్నారు. ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. ధరణి సమస్యలు వెనువెంటనే పరిష్కరించాలని, జాప్యం చేయరాదని రెవెన్యూ అధికారులకు సూచించారు. దళిత బంధు లబ్ధిదారులు ఆర్థికంగా ఎదిగేలా చూడాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీపీవో సురేశ్ మోహన్, అందోల్ నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, నియోజకవర్గ తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సుల్తాన్ పూర్ ‘పల్లె ప్రకృతి వనం’ సూపర్
చౌటకూర్, అక్టోబర్ 28: మండల పరిధిలో సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనం సూపర్‌గా ఉందని సంగారెడ్డి కలెక్టర్ శరత్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మండల పరిధిలోని సుల్తాన్పూర్ ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి వనం బాగుందంటూ పాలకవర్గాన్ని అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలోనే సుల్తాన్పూర్ ఆదర్శంగా నిలిచేలా మహిళా సంఘాలు ముందుకు వచ్చి గ్రామాభివృద్ధికి చేయూతనందించాలన్నారు. వనం పక్కనే మహిళా సంఘాల ఆధ్వర్యంలో టీ పాయింట్‌ను ఏర్పాటు చేస్తే సంఘాల సభ్యులకు ఉపాధి దొరుకుతుందన్నారు. అనంతరం పల్లెప్రకృతి వనాన్ని అందంగా తీర్చిదిద్దడంతో ఎంపీడీవో మధులత, పంచాయతీ పాలకవర్గాన్ని అభినందించారు. కలెక్టర్ వెంట మండల ప్రత్యేకాధికారి వామన్‌రావు, ఆర్డీవో అంబదాస్, డీఎల్పీవో సతీశ్‌రెడ్డి, తహసీల్దార్ కిష్టయ్య, ఎంపీడీవో మధులత, ఏపీవో సంతోశ్, గ్రామ సర్పంచ్ నేత మాణయ్య, ఉప సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, ప్లాంటేషన్ మేనేజర్ మణికుమార్, ఈసీ మహేశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.