సిద్దిపేట, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): చేనేత వస్ర్తాలపై కేంద్రం విధించిన జీఎస్టీని ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ నేతకార్మికులు పోరుబాట పట్టారు. ఇప్పటికే నూలు, తయారీ బట్టపై 5 శాతం ట్యాక్స్ విధించిన బీజేపీ ప్రభుత్వం, తాజాగా మరో 7శాతం పెంచుతూ నిర్ణయం తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉండడంతో మంత్రి కేటీఆర్ చేనేత కార్మికుల పక్షాన నిలిచారు. చేనేతకు జీఎస్టీని మినహాయించాలని ప్రధాని మోదీకి స్వయంగా లేఖ రాయడంతో పాటు లక్ష ఉత్తరాలు రాయాలంటూ పిలుపునిచ్చారు. ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఉమ్మడి మెదక్ జిల్లాలోని చేనేత కార్మికులకు అండగా నిలిచారు. జిల్లాలోని ప్రతి చేనేత కార్మికుడు కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీపై పోస్టుకార్డు రాయాలని పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా చేనేత కార్మికులు పోస్టు కార్డులు రాసి మోదీకి పంపించి తమ నిరసన తెలిపారు.
జిల్లాలో చేనేత కార్మికులు పోస్టు కార్డుల ఉద్యమాన్ని ఉధృతం చేశారు. నేత కార్మికులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై భగ్గుమంటున్నారు. చేనేత వస్త్ర ఉత్పత్తులపై కేంద్రం విధించిన జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. చేనేత కార్మికుల తమ సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుకు పోస్టుకార్డులు రాసి పంపిస్తున్నారు. చేనేతకు వాడే ముడి సరుకులు, చేనేత వస్ర్తాలపై 5 శాతం జీఎస్టీ విధించి, దానిని 12 శాతానికి పెంచాలనుకోవడం చేనేత కార్మికుల పాలిట శాపంగా మారింది. చేనేత ముడిసరుకులు,చేనేత వస్ర్తాలపై జీఎస్టీని వెంటనే రద్దు చేయాలి. చాప్టర్ 62,63లో ఉన్న చేనేత సంబంధిత వస్తువులపై గల జీఎస్టీని తొలిగించాలని నేత కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విధానాలతో వందల మంది నేత కార్మికులు తమ ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉంది.
కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ చేనేత కార్మికులు చేస్తున్న పోస్టు కార్డుల ఉద్యమానికి చేనేత జౌళి, పురపాలక, ఐటీ శాఖల మంత్రి తారకరామారావు అండగా నిలిచి నేత కార్మికుల పక్షాన ప్రధాని మోదీకి స్వయంగా పోస్టుకార్డు రాశారు. ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు జిల్లాలోని చేనేత కార్మికులకు అండగా నిలిచారు. జిల్లాలోని ప్రతిఒక్క చేనేత కార్మికుడు కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీపై పోస్టుకార్డు రాయాలని పిలుపునిచ్చారు. మంగళవారం నుంచి జిల్లావ్యాప్తంగా చేనేత కార్మికులు పోస్టుకార్డులను ప్రధానమంత్రికి రాస్తున్నారు. జిల్లాలో సుమారుగా 10వేల కార్డులను రాయనున్నారు. ఆ కార్డులను కార్మిక సంఘాలు కార్మికులకు అందజేశారు. చేనేత కార్మికులందరూ భాగస్వామ్యమై పోస్టుకార్డుల పోరుబాట ఉద్యమాన్ని మరింతగా ఉధృతం చేస్తున్నారు. ఇదిలా ఉంటే సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేటలో నేత కార్మికులు పోస్టుకార్డులు రాసి ప్రధానమంత్రికి పంపారు. ఇలా అన్ని ప్రాంతాల నుంచి రాసిన పోస్టుకార్డులు ప్రధానమంత్రికి పంపుతున్నారు. ఈ ఉద్యమానికి మంచి స్పందన వస్తుంది.
చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్రం కుట్రలు
చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని నేత కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే వివిధ రకాల పన్నులు పెంచడంతో కార్మికులపై మోయలేని భారం పడింది. యాంత్రిక శక్తి లేకుండా ప్రత్యేకమైన ఉత్పత్తులను తయారు చేసే ఎంతో మంది చేనేత కార్మికుల పొట్ట గొట్టేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని కార్మికులు ఆరోపిస్తున్నారు. మోదీ సర్కారు చేనేత వస్ర్తాలపై విధించిన జీఎస్టీ 5 శాతమే మోయలేని భారంగా ఉండగా, దానిని మళ్లీ కేంద్రం 12 శాతం పెంచడానికి యత్నిస్తున్నదని వారు వాపోయారు. తక్షణమే చేనేతపై జీఎస్టీని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 545కు పైగా మగ్గాలు ఉన్నాయి. వీటి ద్వారా ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చేయుతతో ఇవాళ ఒక్కో కార్మికుడు రూ.15 వేలకు పైగా సంపాదించి తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
వారిది రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. సీఎం కేసీఆర్ చేనేత కార్మికులకు అండగా ఉండడంతో ఇవాళ ఆ కుటుంబాలు సంతోషంగా పని చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పేరుతో వస్త్ర పరిశ్రమపై పన్నుపోటు వేసింది. ప్రస్తుతం వస్ర్తాల తయారీపై 5 శాతం ఉన్న జీఎస్టీని 12 శాతానికి పెంచే యత్నాలు చేస్తుంది. దీంతో కేంద్ర సర్కారుకు కోట్ల రూపాయల ఆదాయం సమకూరగా, కార్మికులు, ప్రజలపైన పెనుభారం పడనున్నది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కార్మికుల పొట్టను కొట్టేవిగా ఉన్నాయి. కేంద్రం వస్త్ర పరిశ్రమపై రంగులు, రసాయనాలపై 18 శాతం, తయారైన వస్ర్తాలపై 5 శాతం వేయగా, దీనిని ప్రస్తుతం 12 శాతానికి పెంచుతుంది. నూలు, రంగులు, రసాయనాల ధరలపై పన్నుల మోతతో వాటి రేట్లు భారీగా పెరిగాయి. కిలోకు రూ.140 ఉన్న రంగు ప్రస్తుతం రూ.300 పైగా దాటిందని కార్మికులు చెబుతున్నారు. జీఎస్టీని పూర్తిగా రద్దు చేసే వరకూ తమ పోరాటం ఆగదని చెబుతున్నారు. తక్షణమే జీఎస్టీని రద్దు చేయాలని కేంద్రం ప్రభుత్వాన్ని చేనేత కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
చేనేత వస్ర్తాలపై జీఎస్టీని వెంటనే రద్దు చేయాలి
చేనేత ముడి సరుకులు, చేనేత వస్ర్తాలపై జీఎస్టీని వెంటనే రద్దు చేయాలి. ప్రస్తుతం వస్ర్తాల తయారీపై 5శాతం ఉన్న జీఎస్టీని 12 శాతానికి పెంచే యత్నాలు చేస్తున్నది. చాప్టర్ 62, 63లో ఉన్న చేనేత సంబంధిత వస్తువులపై జీఎస్టీని తొలిగించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నూలు, రంగులు, రసాయనాలపై పన్నుల మోత కారణంగా వాటి రేట్లు భారీగా పెరిగాయి. దీంతో కేంద్రంలోని సర్కారుకు కోట్ల రూపాయల ఆదాయం సమకూరగా, కార్మికులు, ప్రజలపైన పెను భారం పడుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కార్మికుల పొట్టను కొట్టేవిగా ఉన్నాయి. ఇవాళ చేనేత కార్మికులు చేస్తున్న పోరాటానికి అండగా ఉంటాం. సీఎం కేసీఆర్ చేనేత రంగానికి అండగా ఉండి వారికి నేతన్న చేయూత పథకాన్ని తీసుకువచ్చారు. కార్మికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉం టుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించడ మే గాకుండా వాటిని రద్దు చేసే వరకు తమ పోరాటం చేస్తాం.
