మెదక్ జిల్లా నెట్వర్క్, అక్టోబర్ 25;మెదక్ జిల్లాలో సోమవారం, మంగళవారం దీపావళి సం బురాలు అంబరాన్నంటాయి. ఆనందోత్సాహాలతో ప్రజలు దీపావళి పండుగను నిర్వహించుకున్నారు. పటాకులు, కాకరవత్తులు, చిచ్చుబుడ్లు కాల్చి, దీపాలను వెలిగించారు. ధన లక్ష్మీని ప్రత్యేకంగా కొలిచి ఐష్టెశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు. వ్యాపారస్తులు తమ దుకాణాలను ప్రత్యేకంగా అలంకరించి లక్ష్మి, సరస్వతీ అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. అక్కాచెల్లెళ్లు సో దరులకు హారతి ఇచ్చి ఆశీర్వదించారు. మహిళలు ప్రమిదలను వెలిగించడంతోపాటు లక్ష్మి పూజలు చేశారు. ప్రజలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇండ్లను దీప కాంతులతో శోభాయమానంగా అలంకరించారు. అమ్మవారి చిత్రపటాలకు నైవేద్యాలు, మంగళహారతులను సమర్పిం చి మొక్కులు తీర్చుకున్నారు. మంగళవారం సూర్యగ్రహణం సందర్భంగా సోమవారం రాత్రి లక్ష్మీ పూజ చేశారు. వ్యాపారుస్తులు లక్ష్మీదేవీ పూజ సందర్భంగా దుకాణాలను ఆరటి, మా మిడి కొమ్మలతోపాటు పూలతో అలంకరించి పూజలు చేశారు. పూజలకు వచ్చిన భక్తులకు ప్రసాదాలను అందజేశారు.