గుమ్మడిదల, అక్టోబర్ 27 : జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రమైన వీరన్నగూడెం – బొంతపల్లి భద్రకాళీ సమేత వీర భద్రస్వామి దేవాలయంలో కార్తికమాస పూజలను వైభవంగా నిర్వహిస్తున్నారు. శివకేశవులకు ప్రీతికరమైన కార్తికమాసంలో శివకేశవులను దర్శించుకుంటే పుణ్యం, మనఃశాంతి, ఐష్టెశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వా సం. వీరభద్రస్వామి ఆలయంలో కార్తికమాసంలో నిత్యపూజలు, సత్యనారాయణ వ్రతాలు, రుద్రాభిషేకాలు, నిత్యకల్యాణాలు, తులసి, ఉసిరి చెట్లకు కల్యాణం, పూజ లు, దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. ప్రతి ఆది, సోమవారాల్లో భక్తులు ఆలయానికి భారీగా తరలి వస్తారు. జంటనగరాలైన సికింద్రాబాద్, హైదరాబాద్‌తోపాటు పొరుగు రాష్ర్టాల భక్తులు వీరభద్రస్వామివారిని దర్శించుకుని, కార్తిక దీపాలను వెలిగిస్తారు.
భక్తుల కొంగుబంగారం..
చెడును సంహరిస్తూ.. మంచిని రక్షిస్తూ భక్తుల కోరిన కోర్కెలు తీరుస్తున్న దేవదేవుడే వీరభద్రస్వామి. రుద్రావతారుడు స్వయంభూగా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి-వీరన్నగూడెం గ్రామాల మధ్యలో వెలిసి భక్తుల కొంగుబంగారంగా వెలుగొందుతున్నారు.
కార్తికమాసంలో ప్రత్యేక పూజలు
కార్తికమాసంలో వీరభద్రస్వామి ఆలయం శివన్మాసర్మణలతో మార్మోగనున్నది. స్వామివారికి అభిషేకాలు, బిల్వార్చనలు, అన్నపూజలు నిర్వహిస్తారు. భక్తులు తులసికోటలో కార్తికదీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటారు. భద్రకాళీ అమ్మవారి వద్ద సామూహిక కుంకుమార్చనలు, శ్రీచక్ర పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. వచ్చిన భక్తులకు నిత్యాన్నదానం చేయనున్నారు.
కార్తికపూజలకు ప్రత్యేక ఏర్పాట్లు
వీరభద్రస్వామి ఆలయంలో కార్తిక పూజలను వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు సిద్ధం చేశాం. భక్తులకు తగినట్లుగా ఆలయంలో పూర్తి సౌకర్యాలు కల్పించాము. ఆలయంలో అభిషేకాలు, కల్యాణోత్సవాలు, సామూహిక సత్యనారాయణ వ్రతాలు, రుద్రాభిషేకాలు నిర్వహిస్తాం. నిత్యాన్నదాన వితరణ ఉంటుంది. దైవ దర్శనానికి భక్తులు క్యూ పద్ధతిలో పాటించాలి. భక్తులకు అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటాము. భక్తులకు ఎలాంటి సమస్య ఉన్నా ఆలయ సిబ్బంది దృష్టికి తీసుకునిరావాలి. – శశిధర్‌గుప్తా, ఈవో, వీరభద్రస్వామి దేవాలయం