ప్రధానికి ఉత్తరాలు
చేనేత ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ధూళిమిట్ట మండల కేంద్రానికి చెందిన పలువురు పద్మశాలీ సంఘం నాయకులు ప్రధాని మోదీకి ఉత్తరాలు రాశారు. ఈ సందర్భంగా పద్మశాలీ సంఘం నాయకులు మాట్లాడుతూ కరోనా సంక్షోభంలో చిక్కుకొని విలవిలలాడిన వస్త్ర పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నదన్నారు. ఇలాంటి తరుణంలో కేంద్రం చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని విధించడం అన్యాయమన్నారు. కేంద్ర నిర్ణయంతో చేనేత కార్మికులు ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. దేశంలో వ్యవసాయం తర్వాత అతి పెద్ద ఉపాధి రంగంగా వస్త్ర పరిశ్రమపై లక్షలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నట్లు చెప్పారు. ఒకప్పుడు కళకళలాడిన చేనేత మగ్గాల ఉనికి నేడు జీఎస్టీ పిడుగుతో మిగిలి ఉన్న చేనేత మగ్గాలు సైతం మూలనపడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో పద్మశాలీ సంఘం నాయకులు స్వర్గం లక్ష్మయ్య, బడుగు సాయిలు, గాదాసు రాజు, బడుగు ఓంకార్, కొంగ సాయి, దాసరి రాకేశ్, కొంగ కమలాకర్ ఉన్నారు.
జీఎస్టీ మొత్తానికే రద్దు చేయాలి
దేశ చరిత్రలో చేనేత పరిశ్రమపై జీఎస్టీ విధించిన దాఖలాలు లేవు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే పన్ను పోటు పడింది. ఇది చాలా సిగ్గు చేటు. నేతన్నలకు చేతి నిండా పని కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రూ. 3వేల కోట్ల వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లు ఇచ్చి ఆదుకుంటున్నది. దీంతో, ఆకలి చావులు, ఆత్మహత్యలు పూర్తిగా తగ్గిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరించాల్సింది పోయి పన్ను విధించడం దుర్మార్గం. 12శాతం జీఎస్టీ విధించాలన్న నిర్ణయం వెనక్కి తీసుకుని ఉన్న 5శాతాన్ని కూడా తొలగించాలి. పోస్టుకార్డు ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం.
– చింతా గోపాల్, మున్సిపల్ వైస్ చైర్మన్, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు – సదాశివపేట
పన్నుల భారం మోయలేం
ఇప్పటికే మార్కెట్లో పోటీని తట్టుకోలేకపోతున్నాం. వస్ర్తాల తయారీలో ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో పరిశ్రమను మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో కార్మికులకు చేతి నిండా పని లభించింది. కేంద్రం విధించిన జీఎస్టీ వల్ల ముడి సరుకులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. పెట్టుబడి కూడా రావడం లేదు. వెంటనే జీఎస్టీని రద్దు చేసి పరిశ్రమకు చేయూతనివ్వాలి.
– చిల్వరి వెంకటేశం, చేనేత సహకార సంఘం
చేనేత కార్మికుల నోట్లో మట్టికొడుతుండ్రు
చేనేత కార్మికులకు చేతినిండా పనిలేక ఆగమైతుంటే ఇప్పుడు చేనేత బట్టల మీద జీఎస్టీ అని కేంద్రం పన్నుల మీద పన్నులు ఏసుడేంది. ఇట్లయితే చేనేత కార్మికులు ఎట్ల బతుకేది. రెక్కడితే గాని డొక్కాడని పరిస్థితిలో ఉన్న మాకు జీఎస్టీ అంటే చాలా భారమైతది. చేనేత బట్టలమీద వేసిన జీఎస్టీ పన్నును వెంటనే తీసెయ్యాలె. లేకుంటే మోదీ సర్కారుపై చేనేత కార్మికులమంతా తిరగబడుతాం.
–బడుగు సత్యనారాయణ, చేనేత కార్మికుడు, ధూళిమిట్ట